Couples: పెళ్లైన కొత్తలో.. ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త!

నవతరం దంపతుల మధ్య జరిగే గొడవలు చాలా సందర్భాల్లో తారస్థాయికి చేరుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇద్దరూ విడిపోయే పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. ఇందుకు సమస్యను మొదట్లోనే పరిష్కరించుకోకపోవడమే కారణమని రిలేషన్‌షిప్‌....

Published : 25 May 2023 14:29 IST

నవతరం దంపతుల మధ్య జరిగే గొడవలు చాలా సందర్భాల్లో తారస్థాయికి చేరుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇద్దరూ విడిపోయే పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. ఇందుకు సమస్యను మొదట్లోనే పరిష్కరించుకోకపోవడమే కారణమని రిలేషన్‌షిప్‌ నిపుణులు అంటున్నారు. చాలామంది పెళ్లైన మొదట్లోనే జీవిత భాగస్వామితో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల సమయం గడిచేకొద్దీ తీవ్రతరమవుతున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో- ఇరువురి మధ్య అన్యోన్యతకు సంబంధించి పెళ్లైన మొదట్లోనే కనిపించే కొన్ని ప్రమాదకర సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు.

మార్చుకోవచ్చులే...!

ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉండడం అరుదుగా జరుగుతుంటుంది. ముఖ్యంగా దాంపత్య బంధంలో ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉండడం కష్టం. అయితే ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నా.. అవి అవతలి వ్యక్తిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. కానీ, కొంతమంది అవతలి వ్యక్తి అభిప్రాయాలు, ఆలోచనలు, అలవాట్లతో ఇబ్బంది పడుతుంటారు. అయినా ‘నేను మార్చుకుంటాలే’ అనే నమ్మకంతో వాటికి ‘నో’ చెప్పకుండా కాలం గడిపేస్తుంటారు. కానీ, కొంతకాలం తర్వాత అవే అభిప్రాయాలు, ఆలోచనలు, అలవాట్లు గొడవలకు దారితీస్తాయని అంటున్నారు నిపుణులు. కాబట్టి, వీటి గురించి మొదట్లనే ఒక అవగాహనకు రావడం మంచిదని సూచిస్తున్నారు.

అతిగా అంచనాలు పెట్టుకుని...

జీవిత భాగస్వామిగా ఒకరిపై మరొకరు కొన్ని అంచనాలు పెట్టుకుంటారు. అయితే వాటిని ఒకరితో ఒకరు పంచుకోవడం ఎంతో అవసరం. కానీ, కొంతమంది తమ భావాలను జీవిత భాగస్వామితో పంచుకోకుండా వారిపై అతిగా అంచనాలు పెట్టుకుంటారు. అయితే ఎప్పుడైతే వారి అంచనాలు తప్పని తేలుతుందో అప్పటినుంచి ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమవుతాయని అంటున్నారు నిపుణులు. కాబట్టి, వీటి గురించి మొదట్లోనే ఒకరితో ఒకరు పంచుకోవడం అవసరమని సూచిస్తున్నారు.

వారితో మాట్లాడుతూ...

కొంతమంది తమకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా స్నేహితులు, సన్నిహితులతో మాట్లాడడం, కలవడం చేస్తుంటారు. దీనివల్ల వారు తమ బాధను దూరం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. దాంపత్యంలోనూ కొంతమంది ఇలాంటి పద్ధతినే అనుసరిస్తుంటారు. ఫలితంగా సమస్య వచ్చినప్పుడల్లా మానసిక ప్రశాంతత కోసం ఇతరులను కలుస్తుంటారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి స్నేహితుల అనుచిత సలహాల వల్ల సమస్య పెద్దదిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. కాబట్టి దాంపత్యంలో సమస్యను గుర్తించిన వెంటనే దాని గురించి ఇతరులతో పంచుకోకుండా.. దాని పరిష్కారం కోసం ముందు దంపతులిద్దరూ కూర్చుని మాట్లాడుకోవడం మంచిది.

సందేహం కలిగితే..

భార్యాభర్తలన్నాక ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉండాలి. అలాగే జీవిత భాగస్వామి చేసే పనులు, వారి అలవాట్లు, ప్రవర్తన.. మొదలైన అంశాలకు సంబంధించి ఎలాంటి సందేహం వచ్చినా స్వేచ్ఛగా మాట్లాడుకునే వాతావరణం ఉండాలి. కానీ, కొంతమంది ఇలాంటి విషయాల్లో వేచి చూసే ధోరణి అవలంబించడం, పూర్తిగా నిర్లక్ష్యం చేయడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆ సమస్య కాలం గడిచేకొద్దీ మరింత పెద్దదిగా మారే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఇలాంటి వాటిని సందేహం వచ్చినప్పుడే వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.

మళ్లీ పెళ్లి.. వద్దని!

పెళ్లి అనేది జీవితంలో తీసుకునే అతిపెద్ద నిర్ణయం. ఈ క్రమంలో జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడపడంతో పాటు ఎన్నో కష్టసుఖాలను పంచుకుంటారు. ఒక్కసారిగా ఇవన్నీ వదులుకుని తిరిగి మరొక భాగస్వామితో కొత్త జీవితం మొదలు పెట్టాలంటే కష్టమైన విషయం. ఇలాంటి కారణంతో కూడా కొంతమంది దాంపత్యంలో వచ్చే ఇబ్బందులను నిర్లక్ష్యం చేస్తారని నిపుణులు అంటున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్