‘వెదురు’లా జీవితంలో ఎదగాలంటే..!

ప్రతి మనిషి జీవితంలోనూ సమస్యలు సహజం. ఓర్పు వహిస్తే వాటిని అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ అంత ఓర్పు ఈరోజుల్లో ఎవరికుంది చెప్పండి?? ఈ క్రమంలో ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో ఓర్పు, సహనం ప్రాముఖ్యతను తెలియజేసే కథ ఒకటుంది.

Published : 02 Dec 2023 17:35 IST

ప్రతి మనిషి జీవితంలోనూ సమస్యలు సహజం. ఓర్పు వహిస్తే వాటిని అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ అంత ఓర్పు ఈరోజుల్లో ఎవరికుంది చెప్పండి?? ఈ క్రమంలో ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో ఓర్పు, సహనం ప్రాముఖ్యతను తెలియజేసే కథ ఒకటుంది. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, ఇతర వేదికలపై ఓర్పు విషయం చర్చకు వచ్చినప్పుడు ఈ కథనే ఉదహరిస్తుంటారు ప్రముఖులు. అదేంటో మీరూ చదివేయండి మరి!

కొన్నేళ్ల కిత్రం చైనాలో ఒక రైతు తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసి అలసిపోతాడు. వెదురు చెట్ల విత్తనాలు నాటితే అవి కొద్ది రోజుల్లోనే 90 అడుగుల ఎత్తుకి పెరుగుతాయని, వాటిని అమ్మితే మంచి లాభాలొస్తాయని ఒక వ్యక్తి ఇచ్చిన సలహా మేరకు ఆ విత్తనాలు నాటుతాడు. వాటితో పాటు మరికొన్ని కాయగూరల విత్తనాలతో కూడా పంటలు పండిస్తాడు. వయసు మీరుతున్నా ఓపికతో వాటికి రోజూ నీళ్లు పోయడం, ఎరువులు వేయడం.. వంటివి చేస్తూ వాటిని జాగ్రత్తగా సంరక్షిస్తాడు. కొన్ని వారాల వ్యవధిలోనే కాయగూరల విత్తనాలు మొలకలొస్తాయి.. కానీ వెదురు విత్తనాలు నాటిన చోట ఒక్క మొలక కూడా రాకపోవడం గమనిస్తాడు. అయినా ఓర్పుతో రోజూ విత్తనాలు నాటిన చోట నీళ్లు పోస్తూనే ఉంటాడు. అతను ఆశించిన వెదురు మొక్కలు మొలకెత్తకపోయినా కాయగూరల పంట చేతికి రావడంతో కుటుంబ పోషణ గడిచిపోయేది.

అయితే 90 అడుగుల వెదురు చెట్లు పెంచి, కుటుంబాన్ని పోషించాలనుకునే అతని ఆశకి కాలం మరింత పరీక్ష పెడుతుంది. ఫలితంగా విత్తనాలు నాటి సంవత్సరం గడిచినా ఒక్క మొలక కూడా రాదు. కానీ ఆ రైతు మాత్రం రోజూ నీళ్లు పోస్తూ వాటిని సంరక్షిస్తూనే ఉంటాడు. దీంతో చుట్టూ ఉన్న గ్రామ ప్రజలు అతనిని హేళన చేయడం ప్రారంభిస్తారు. అయినా సరే.. ఆ రైతు విత్తనాలకు నీళ్లు పోయడం, ఆ గుంతల్ని సంరక్షించడం మాత్రం మానడు. అలా రెండు కాదు.. మూడు కాదు.. నాలుగు సంవత్సరాల కాలం గడిచిపోతుంది. దీంతో వయసు పెరుగుతున్న కొద్దీ ఆ రైతులో నిరాశ, నిస్పృహలు ఆవహించడం మొదలవుతాయి. ‘ఇక కుటుంబాన్ని పోషించలేనేమో’నని నిరుత్సాహపడతాడు. అయినా లోపల ఎంత బాధ ఉన్నా, అవతలి వాళ్లు హేళన చేస్తున్నా, తనలోని భావోద్వేగాల్ని అణచుకుంటూ వాటికి నీళ్లు పోస్తూ తన పని తాను చేసుకుపోతాడు. కొన్నిసార్లు ఇన్నేళ్లు దీని కోసం ఎదురుచూసి పొరపాటు చేశానేమోనని నిరాశపడుతుంటాడు. అలా ఐదో సంవత్సరం కూడా గడిచిపోతుంది.

