సాగరకన్యలు... సాహస విన్యాసాలు!

జలకన్య... సగం మనిషినీ మరోసగం చేపనీ తలపించే వింత జీవి. అలాంటివాళ్లని కాల్పనిక గాథల్లో, సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. కానీ వాళ్లు నిజంగానే కనిపిస్తే... ఓ అద్భుతంలా  అనిపించదూ... సరిగ్గా ఆ ఫీల్‌ని కలిగించేందుకే కొంతమంది మత్స్యకన్యల్లా మారి గంటలసేపు నీళ్లలో ఈదుతూ విన్యాసాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు.

Updated : 30 May 2024 15:28 IST

జలకన్య... సగం మనిషినీ మరోసగం చేపనీ తలపించే వింత జీవి. అలాంటివాళ్లని కాల్పనిక గాథల్లో, సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. కానీ వాళ్లు నిజంగానే కనిపిస్తే... ఓ అద్భుతంలా  అనిపించదూ... సరిగ్గా ఆ ఫీల్‌ని కలిగించేందుకే కొంతమంది మత్స్యకన్యల్లా మారి గంటలసేపు నీళ్లలో ఈదుతూ విన్యాసాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ‘అండర్‌వాటర్‌ మర్మెయిడ్‌ ప్రదర్శన’ కోసం భాగ్యనగరానికి వచ్చిన కొందరు ఫిలిప్పీన్స్‌ జలకన్యల్ని ‘వసుంధర’ పలకరించింది.


సముద్రంతో ప్రేమలో పడి... అమరీ

మాది మనీలా. మా ఊరి చుట్టూ దీవులే... అయినా నీళ్లలోకి దిగి ఈత కొట్టాలంటే భయం. మేం ముగ్గురం ఆడపిల్లలం. టీచర్‌గా చేస్తూ, అమ్మ ఒంటరిగా మమ్మల్ని పెంచింది. ఆడపిల్లలకు ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలని చెప్పేది. అక్కలిద్దరూ టీచింగ్‌లో స్థిరపడ్డారు. నేను మాత్రం ఏవో చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూనే చదువుకున్నా. అయితే నా బకెట్‌ లిస్ట్‌లో చనిపోయేలోగా స్విమ్‌ చేయాలని రాసుకున్నా. ఓసారి టూర్‌కెళ్లినప్పుడు తోటివారి బలవంతంతో స్కూబా డైవింగ్‌ చేశా. సముద్ర గర్భంలోని మొక్కలూ జంతువులూ చేపలతో కూడిన అందమైన దృశ్యాలు నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. ఈతపై ఆసక్తి పెరిగింది. అలా నీటితో ప్రేమలో పడ్డా. దాంతో సాగరకన్యగా మారితే ఎక్కువసేపు నీళ్లలో ఉండొచ్చనుకుంటూ అందులో శిక్షణ తీసుకున్నా. ఆ తర్వాత టీవీ షోలు, మోడలింగ్‌ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. 500మందికి శిక్షణనీ ఇచ్చా. కాల్పనికగాథల్లోని ఆ మత్స్యకన్యల్లా కనిపించి అందరినీ చకితుల్ని చేయడం... ఎంతో గొప్పగా ఫీలవుతుంటా.


నచ్చింది చేయాలి... సిండీ

ఏడేళ్లప్పుడే ఈత కొట్టడం మొదలుపెట్టా. చిన్నప్పుడు ‘లిటిల్‌ మర్మెయిడ్‌’ అనే సినిమా చూశా. మా జానపద కథల్లో మత్స్యకన్యలు ఎక్కువ. అందుకేనేమో మా దగ్గర భారీ అక్వేరియాల్లో సాగరకన్యల ప్రదర్శనలు జరుగుతుంటాయి. నాకూ అలా ఈదాలనిపించింది. అమ్మతో చెబితే సరేనంది. కోచ్‌ వద్ద చేర్చింది. రెండు కాళ్లకు కలిపి తగిలించే తోక బరువే రెండు కేజీలు ఉంటుంది. మొదట్లో వాటితో ఈదడం కష్టంగా అనిపిస్తుంది. కొంత ప్రావీణ్యం వచ్చాక బరువు తగ్గి తేలికగా అనిపిస్తుంది. ప్రదర్శనలో భాగంగా గంటల తరబడి నీటి అడుగున ఉండాల్సి ఉంటుంది. ఊపిరి బిగబట్టి ఉండాలి.  దీనివల్ల ఆరోగ్యపరంగానూ సమస్యలుంటాయి. యోగా, వ్యాయామాల ద్వారా ఊపిరి బిగబట్టడం నేర్చుకుంటాం. ఎన్ని  జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు ఆక్సిజన్‌ అవసరం వస్తుంది. అలాంటి అత్యవసర పరిస్థితిలో టన్నెల్‌లో మూలగా ఉంచే ఆక్సిజన్‌ సిలిండర్‌ నుంచి గాలిని తీసుకొని తిరిగి విన్యాసాలు చేస్తుంటాం. ఇబ్బందులెన్నున్నా మనసుకు నచ్చింది చేస్తున్నామన్న సంతృప్తి ఉంటుంది.


అంత ఈజీ కాదు... క్రిస్టీనా

మా ఊరు సిబూ. చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రవేశం ఉండాలని నా పదో ఏట అమ్మ ఈత నేర్పించింది. ఆపై పెళ్లీ, పిల్లలతో జీవితం రొటీన్‌గా సాగిపోయేది. అయితే మా ఇద్దరమ్మాయిలకీ దుస్తులు నేనే కుట్టేదాన్ని. ఓసారి స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్సు కాంపిటీషన్‌కోసం జలకన్య దుస్తులు డిజైన్‌ చేశా. అవి చేస్తున్నప్పుడే నాకు ఈ వృత్తిపట్ల ఆసక్తి కలిగింది. అప్పటికే మా దగ్గర చాలామంది ఈ షోలు చేస్తున్నారు. వాళ్లను చూసి నేనూ అలా చేస్తానని మావారిని అడిగా. ‘రిస్క్‌... వద్దు’ అన్నారు. ‘నాకు ఈత బాగా వచ్చు... చేపకన్నా వేగంగా ఈదగలను’ అని నచ్చజెప్పా. సరే అన్నాక కోచ్‌ వద్ద శిక్షణ తీసుకున్నా. మాతృదినోత్సవం సందర్భంగా సిబూ ఓషన్‌ పార్కులో నిర్వహించిన మర్మెయిడ్‌ షోలో పాల్గొన్నా. ఆ ప్రదర్శనలో అంతా ఆశ్చర్యంగా చూస్తుంటే ఎంతో గర్వంగా అనిపించింది. ఇక, అదే నాకు ఇష్టమైన వ్యాపకమైంది. నిజానికి ఇలా ఊపిరి బిగపట్టి నీళ్లలో ఈదడం అంత ఈజీ కాదు. అందుకే ఒకటిన్నర నిమిషంపాటూ నీటి అడుగున ఉండి, తేలుకుంటూ నెమ్మదిగా నీటి అంచువరకూ వచ్చి నిమిషం తర్వాత తిరిగి నీటి కిందకు వెళుతుంటాం. గాలికోసమే అలా వస్తామన్నది చూసేవాళ్లకు తెలియదు. ఇదో టెక్నిక్‌. ఈ విధంగా ఏకబిగిన రెండుగంటలపాటు షో చేయగలను. ఇప్పటికి వందలకొద్దీ షోలు చేశా. వీటివల్ల చర్మం పొడారిపోతుంది. దురద, ఇన్ఫెక్షన్లు... కండరాలు అలసిపోతాయి. జాగ్రత్తలు తీసుకుంటాం.


ఆ షో చూశాకే... ఛాయా

మాది మనీలా. మా ఊరు సముద్ర తీరంలోనే. కానీ ఈత నేర్చుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. పెళ్లయ్యాక ఓసారి అండర్‌ వాటర్‌ స్విమ్మింగ్‌ షో చూడ్డానికి వెళ్లా. అక్కడ రంగురంగుల చేపలు  అటూఇటూ తిరుగుతుంటే కళ్లు విప్పార్చుకుని చూస్తుండిపోయా. ఆ చేపల్లానే ఈతకొడితేనో అనిపించింది. అప్పటికే నాకు ముప్పై అయిదేళ్లు. అయితేనేం... ఏడాదిలోనే ఈతలో ప్రావీణ్యం సాధించా. దాంతోపాటు నీటి అడుగుకు వెళ్లడమూ నేర్చుకున్నా. ఆక్సిజన్‌ సిలిండర్, కాళ్లకు మొప్పలతో వెళ్లడానికి మొదట్లో ఇబ్బందిపడేదాన్ని. మెల్లగా అందులో మెలకువలు తెలిశాయి. ముఖ్యంగా  నీటి లోపల ఎంతో ప్రశాంతంగా అనిపించేది. ఆపై మర్మెయిడ్‌ షో గురించి తెలిసింది. అందులో చేరితే ఆర్ధికంగా నా కాళ్లపై నేను నిలబడొచ్చు అనుకున్నా. అయితే ఆక్సిజన్‌ సిలిండర్‌ లేకుండానే నీటి అడుగున ఈత కొడుతూ విన్యాసాలు చేయాలి. ఏడాది పాటు సాధన చేశా. ఇప్పుడు మత్స్యకన్య షోలు చేయడంతోపాటు ఆసక్తి ఉన్నవారికి శిక్షణ కూడా ఇస్తున్నా. ఈ వృత్తి... నాకు ఆదాయాన్ని ఇవ్వడంతోపాటు నాలో ఆత్మవిశ్వాసాన్నీ పెంచింది. మొదటిసారి ఇండియా వచ్చా. మరిన్ని దేశాలు పర్యటించాలని ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్