ఇలా చేస్తే స్నేహాల్ని పెంచుకోవచ్చు!

‘ట్రెండు మారినా.. ఫ్రెండు మారడు..’ అంటూ స్నేహితులతో కలిసి సరదాగా ఆడిపాడాలని ఎవరికి ఉండదు చెప్పండి. అయితే మన చుట్టూ ఉన్నవారిలో కొంతమంది ‘నాకు స్నేహితులే లేరు.. నాతో ఎవరూ స్నేహం చేయరు..’ అంటూ బాధపడుతుంటారు.

Published : 25 Nov 2023 19:52 IST

‘ట్రెండు మారినా.. ఫ్రెండు మారడు..’ అంటూ స్నేహితులతో కలిసి సరదాగా ఆడిపాడాలని ఎవరికి ఉండదు చెప్పండి. అయితే మన చుట్టూ ఉన్నవారిలో కొంతమంది ‘నాకు స్నేహితులే లేరు.. నాతో ఎవరూ స్నేహం చేయరు..’ అంటూ బాధపడుతుంటారు. మీరూ అంతేనా?? అయితే కొన్ని అలవాట్లు చేసుకుంటే చాలు.. మీ స్నేహం కోసం అవతలివారే పరుగులు పెట్టుకుంటూ వస్తారంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ అలవాట్లేంటో మనమూ తెలుసుకుందాం రండి..

బాధైనా, సంతోషమైనా.. మనస్ఫూర్తిగా పంచుకునేది స్నేహితులతోనే! అందుకే ప్రతిఒక్కరి జీవితంలోనూ స్నేహానిది ప్రత్యేకమైన పాత్ర! అయితే మనతో స్నేహం చేసేలా ఇతరుల్ని ప్రేరేపించాలంటే ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు.

చిరునవ్వుతో పలకరించండి..

మనకు తారసపడిన కొత్త వ్యక్తుల్లో కొంతమంది మనల్ని చూసి నవ్వుతారు.. ఇంకొందరు చూసి కూడా పట్టించుకోనట్లు ఉంటారు.. మరికొందరు తమ పని మీదే దృష్టి పెడతారు తప్ప పరిసరాల్లో ఏం జరుగుతోందో కూడా గమనించరు.. అయితే వీరిలో మనల్ని చూసి చిరునవ్వు నవ్విన వారిని చూడగానే వారిపై ఒక సానుకూల భావన ఏర్పడుతుంది. కాబట్టి కొత్త వ్యక్తులైనా చూసీచూడగానే చిరునవ్వుతో వారిని పలకరిస్తే.. వాళ్లూ మీతో మాట్లాడడానికి ఆసక్తి చూపుతారు. అలా చిరునవ్వు చుట్టూ ఉన్న వారిని మనకు చేరువ చేస్తుంది. అలాగే వారి దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. తద్వారా స్నేహాల్నీ పెంచుకోవచ్చు.

అభిరుచులతో..!

మీకు ఏం చేయడం అంటే ఇష్టం? పాటలు పాడతారా? డ్యాన్స్ చేస్తారా?? ఇలా మీ అభిరుచి ఏదైనా సరే.. దానిని వెంటనే ఆచరణలో పెట్టేయండి. అలాగే ఇదే అభిరుచి గల వ్యక్తులను మీతో సమయం గడిపేందుకు ఆహ్వానించండి. సోషల్‌ మీడియా ద్వారా ఇది సులభమవుతుంది. ఇలా చేయడం వల్ల ఒకే అభిరుచి కలిగిన వ్యక్తులు ఒక చోట చేరతారు. ఫలితంగా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్‌ పెరుగుతూ.. ఇద్దరూ మంచి స్నేహితులయ్యే అవకాశం ఉంటుంది. అలాగని అవతలి వారి దగ్గర మీకు సంబంధించిన ప్రతి విషయాన్నీ పంచుకోకపోవడం మంచిదని గుర్తుంచుకోండి.

సానుకూల స్పందన..!

సాధారణంగా ఎదుటి వ్యక్తి మనతో మాట్లాడేటప్పుడు రకరకాల అంశాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. వాటి గురించి మనం వీలైనంత మేరకు సానుకూలంగానే స్పందించాలి. అప్పుడే వారికి మనపై సదభిప్రాయం ఏర్పడుతుంది. ‘ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్’ అంటారు. అదీకాకుండా ప్రతికూలంగా స్పందించడం, వారి అభిప్రాయాల్ని కొట్టేయడం వల్ల.. వారి గురించి కూడా వేరే వ్యక్తుల దగ్గర మాట్లాడేటప్పుడు ఇలా నెగెటివ్‌గా మాట్లాడతామేమోనని వారు పొరపడే అవకాశముంటుంది. కాబట్టి చర్చించే అంశాన్ని బట్టి మీ స్పందనని వారికి సానుకూలంగానే తెలియజేయడం ఉత్తమం.

విశ్లేషణా సామర్థ్యం..

ఏదైనా ఒక పని చేసేటప్పుడు లేదా నిర్ణయం తీసుకునేటప్పుడు దాని ద్వారా జరిగే మంచి, చెడులను విశ్లేషించగలగడం చాలా ముఖ్యం. అప్పుడే దాని వల్ల ఇతరులకు మేలు జరుగుతుందా లేదా కీడు వాటిల్లుతుందా అనే విషయం తెలుస్తుంది. ఇలా విశ్లేషించగల సామర్థ్యం కూడా పరోక్షంగా ఇతరులతో స్నేహబంధాన్ని పెంచుతుందంటున్నారు నిపుణులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్