నాడు బేబీ సిట్టర్‌.. నేడు ప్రధానమంత్రి..!

అభివృద్ధి చెందిన దేశాలు అనగానే అమెరికాతో పాటు ఐరోపా దేశాలే ఎక్కువగా గుర్తుకు వస్తుంటాయి. అయితే ఆ దేశాల్లో ఒకటైన ఇటలీకి ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా ప్రధానమంత్రి కాలేకపోయారు. తాజాగా దానిని చెరిపేస్తూ ఇటలీ చరిత్రలోనే జార్జియా మెలోనీ (45) మొదటి మహిళా ప్రధానిగా....

Updated : 28 Sep 2022 12:59 IST

అభివృద్ధి చెందిన దేశాలు అనగానే అమెరికాతో పాటు ఐరోపా దేశాలే ఎక్కువగా గుర్తుకు వస్తుంటాయి. అయితే ఆ దేశాల్లో ఒకటైన ఇటలీకి ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా ప్రధానమంత్రి కాలేకపోయారు. తాజాగా దానిని చెరిపేస్తూ ఇటలీ చరిత్రలోనే జార్జియా మెలోనీ (45) మొదటి మహిళా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఇటీవల ఇటలీ పార్లమెంట్‌కు సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో జార్జియా మెలోనీ అధ్యక్షురాలిగా ఉన్న బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీ 26.37 శాతం ఓట్లు సంపాదించింది. ఆ పార్టీ ప్రధాన భాగస్వామిగా ఉన్న కూటమి 43 శాతానికి పైగా ఓట్లతో ఇటలీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. తద్వారా బ్రదర్స్‌ ఆఫ్ పార్టీ అధినేతగా ఉన్న జార్జియా మెలోనీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో- ‘నా పేరు జార్జియా.. నేనొక మహిళని, నేనొక అమ్మను...’ అంటూ ఎన్నికల్లో ప్రచారం చేసి, ఇప్పుడు ఇటలీ తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న మెలోనీ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు..

❀ జార్జియా మెలోనీ ఇటలీ రాజధాని రోమ్‌లో 1977 జనవరి 15న జన్మించారు. ఆమె తల్లి అన్నా పరాటోర్. ఆమె తండ్రి చిన్నతనంలో కుటుంబాన్ని విడిచిపెట్టారు. దాంతో మెలోనీ బాల్యమంతా తల్లి దగ్గరే సాగింది. పేదరికం వల్ల మెలోనీ చదువుకోలేకపోయారు. పూట గడవడం కోసం బేబీసిట్టర్‌, బార్‌టెండర్‌ ఉద్యోగాలు చేశారు.

❀ చిన్నతనం నుంచే మెలోనీ అతివాద భావజాలానికి ఆకర్షితురాలయ్యారు. 15 ఏళ్ల వయసులోనే ఇటాలియన్‌ సామాజిక ఉద్యమంలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో 21 సంవత్సరాల వయసులోనే స్థానిక ఎన్నికల్లో గెలుపొందారు.

❀ 2006లో జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన మెలోనీ మొదటిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2008లో 31 ఏళ్ల వయసులో బెర్లూస్కోనీ మంత్రివర్గంలో యూత్‌ మినిస్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇటలీలో మంత్రి పదవి దక్కించుకున్న పిన్న వయస్కురాలిగా ఘనత సాధించారు.

❀ మూడేళ్ల పాటు మంత్రి పదవిలో కొనసాగిన ఆమె ప్రధాని నిర్ణయాలను విభేదించి బయటకు వచ్చారు. ఆ తర్వాత అతివాద భావజాలం కలిగిన వ్యక్తులతో కలిసి 2012లో ‘బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ’ అనే పార్టీని స్థాపించారు. అనంతరం ఆ పార్టీకి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.

❀ మెలోనీ వివాహం చేసుకోకుండా ఓ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వారికి ఓ పాప ఉంది.

❀ 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆమె పార్టీ కేవలం నాలుగు శాతం ఓట్లనే సంపాదించుకుంది. అయితే ప్రస్తుత ఎన్నికల్లో దాదాపు 26 శాతానికి పైగా ఓట్లను సాధించి ఏకంగా అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం.

❀ మెలోనీ ఎల్‌జీబీటీ హక్కులకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అలాగే రాజకీయాలతో పాటు వివిధ రంగాల్లో మహిళలకు ప్రత్యేక కోటా ఇవ్వడానికి పూర్తిగా వ్యతిరేకించారు. ఇందుకు బదులుగా స్త్రీలు సొంతంగా ఎదగాలని పిలుపునిచ్చారు. అప్పుడే మహిళలు మరింత శక్తిమంతంగా మారతారని చెప్పారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్