అపోహలు తొలగిద్దాం.. అవగాహన పెంచుకుందాం..
close
Updated : 01/12/2021 14:01 IST

అపోహలు తొలగిద్దాం.. అవగాహన పెంచుకుందాం..

మానవ జాతిని వణికిస్తోన్న ప్రాణాంతక వ్యాధుల్లో ఎయిడ్స్ కూడా ఒకటి. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఈ వ్యాధికి మందు కనుగొనేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నా ఇప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. అలాగని హెచ్ఐవీ ఏమీ అంటువ్యాధి కాదు. ఈ వ్యాధి కేవలం కొన్ని మార్గాల ద్వారా మాత్రమే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. కానీ కొందరు ఎయిడ్స్, హెచ్ఐవీలపై ఉన్న అపోహల కారణంగా ఈరోజుల్లో కూడా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ; వారిని దూరం పెడుతూ ఉంటారు. ఇవే కాదు.. మన సమాజంలో హెచ్ఐవీ గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. వాటిని తొలగిస్తూ; వ్యాధి గురించి అందరికీ పూర్తి అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 1ని 'ప్రపంచ ఎయిడ్స్ దినం'గా ప్రకటించింది. ఈ ఏడాది ‘‘అసమానతలు నిర్మూలిద్దాం.. ఎయిడ్స్‌ని అంతం చేద్దాం.. మహమ్మారులను తుదముట్టిద్దాం..(End Inequalities. End AIDS. End Pandemics)’’ అనే నినాదంతో ఈ వ్యాధిపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తోంది. ఈ సందర్భంగా ఎయిడ్స్/హెచ్ఐవీ వ్యాధి పట్ల ఉన్న కొన్ని అపోహల గురించి తెలుసుకొని; మరింత అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం రండి.

అపోహ: కండోమ్స్ ధరిస్తే హెచ్ఐవీ రాదు..

హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వ్యక్తితో శృంగారంలో పాల్గొనేటప్పుడు కండోమ్ ధరిస్తే చాలు.. ఆ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు అని చాలామంది అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. శృంగారం సమయంలో కండోమ్ చిరిగిపోవడం, జారిపోవడం, లీక్ అవ్వడం వంటివి జరిగే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటివి జరిగితే హెచ్ఐవీ సోకే ప్రమాదం చాలా ఎక్కువ. అవతలి వారికి హెచ్ఐవీ లేదు అనుకొని కండోమ్ లేకుండా శృంగారంలో పాల్గొనాలనుకున్నా.. ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే కొంతమందికి హెచ్‌ఐవీ సోకినా తాము ఆ వ్యాధితో బాధపడుతున్నామన్న సంగతి తెలియట్లేదని కొన్ని గణాంకాలు రుజువు చేస్తున్నాయి. ఇలాంటివారితో అసురక్షిత లైంగిక చర్యలో పాల్గొంటే హెచ్ఐవీ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇది వెజైనల్ సెక్స్‌కి మాత్రమే కాదు.. యానల్, ఓరల్ సెక్స్‌కి కూడా వర్తిస్తుంది. ఓరల్ సెక్స్ ద్వారా హెచ్ఐవీ వచ్చే అవకాశాలు తక్కువే అయినా పూర్తిగా రాదని చెప్పలేం. అందుకే జాగ్రత్తలు వహించడం మంచిది.

అపోహ: హెచ్ఐవీ సోకితే ఎయిడ్స్ వచ్చినట్లే..

హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ (హెచ్ఐవీ) రక్తంలో ఉండే తెల్ల రక్తకణాల్లో భాగమైన సీడీ4 అనే కణాలను నాశనం చేస్తుంది. ఇవి శరీరంలో ఉండే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ అనారోగ్యానికి గురి కాకుండా మనల్ని కాపాడతాయి. ఈ కణాలు నాశనం కావడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి.. పలు అనారోగ్యాలు తలెత్తే అవకాశం ఉంటుంది. సాధారణంగా హెచ్ఐవీ సోకిన తర్వాత ప్రారంభంలో గుర్తించకుండా అలాగే దీర్ఘకాలం పాటు వదిలేస్తే అది ఎయిడ్స్‌గా రూపాంతరం చెందుతుంది. ఈ క్రమంలోనే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో సీడీ4 కణాల సంఖ్య 200 కంటే తక్కువకు పడిపోతుంటుంది. ఫలితంగా వారిని రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి.