*****

ఆ తర్వాత రైతుకి విత్తనాలకు నీళ్లు పోసే ఓపిక కూడా క్రమంగా సన్నగిల్లుతుంది. ఈ క్రమంలోనే ఓ రోజు వాటికి నీళ్లు పోసి అక్కడే నిలబడి, ‘నేను విత్తనాలు సరిగా నాటలేదేమో?, నీళ్లు సరిపోలేదేమో?, లేదంటే నీళ్లు ఎక్కువవడం వల్ల విత్తనం కుళ్లిపోయిందేమో?’.. అంటూ తనను తానే ప్రశ్నించుకుంటాడు. విలువైన సమయాన్ని, శక్తిని వృథా చేసుకున్నాననుకుంటూ తనని తాను నిందించుకుంటూ రైతు ఇంటికెళ్లిపోతాడు. అయితే మరుసటి రోజు యథావిధిగా విత్తనాలు నాటిన చోటుకెళ్లి ఆ ప్రాంతాన్ని చూసి ఆనందంతో ఎగిరి గంతేస్తాడు. పొలం నుంచి గట్టిగా నవ్వుతూ ఇంటికి పరుగెత్తుకెళ్లి ఇంట్లో వాళ్లని తీసుకొచ్చి అప్పుడప్పుడే మొలకెత్తుతున్న వెదురు మొక్కల్ని వారికి చూపిస్తాడు. వాటిని చూసిన ఆ రైతు తన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతాడు.

అలా మొలకెత్తిన ఆ చెట్టు కొన్ని రోజుల్లోనే 5 అడుగులు పెరుగుతుంది. తర్వాత 10, 20, 30, 40... అలా 90 అడుగుల వరకు ఎదుగుతుంది. ఇదంతా కేవలం ఆరు వారాల్లోనే జరుగుతుంది. ఎత్తైన ఆ చెట్ల మధ్య నుంచి ఆ రైతు నడుస్తూ చాలా సంతోషపడతాడు. ఐదేళ్లు కనీసం నేలని కూడా దాటని ఆ విత్తనం, ఆరు వారాల్లో 90 అడుగుల ఎత్తు పెరిగిందంటే చాలా అద్భుతమైన విషయం కదూ! అదే ‘చైనీస్ వెదురు చెట్టు’!! మన దగ్గర వెదురు చెట్టు మాదిరిగానే ఆ చెట్టు నేల నుంచి అల్లంత ఎత్తుకి ఎదగడానికి ఆరు వారాలే పట్టినా, విత్తు నుంచి మొలకెత్తడానికి ఐదేళ్లు పడుతుంది. ఈ మధ్యలో ఓపిక నశించి దాని గురించి తెలుసుకోవడానికి గుంత తవ్వినా, నీళ్లు పోయకపోయినా పరిస్థితి మరోలా ఉంటుంది.

స్ఫూర్తి పాఠాలెన్నో!

ఇది కథ కాదు.. వాస్తవం.. దీన్నుంచి రైతు చాలా విషయాలు నేర్చుకున్నాడు. మనం కూడా నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇందులో చాలానే ఉన్నాయి..

⚛ మన కల నెరవేర్చుకోడానికి ప్రయత్నం అనే విత్తనం నాటడం తప్పనిసరి.

⚛ రోజూ మనం చేయాల్సిన పని కచ్చితంగా చేస్తే, ఆలస్యమైనా ఫలితం తప్పకుండా వస్తుందనేది ఈ స్ఫూర్తి పాఠం చెబుతోంది.

⚛ మనమేదైనా కొత్తగా ప్రయత్నిస్తే నలుగురు ‘అది జరగదు.. సమయం వృథా తప్ప ప్రయోజనం ఉండదు’ అంటూ నిరుత్సాహపరుస్తుంటారు. అయినా సరే వాటిని పట్టించుకోకుండా ముందడుగు వేయాలి. మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడే విజయం వరిస్తుంది.

⚛ గతం గురించి ఆలోచించకుండా ప్రస్తుతం చేయాల్సిన పని మీదే శ్రద్ధ పెట్టాలి.

⚛ ఎదిగే చెట్టుకి నీరు ఎంత అవసరమో, మన అభివృద్ధికి కూడా సానుకూల ఆలోచనలు అంతే అవసరం.

⚛ ఓర్పు వహిస్తే ఎంత కష్టమైన పనైనా పూర్తి చేసి విజయం సాధించవచ్చు. అదే ఓపిక నశించి దాన్ని మధ్యలో వదిలేసినా, పట్టించుకోకపోయినా మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్