దాంపత్య బంధాన్ని పెంచే ‘1-1-1-1 రూల్‌’!

దాంపత్య బంధంలో జంటల మధ్య అనుబంధాన్ని పెంచేందుకు ఎన్నో అంశాలు దోహదం చేస్తాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం, సర్దుకుపోవడం, కలిసి సమయం గడపడం.. వంటివన్నీ ఇదే కోవలోకి వస్తాయి. అయితే వీటితో పాటు ఆలుమగల అనుబంధాన్ని నిత్యనూతనం చేసుకోవాలంటే ప్రతి జంటా ‘1-1-1-1 రూల్‌’ పాటించడం తప్పనిసరి అంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు....

Published : 30 Mar 2024 13:58 IST

దాంపత్య బంధంలో జంటల మధ్య అనుబంధాన్ని పెంచేందుకు ఎన్నో అంశాలు దోహదం చేస్తాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం, సర్దుకుపోవడం, కలిసి సమయం గడపడం.. వంటివన్నీ ఇదే కోవలోకి వస్తాయి. అయితే వీటితో పాటు ఆలుమగల అనుబంధాన్ని నిత్యనూతనం చేసుకోవాలంటే ప్రతి జంటా ‘1-1-1-1 రూల్‌’ పాటించడం తప్పనిసరి అంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. ఈ నియమం వల్ల ఏళ్లు గడిచినా బంధం బోర్‌ కొట్టకుండా.. మరింత దృఢమయ్యే అవకాశాలున్నాయంటున్నారు. మరి, ఇంతకీ ఏంటీ రూల్‌? భార్యాభర్తల అనుబంధాన్ని ఇదెలా దృఢం చేస్తుంది? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

ఈ రోజుల్లో చాలా జంటలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతున్నారు. ప్రతి విషయాన్నీ భూతద్దంలో పెట్టి చూస్తూ అనుబంధాన్ని తెంచుకుంటున్నారు. అయితే పెళ్లైనప్పట్నుంచే జంటలు ‘1-1-1-1 రూల్‌’ పాటించడం వల్ల ఇలాంటి సమస్యలే తలెత్తవంటున్నారు నిపుణులు. తద్వారా అనుబంధాన్ని నిత్యనూతనం చేసుకోవచ్చంటున్నారు.

ఏంటీ నియమం?
భార్యాభర్తలంటే ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించడం కాదు.. ఒకరికొకరు స్నేహితుల్లా మెలగాలంటున్నారు నిపుణులు. పరస్పరం అభిరుచుల్ని గౌరవించుకోవడం, ఆలోచనల్ని అర్థం చేసుకోవడం, ఎదుటివారి వ్యక్తిత్వాన్ని గౌరవించడం.. ఇలా ఫ్రెండ్స్‌లా కలిసిపోయినప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. జంటల మధ్య ఇలాంటి ధోరణిని ప్రోత్సహించడమే ‘1-1-1-1 రూల్‌’ ముఖ్యోద్దేశం. ఇందులో భాగంగా నాలుగు అంశాలు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.

ఏడాదికోసారి ..
భార్యాభర్తలు వీలు కుదిరినప్పుడల్లా వెకేషన్లకు వెళ్లడం మామూలే! అయితే పెళ్లైన కొత్తలో ఇద్దరూ కలిసే వెళ్లినా.. ఏళ్లు గడుస్తున్న కొద్దీ పిల్లలు, బాధ్యతలు పెరుగుతుంటాయి. దీంతో ఇద్దరి మధ్య ఏకాంతం కొరవడుతుంది. అందుకే ఏడాదికోసారి ఒక వారం రోజుల పాటు దంపతులిద్దరే వెకేషన్‌కి వెళ్లేలా ప్లాన్‌ చేసుకోమంటున్నారు నిపుణులు. ఇలా ఇద్దరూ కలిసి ఏకాంతంగా గడిపే ఈ సమయంలో.. ఒకరిపై ఒకరు మరింత శ్రద్ధ పెట్టగలుగుతారు. తమ తమ బాధ్యతల నుంచి రిలాక్సవుతూ.. పునరుత్తేజితమయ్యేందుకు ఇదే సరైన సమయం. ఇవన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా దంపతుల మధ్య అనుబంధాన్ని రెట్టింపు చేసేవే!