అపోహ: తాకినా హెచ్ఐవీ వ్యాపిస్తుంది..

హెచ్ఐవీ చాలా సున్నితమైన వైరస్. ఇది మన రక్తంలో కాకుండా బయట ఏమాత్రం జీవించలేదు. బాహ్య వాతావరణంలోకి వచ్చిన సెకన్ల వ్యవధిలోనే ఈ వైరస్ మరణిస్తుంది. అందుకే హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులతో కలిసి ఆహారం తిన్నా, వారిని తాకినా ఈ వైరస్ వ్యాప్తి చెందదు. అంతేకాదు.. చెమట, విసర్జితాలు.. వంటి వాటి ద్వారా కూడా ఇది ఒకరి నుంచి మరొకరికి సంక్రమించదు. కాబట్టి ఎయిడ్స్ బాధితులు ఉపయోగించిన వస్తువులను ఎవరైనా నిరభ్యంతరంగా వినియోగించవచ్చు. అంతేకాదు.. వారిని కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం, వ్యక్తిగత వస్తువులు పంచుకోవడం వంటివి చేసినా ఇది సోకదు. అయితే ఈ వ్యాధి ఉన్న వారు ఉపయోగించే సూదులు మాత్రం వాడకూడదు. అలాగే శృంగారంలో పాల్గొనే సమయంలో తప్పకుండా కండోమ్ ఉపయోగించాలి. ఇలా చేయడం ద్వారా ఎయిడ్స్ వ్యాప్తిని కొంతవరకూ అరికట్టవచ్చు. ఒకవేళ గర్భం ధరించిన తర్వాత హెచ్ఐవీ పాజిటివ్ అని తేలితే వైద్యుల సలహా మేరకు కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. తద్వారా ఆ వైరస్ బిడ్డకు సంక్రమించకుండా కాపాడుకోవచ్చు. అయితే ఈ వ్యాధి తల్లిపాల ద్వారా కూడా సోకే ప్రమాదం ఉంది కాబట్టి ప్రసవం జరిగిన తర్వాత బిడ్డకు పాలు పట్టకుండా ఆ తల్లి జాగ్రత్తపడాల్సి ఉంటుంది.

అపోహ: హెచ్ఐవీ సోకితే వెంటనే మరణిస్తారు..

గతంలో హెచ్ఐవీ వ్యాధి సోకిందంటే చాలు.. ఇక మరణం కోసం వేచి చూడడం తప్ప మరే ఇతర మార్గం లేదని భావించేవారు. కానీ ఇప్పుడు వైద్యశాస్త్రం కూడా ఎంతగానో అభివృద్ధి చెందింది. హెచ్ఐవీని సమూలంగా, శాశ్వతంగా తగ్గించలేకపోయినప్పటికీ ఆ వ్యాధితో పోరాడేందుకు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను బలపరిచేందుకు చాలా మందులు ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. ఏఆర్‌టీ - యాంటీ రెట్రోవైరల్ థెరపీ తీసుకోవడం ద్వారా హెచ్ఐవీ బాధితులు కూడా ఎక్కువ కాలం పాటు జీవించే అవకాశం ఉంది. అంతేకాదు.. ఎప్పటికప్పుడు వైరల్ లోడ్, సీడీ4 కౌంట్ పరీక్షలు చేయించుకుంటూ; ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తూ తదనుగుణంగా మందులు వాడాల్సి ఉంటుంది. సమస్య తగ్గుముఖం పట్టిన తర్వాత మందులు ఉపయోగించడం ఆపేయడం వల్ల ఈ వ్యాధి తిరిగి మళ్లీ మొదటికే వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు.. హెచ్ఐవీ వ్యాధి సోకిన వారిలో చాలామందికి హెచ్‌సీవీ (హెపటైటిస్ సి వైరస్) వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి దాని కోసం కూడా తరచూ పరీక్షలు చేయించుకుంటూ; తగిన చికిత్స తీసుకోవడం వల్ల కాస్త ఎక్కువ రోజులు జీవించే వీలుంటుంది.

అపోహ: భార్యాభర్తలిద్దరికీ హెచ్ఐవీ ఉంటే కండోమ్ వాడాల్సిన అవసరం లేదు..

