వంటింటి ప్రయోగంతో వ్యాపారవేత్తగా ఎదిగి..!

ఉద్యోగం చేసేటప్పుడు ఉన్నట్టుండి ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింది. దాంతో చికిత్స చేయించుకుంటూనే ఆహారపుటలవాట్లూ మార్చుకోవాల్సి వచ్చింది. అదే ఆమెను సేంద్రియ వ్యవసాయంవైపూ మళ్లేలా చేసింది. ఆపై చిరుధాన్యాల ప్రయోజనాలను అందరికీ చేర్చాలనే లక్ష్యం ఆమెను వ్యాపారవేత్తను చేసింది. ‘ఓగ్మో ఫుడ్స్‌’ పేరుతో చిరుధాన్యాల ఉత్పత్తులను దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తున్న సంజీత కేకే స్ఫూర్తి కథనమిది.

Published : 09 Jun 2024 04:28 IST

ఉద్యోగం చేసేటప్పుడు ఉన్నట్టుండి ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింది. దాంతో చికిత్స చేయించుకుంటూనే ఆహారపుటలవాట్లూ మార్చుకోవాల్సి వచ్చింది. అదే ఆమెను సేంద్రియ వ్యవసాయంవైపూ మళ్లేలా చేసింది. ఆపై చిరుధాన్యాల ప్రయోజనాలను అందరికీ చేర్చాలనే లక్ష్యం ఆమెను వ్యాపారవేత్తను చేసింది. ‘ఓగ్మో ఫుడ్స్‌’ పేరుతో చిరుధాన్యాల ఉత్పత్తులను దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తున్న సంజీత కేకే స్ఫూర్తి కథనమిది.

రాజస్థాన్‌కు చెందిన సంజీతకు చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీ అంటే ఆసక్తి. రకరకాల వంటకాలను కెమెరాలో  బంధించడమంటే ఇష్టం. దీంతో బీఎస్‌సీ హెల్త్‌ అండ్‌ న్యూట్రిషన్‌ చదువుతూనే ఫుడ్‌ ఫొటోగ్రఫీ నేర్చుకుంది. ఎంబీఏ మార్కెటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ పూర్తిచేసి కార్పొరేట్‌ సంస్థలో చేరింది. అప్పుడే ఆమెకు పలు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. వాటి నుంచి బయటపడటానికి సంజీత తన ఆహారపుటలవాట్లనూ మార్చుకోవాల్సి వచ్చింది. ఆ అనుభవం ఆరోగ్యానికి సేంద్రియ ఆహారమే సరైన పరిష్కారమనే అవగాహన కలిగించింది. దీన్ని మరికొందరికి అందించాలని  ఉద్యోగానికి రాజీనామా చేసింది. 

నగర శివారున...

‘పోషకాహారం గురించి చెప్పడానికి ఫుడ్‌ బ్లాగ్‌ ‘లైట్‌ బైట్‌’ ప్రారంభించా. పలురకాల వంటకాల ఫొటోలు తీసి పొందుపరిచేదాన్ని. రకరకాల వంటల గురించి బ్లాగ్‌లో పోస్ట్‌ చేసేదాన్ని. ఫుడ్‌బ్లాగర్‌గా ఉంటూనే, సేంద్రియ వ్యవసాయం కూడా చేయాలనిపించింది. దాంతో చెన్నై శివారుల్లోని మధురాంతకంలో 4 ఎకరాలు కొన్నాం. అందులో రసాయనరహితంగా  కూరగాయలను పండించడం మొదలుపెట్టా. అక్కడ స్థానిక రైతుల వ్యవసాయవిధానాలను పరిశీలించేదాన్ని. వరి, గోధుమ పంటలతోపాటు గట్టుపై తమకోసం రోజూవారీ తినడానికి జొన్న, రాగులు, అరికెలు, సామలు, ఊదలు వంటి చిరుధాన్యాలను పండించుకోవడం చూశా. పోషకాలు నిండుగా ఉండి సూపర్‌ఫుడ్స్‌గా పిలిచే వీటిని నేనూ పండిస్తే ఎలా ఉంటుందనుకున్నా’ అంటుంది సంజీత.