‘డేట్‌ నైట్‌’ మిస్సవ్వద్దు!
ఇంటి బాధ్యతలు, ఆఫీస్‌ పనుల వల్ల ఈ కాలపు జంటలకు కలిసి గడిపే సమయమే దొరకట్లేదు. దీనివల్ల ఇద్దరి మధ్య తరగనంత దూరం పెరిగిపోతోంది. అందుకే ఇలా జరగకుండా.. వారానికొక రోజు ఇద్దరూ కలిసి ఏకాంతంగా డేట్‌ నైట్‌ ప్లాన్‌ చేసుకోమంటున్నారు నిపుణులు. ఇంట్లో ఆ వీల్లేకపోతే.. బయటికి రొమాంటిక్‌ డిన్నర్‌కి వెళ్లచ్చు.. సినిమాకో-లాంగ్‌ డ్రైవ్‌కో ప్లాన్‌ చేసుకోవచ్చు. ఇలా ఇద్దరికీ దొరికిన ఈ ఏకాంత సమయంలో బోలెడన్ని విషయాలు పంచుకోవచ్చు. ఫలితంగా ఇద్దరి మధ్య మానసికంగా బంధం బలపడుతుంది. ఇది పరోక్షంగా దాంపత్య బంధం పైనా సానుకూల ప్రభావం చూపుతుంది.

వారానికో రోజైనా..!
దాంపత్య బంధాన్ని నిత్యనూతనం చేసే అంశాల్లో శృంగారానిది కీలక పాత్ర. అయితే ఈ కాలపు జంటల్లో చాలామంది తమ బిజీ లైఫ్‌స్టైల్‌ వల్ల దీనికి తగిన సమయం కేటాయించలేకపోతున్నారు. మరికొందరిలో ఒత్తిడి, ఇతర కారణాల వల్ల లైంగిక కోరికలు తగ్గిపోయి.. శృంగార జీవితానికి దూరమవుతున్నారు. అలాగని దీన్నిలాగే నిర్లక్ష్యం చేస్తే అనుబంధానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకే రోజూ కాకపోయినా వారానికో రోజైనా శృంగార జీవితానికి ప్రాధాన్యమివ్వమంటున్నారు. ఈ క్రమంలో తమ ఫాంటసీల్ని ఒకరితో ఒకరు పంచుకోవడం, భాగస్వామి ఆలోచనల్ని/కోరికల్ని అర్థం చేసుకొని మసలుకోవడం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇది క్రమంగా ఇద్దరినీ శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్‌గా మరింత దగ్గర చేస్తుంది.

ప్రతి రాత్రీ.. ఇలా!
ఆలుమగల మధ్య అనుబంధం సన్నగిల్లడానికి గ్యాడ్జెట్స్‌ కూడా ఓ కారణమని చెబుతున్నాయి పలు అధ్యయనాలు. రాత్రి భాగస్వామితో ఏకాంతంగా గడపాల్సిన సమయంలోనూ వీటికే ప్రాధాన్యమివ్వడం ఇందుకు కారణమంటున్నాయి. అందుకే రోజూ రాత్రి అరగంట పాటు ప్రతి జంటా డిజిటల్‌ డీటాక్స్‌ పద్ధతిని పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లన్నీ పక్కన పెట్టి ఆలుమగలిద్దరూ ఒకరితో ఒకరు సమయం గడిపేలా ప్లాన్‌ చేసుకోమంటున్నారు. ఈ సమయంలో మీ కెరీర్‌ అనుభవాలు భాగస్వామితో పంచుకోవచ్చు.. లేదంటే కాసేపు రొమాంటిక్‌గా మాట్లాడుకోవచ్చు. రోజూ ఇలా గడపడం వల్ల ఒకరిపై ఒకరికి ఆసక్తి పెరుగుతుంది.. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్‌ సమస్యలేవైనా ఉన్నా తొలగిపోతాయి. ఫలితంగా ప్రతి విషయంలోనూ ఇద్దరూ పారదర్శకంగా వ్యవహరిస్తూ.. ఒకరికొకరు సపోర్ట్‌ ఇచ్చుకుంటూ, ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్లగలుగుతారు. అనుబంధాన్ని దృఢం చేసుకోవాలంటే ఇవి చాలవూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్