భార్యాభర్తలిద్దరికీ హెచ్ఐవీ ఉన్నప్పటికీ కండోమ్ ఉపయోగించకుండా అంటే అసురక్షితమైన లైంగిక చర్యలో పాల్గొనడం ఏమాత్రం సరికాదంటున్నారు వైద్యులు. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో ఉన్న హెచ్ఐవీ వైరస్ ఒకే రకమైనది కాకపోవచ్చు. హెచ్ఐవీలో కూడా రకాలున్నాయి కాబట్టి భాగస్వామి నుంచి మరో రకం వైరస్ సంక్రమించే అవకాశం ఉంటుంది. ఫలితంగా హెచ్ఐవీ చికిత్స నిమిత్తం ఉపయోగిస్తున్న మందు ఆ వైరస్‌కు తగినది కాకపోతే శరీరంలో వైరల్ లోడ్ పెరిగిపోతుంది. తద్వారా వ్యాధి మరింత ముదిరే అవకాశం ఉంటుంది. కాబట్టి హెచ్ఐవీ సోకిన తర్వాత భాగస్వామితో శృంగారంలో పాల్గొనే సమయంలో కూడా కండోమ్ తప్పనిసరిగా వినియోగించాల్సి ఉంటుంది.

అపోహ: హెచ్ఐవీ సోకితే కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు..

హెచ్ఐవీ సోకిన తర్వాత ఆ వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి ఒక్కొక్కరికి ఒక్కోలా సమయం పడుతుంది. ఎందుకంటే మన రోగనిరోధక వ్యవస్థ ఎంత బలంగా ఉంటే ఈ వ్యాధి లక్షణాలు అంత ఆలస్యంగా బయటపడతాయి. అందుకే ఈ వైరస్ సోకిన వెంటనే ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఒకవేళ హెచ్ఐవీ లేదా ఎయిడ్స్ సోకిందన్న అనుమానం ఉంటే కనుక ప్రతి మూడు నెలలకోసారి పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యాధి వచ్చిందా? రాలేదా?? అన్నది నిర్ధరించుకోవచ్చు.
అపోహ: ఒకసారి నెగెటివ్ వస్తే ఇక హెచ్ఐవీ లేనట్లే..

హెచ్ఐవీ వచ్చిన వారితో అసురక్షిత లైంగిక చర్యలో పాల్గొన్న తర్వాత లేదా హెచ్ఐవీ బాధితులు ఉపయోగించిన సూదులు వాడడం, వారి రక్తం మరొకరికి ఎక్కించడం వంటివి జరిగిన తర్వాత శరీరంలో హెచ్ఐవీ యాంటీబాడీలు ఏర్పడేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుంది. హెచ్ఐవీ వైరస్ ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది కాబట్టి ఇప్పటివరకూ ఉన్న పరీక్షలన్నీ.. హెచ్ఐవీ వచ్చిన తర్వాత శరీరం విడుదల చేసే యాంటీబాడీలనే పరీక్షిస్తున్నాయి. వీటిని విడుదల చేయడం కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు. అందుకే ఒక్కసారి పరీక్షలో నెగెటివ్ వస్తే మూడు నెలల పాటు వేచి చూసి మరోసారి టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది.

అపోహ: వైరల్ లోడ్ తగ్గిపోతే ఇక వ్యాధి వ్యాపించదు..

ఏఆర్‌టీ ఉపయోగించిన తర్వాత ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో వైరల్ లోడ్ రోజురోజుకీ తగ్గిపోయి.. చివరకు పరీక్షల్లో గుర్తించలేని స్థాయికి చేరిపోతుంది. ఇలాంటప్పుడు చాలామంది వ్యాధి తగ్గిపోయిందనే ఉద్దేశంతో మందులు ఉపయోగించడం ఆపేయడమే కాదు.. అసురక్షిత లైంగిక చర్యలోనూ పాల్గొంటూ ఉంటారు. కానీ ఇది సరైంది కాదు. ఎందుకంటే శరీరంలో వైరల్ లోడ్ తగ్గితే వ్యాధి సంక్రమించే అవకాశాలు కూడా చాలావరకు తగ్గుతాయి. అంతమాత్రాన ఈ వ్యాధి సంక్రమించే అవకాశం పూర్తిగా లేదని చెప్పలేం. కాబట్టి వైరల్ లోడ్ పూర్తిగా తగ్గినా బాధితులు సదా జాగ్రత్తగా ఉండాల్సిందే!

