నువ్వే సర్వస్వం అన్నాడు.. అక్కడికెళ్లాక మాట మార్చాడు..!

నేను ఏడాది కాలంగా ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అతను మొదట్లోనే నాతో దీర్ఘకాలిక బంధాన్ని కొనసాగించాలనుకుంటున్నానని చెప్పాడు. దానికి నేను కూడా ఒప్పుకున్నాను. అతను మంచి వ్యక్తి. నన్ను బాగా చూసుకుంటాడు. అయితే అతనికి వేరే దేశంలో జాబ్‌ ఆఫర్‌ రావడంతో రెండు నెలల క్రితం విదేశానికి వెళ్లాడు.

Published : 29 Apr 2024 12:55 IST

నేను ఏడాది కాలంగా ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అతను మొదట్లోనే నాతో దీర్ఘకాలిక బంధాన్ని కొనసాగించాలనుకుంటున్నానని చెప్పాడు. దానికి నేను కూడా ఒప్పుకున్నాను. అతను మంచి వ్యక్తి. నన్ను బాగా చూసుకుంటాడు. అయితే అతనికి వేరే దేశంలో జాబ్‌ ఆఫర్‌ రావడంతో రెండు నెలల క్రితం విదేశానికి వెళ్లాడు. వెళ్లే ముందు ఇద్దరం మాట్లాడుకున్నాం. అప్పుడు ‘నేను ఎక్కడికి వెళ్లినా మన బంధం కొనసాగుతుంది’ అని చెప్పాడు. కానీ, తర్వాత అతను చెప్పినట్టుగా జరగలేదు. నాతో మాట్లాడడం తగ్గించేశాడు. కొత్త ప్రాంతం, పని ఒత్తిడి వల్ల మాట్లాడలేకపోతున్నాడని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. కానీ, కొన్ని రోజుల క్రితం ‘మన బంధం అంత ప్రత్యేకమైనది కాదు’ అని మెసేజ్‌ చేయడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. ఏమైందని అడిగితే ఒక్క బలమైన కారణం కూడా చెప్పలేకపోయాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అతనికి కొంత సమయం ఇవ్వాలా? లేదంటే ఎవరి దారి వారు చూసుకోవాలా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. జీవితాంతం తోడుగా ఉంటానన్న వ్యక్తి ఒక్కసారిగా మాట మార్చడంతో మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో? తెలియక సతమతమవుతున్నారు. ఈ పరిస్థితిలో మీరు ఎంత బాధ అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే  ప్రేమలో పడడం సులభమే అయినా.. ఆ ప్రేమను దీర్ఘకాలిక బంధం వైపు తీసుకెళ్లడం అంత తేలికైన విషయం కాదు. దానికి ఇరువైపుల నుంచి దృఢమైన సంకల్పం ఉండాలి. మీరు ఇలాంటి పరిస్థితిలో మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకుని కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ముందుగా మీ ప్రాధామ్యాలపై ఒక అవగాహనకు రండి. ఆ తర్వాత ఒక తెల్ల కాగితం తీసుకుని ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

అసలు మీకు ఏం కావాలి? 
బంధంలో అవతలి వ్యక్తి నుండి ఏం కోరుకుంటున్నారు?
అతనితో సంబంధం లేకుండా మీకు మీరుగా ఉండడానికి అడ్డుపడుతోన్న అంశాలేంటి?
ఈ విషయంలో మీకు సహాయపడే, మార్గదర్శనం చేసే వ్యక్తులు ఉన్నప్పటికీ వారిని  సద్వినియోగం చేసుకోలేకపోతున్నారా?

ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయడం వల్ల మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడంతో పాటు సరైన మార్గం ఎంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏ వ్యక్తైనా సంతోషంగా ఉండాలంటే మానసికంగా దృఢంగా ఉండడం ఎంతో అవసరం. అలాగే అవసరాలకు తగ్గట్టుగా మీరు నిర్ణయం తీసుకునే విధంగా ఉండాలి. ఈ క్రమంలో ఇతరులు మిమ్మల్ని ప్రభావితం చేయకుండా జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని మర్చిపోకండి. వీటిని పాటించడంతో పాటు మీరు రాసుకున్న సమాధానాలను ఫాలో అయితే కచ్చితంగా మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్