ఆ పానీయమే...

మైనర్‌ మిల్లెట్స్‌ గురించి విన్నప్పుడు మొదటిసారిగా వాటి గురించి సంజీత తెలుసుకుంది. ‘ఒకసారి మహిళారైతు ఒకామె  మిల్లెట్‌ పానీయాన్నిచ్చి తాగమంది. తమిళనాడులో ‘కూళు’ అని పిలుస్తారట. రోజూ రెండు గ్లాసులు దీన్ని తాగితే శరీర ఉష్ణోగ్రతలు పెరగకుండా, అలాగే శక్తివంతంగా ఉంటుందని, వేసవిలో ఆరోగ్యానికి మంచిదని చెప్పింది. ఆ పానీయం చాలా రుచిగా ఉంది. ఈ మిల్లెట్స్‌ను పండించడానికి స్థలం, నీరు కూడా ఎక్కువ అవసరం లేకపోవడంవల్ల వీటిపై మరింత అధ్యయనం చేపట్టి, 2012-13 నుంచి ఊదలుసహా రెండుమూడు రకాల చిరుధాన్యాలను పండించడం మొదలుపెట్టా’నని బెబుతుంది సంజీత.

వంటింట్లోనే...

ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజలవణాలు పుష్కలంగా ఉండే చిరుధాన్యాల పంట చేతికొచ్చిన తర్వాత సంజీత వాటితో ఫ్లేక్స్‌ తదితర ఉత్పత్తుల తయారీ రైతులవద్ద నేర్చుకుంది. వంటింట్లో తొలిసారిగా ఓట్స్‌తో భర్త కృష్ణకుమార్‌ కోసం ఫ్లేక్స్‌ ప్రయోగాత్మకంగా తయారుచేసిచ్చింది. సక్సెస్‌కావడంతో మరికొన్నిరకాల ఉత్పత్తులు చేసింది. వీటిని మార్కెట్‌లోకి తీసుకెళ్లడానికి రూ.3 లక్షల పెట్టుబడితో 2017లో ‘ఓగ్మో ఫుడ్స్‌’ ప్రారంభించింది. మొదట నాలుగురకాల ఉత్పత్తులను తయారుచేసి ఆన్‌లైన్‌ వేదికగా విక్రయాలను మొదలుపెట్టింది. క్రమేపీ బిగ్‌ బాస్కెట్, స్పార్, నీలగిరీస్‌ సూపర్‌మార్కెట్‌ ఛెయిన్‌ ఆఫ్‌ చెన్నై, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ ద్వారా వినియోగదారులకు ఈ ఫుడ్స్‌ దగ్గరయ్యాయి. ‘తమిళనాడు నుంచి పుణె, ఒడిశా, భువనేశ్వర్, కర్ణాటక తదితర ప్రాంతాలకు వీటిని పంపుతున్నాం. ఓవర్‌నైట్‌ మిల్లెట్స్, ఓట్స్, మిల్లెట్‌ స్నాక్స్, ఎనర్జీ బైట్స్, ఇడ్లీ, దోశ మిక్స్‌లవంటివి మొత్తం 30 రకాల ఉత్పత్తులను ఇప్పుడు అందిస్తున్నాం. ప్రభుత్వాసుపత్రులు, క్లినిక్స్, పలు కార్పొరేట్‌సంస్థల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. సేంద్రియ పద్ధతిలో పెంచే మిల్లెట్స్‌తో చేసే ఈ ఉత్పత్తులవల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహననూ కలిగిస్తున్నాం’ అంటున్న సంజీత ఉత్పత్తుల సంఖ్యను మరింతగా పెంచుతానంటోంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్