 

యువతా మేలుకో!

హెచ్‌ఐవీ సోకగానే జీవితం ముగిసిపోదు. దాన్ని నయం చేసే మందులు ప్రపంచంలో ఇప్పటికీ ఏ వైద్య విధానంలోనూ ఆవిష్కృతం కాలేదు. అందువల్ల మోసపూరిత ప్రకటనల పట్ల రోగులు అప్రమత్తంగా ఉండాలి. శాస్త్రీయంగా ఇప్పటివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ, ఏ ఇతర ప్రముఖ ఆరోగ్య సంస్థలు కానీ ఆయుర్వేద మందులు, లేహ్యాల్ని, ఇతర ప్రత్యామ్నాయ మందుల్ని అధికారికంగా ఎయిడ్స్‌ చికిత్స కోసం గుర్తించలేదు. అయినా కొందరు కేరళ వైద్యమని, హైదరాబాద్‌ లేహ్యమని, కోల్‌కతా మందులని, పాము విషమని ప్రచారం చేస్తూ రోగులను మోసం చేస్తున్నారు. హెచ్‌ఐవీ ఉందని తెలిసినప్పటికీ ప్రామాణికమైన ఏఆర్‌టీ (యాంటీ రెట్రోవైరల్‌ థెరపీ) మందులు వాడకుండా, వైద్య పరీక్షలు చేయించుకోకుండా అవయవాలు పాడై పోయి చర్మ వ్యాధులకు గురవుతున్నారు. కొందరు అందవికారంగా మారిపోతున్నారు. రోగ నిరోధక శక్తి క్షీణించి, టీబీ, క్యాన్సర్లకు గురయ్యే వరకూ రోగులు హెచ్‌ఐవీ నిపుణుల వద్దకు గానీ, ఏఆర్‌టీ కేంద్రాల వద్దకు గానీ వెళ్లడం లేదు. హెచ్‌ఐవీ అని తెలియగానే సీడీ-4 కణాల సంఖ్య తగ్గేంత వరకు అశ్రద్ధ చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో ఆధునిక వైద్య సేవలు పొందితే 75 ఏళ్ల వరకు ఆరోగ్యంగా జీవనం సాగించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎయిడ్స్‌ రోగులూ మధుమేహం, బీపీ, ఆస్తమా రోగుల మాదిరిగానే ఔషధాల వాడకం ద్వారా ఆరోగ్యంగా ఉండచ్చు. హెచ్‌ఐవీ ఉన్న దంపతులు తగిన సమయంలో ఏఆర్‌టీ మందులు వాడి హెచ్‌ఐవీ లేని సంతానాన్ని కనచ్చు. తగిన చికిత్స పొందితే భార్య నుంచి భర్తకు, భర్త నుంచి భార్యకు వ్యాధి సంక్రమించకుండా నివారించవచ్చు.

భాగస్వామికి సోకకుండా..!

భార్యాభర్తలిద్దరిలో ఒకరు పాజిటివ్‌, ఒకరు నెగెటివ్‌ అయినా (సీరో డిస్కార్డెంట్‌ దంపతుల్లోనూ) ఒకరి నుంచి మరొకరికి వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించే వైద్యం నేడు అందుబాటులోకి వచ్చింది. అలాగే హెచ్‌ఐవీ నెగెటివ్‌ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నా భాగస్వామికీ హెచ్‌ఐవీ సోకకుండా నివారించే మందులు, పుట్టే పిల్లలకు ఈ వ్యాధి రాకుండా చేసే అధునాతన చికిత్స ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో హెచ్‌ఐవీ పాజిటివ్‌ సోకినా నివారణకు అధునాతన మందులు అందుబాటులోకి వచ్చాయి. మూడు దశాబ్దాల క్రితం ఉన్న భయం ఇప్పుడు అవసరం లేదు. కాబట్టి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ విషయాలపై విస్తృత ప్రచారం నిర్వహించి అందరిలో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది. యువత కూడా అనవసరమైన ఆందోళనలు మాని ఈ వ్యాధిపై మరింత లోతుగా తెలుసుకొనే ప్రయత్నం చేయాలి.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని