పెళ్లైన కొత్తలో.. ఇలా ప్రవర్తిస్తున్నారా?

ప్రేమ పెళ్లైనా, పెద్దలు కుదిర్చిన వివాహమైనా.. మనసా, వాచా, కర్మణా ఇద్దరూ ఇష్టపడినప్పుడే సాధ్యమవుతుంది. అలాగే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల్ని, సవాళ్లను కలిసే ఎదుర్కొంటామన్న కమిట్‌మెంట్‌తోనే జంట ఒక్కటవుతుంది. కానీ కొంతమంది కొన్ని రోజులకే ఈ విషయాలన్నీ మర్చిపోతుంటారు....

Published : 11 Apr 2024 12:38 IST

ప్రేమ పెళ్లైనా, పెద్దలు కుదిర్చిన వివాహమైనా.. మనసా, వాచా, కర్మణా ఇద్దరూ ఇష్టపడినప్పుడే సాధ్యమవుతుంది. అలాగే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల్ని, సవాళ్లను కలిసే ఎదుర్కొంటామన్న కమిట్‌మెంట్‌తోనే జంట ఒక్కటవుతుంది. కానీ కొంతమంది కొన్ని రోజులకే ఈ విషయాలన్నీ మర్చిపోతుంటారు. భాగస్వామిని శారీరకంగా, మానసికంగా హింసించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. అనుక్షణం తమ మాటలు, చేతలతో ఇబ్బంది పెడుతుంటారు. అయితే అవతలి వాళ్లు ఈ తరహా ప్రవర్తనను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. అప్పుడే సమస్య నుంచి బయటపడడంతో పాటు అనుబంధాన్నీ కాపాడుకోవచ్చంటున్నారు. మరి, వైవాహిక బంధంలో భాగస్వామి నెగెటివ్‌ ప్రవర్తనను ఎలా గుర్తించాలి? దాన్నుంచి ఎలా బయటపడాలి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

ఈ సంకేతాలు కనిపిస్తే..!
*ప్రతి ఒక్కరిలో బలాలు, బలహీనతలు ఉంటాయి. అయితే భార్యాభర్తలిద్దరి మధ్య పెద్ద గొడవైతే తప్ప ఒకరి బలహీనతలు/లోపాల్ని మరొకరు టార్గెట్‌ చేయరు. కానీ కొంతమంది తరచూ తమ భాగస్వామి బలహీనతలు, లోపాల్ని ఎత్తి చూపడమే పనిగా పెట్టుకుంటారు. ఒంటరిగా ఉన్నప్పుడే కాదు.. నలుగురిలోనూ వారిని నిందిస్తుంటారు. పెళ్లైన కొత్తలో భాగస్వామిలో ఇలాంటి ప్రవర్తన కనిపిస్తే అనుమానించమంటున్నారు నిపుణులు.
*భార్యాభర్తలు నాలుగ్గోడల మధ్య ఎలా ఉన్నా నలుగురిలో హుందాగా వ్యవహరించాలి.. ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. కానీ భాగస్వామిని టార్గెట్‌ చేయాలని ఆలోచించే వారికి ఇవేవీ గుర్తుండవు. ఈ క్రమంలోనే నలుగురూ ఉన్నప్పుడు ఏదో ఒక మాట అనడం, అవమానించడం.. ఇలా మరోసారి వాళ్ల ముందు తలెత్తుకోకుండా చేస్తారు.
*దంపతులు ఒకరితో ఒకరు సమయం గడపడంతో పాటు ఎవరి వ్యక్తిగత సమయం వారు కేటాయించుకోవడం ముఖ్యం. కానీ కొంతమంది భాగస్వామికి ఉన్న ఈ స్వేచ్ఛను కూడా హరిస్తుంటారు. వారి నిర్ణయాలు, స్నేహాలు, ఆర్థిక పరమైన అంశాలు.. ఇలా ప్రతి దాంట్లో కల్పించుకుంటూ వారి జీవితాల్ని తమ అధీనంలోకి తెచ్చుకుంటారు. ఇలా భాగస్వామిని మానసికంగా హింసిస్తుంటారు.
*వివాహబంధం శాశ్వతమవ్వాలంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండడం ముఖ్యం. కానీ కొన్ని జంటల్లో పెళ్లైన కొన్నాళ్లకే ఇది కొరవడుతుంటుంది. భాగస్వామితో తరచూ అబద్ధాలాడడం, చేసిన వాగ్దానాల్ని విస్మరించడం.. ఇవీ అనుబంధాన్ని దెబ్బతీసే అంశాలే అంటున్నారు నిపుణులు.

*సుఖాల్లోనే కాదు.. కష్టాల్లోనూ భాగస్వామికి తోడుగా ఉన్నప్పుడే ఆ అనుబంధం శాశ్వతమవుతుంది. కానీ కొందరు అవతలి వారు బాధల్లో ఉన్నప్పుడు వాళ్లను అలాగే వదిలేస్తుంటారు. పైగా వాళ్ల బాధ చూసి లోలోపల నవ్వుకునే వారూ లేకపోలేదు. ఇలా భాగస్వామి ఎమోషనల్‌గా సపోర్ట్‌ ఇవ్వకపోవడం కూడా అనుబంధంలో విషపూరితమైన సంకేతమే అంటున్నారు నిపుణులు.
*ఏదేమైనా తాము అనుకున్నదే జరగాలన్న తత్వం కొంతమందిలో ఉంటుంది. ఈ క్రమంలో భాగస్వామి మనోభావాల్ని కూడా లెక్క చేయరు. తాము సంతోషంగా ఉన్నామా? లేదా? అన్నది మాత్రం చూసుకుంటారు. వివాహ బంధంలో ఇదీ మంచి సంకేతం కాదంటున్నారు నిపుణులు.
*భార్యాభర్తలిద్దరిలో కెరీర్‌, ఇతర విషయాల పరంగా ఎవరికి మంచి పేరొచ్చినా.. మరొకరు ఆ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటారు. కానీ అనుబంధంలో అనుక్షణం విషం చిమ్మాలని భావించే వాళ్లు తమ భాగస్వామిపై అసూయ పడుతుంటారని నిపుణులు అంటున్నారు.
*ఇలా వారి ప్రవర్తనతో మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయడం కాదు.. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా సంతోషంగా సమయం గడపకుండా చేస్తుంటారు. ఇదీ ఓ రకమైన మానసిక హింసే అంటున్నారు నిపుణులు.


ఎలా బయటపడాలి?

నిజానికి భార్యాభర్తల మధ్య అరుదుగా ఇలాంటి లక్షణాలు కనిపించినా.. తరచూ ఈ తరహా సమస్యలు ఎదురైతే మాత్రం బయటపడే మార్గాల్ని అన్వేషించాలంటున్నారు నిపుణులు. అదెలాగంటే..!
*ఆలుమగల అనుబంధం శాశ్వతమైనది. అందుకే ఎన్ని సమస్యలొచ్చినా సర్దుకుపోతుంటారు చాలామంది. తమ భాగస్వామినీ మార్చుకొనే ప్రయత్నం చేస్తుంటారు. అనుబంధానికి విషపూరితంగా మారుతోన్న మీ భాగస్వామికీ మారడానికి ఓ అవకాశమివ్వచ్చు.. ఈ క్రమంలో ఇద్దరూ ప్రశాంతమైన వాతావరణంలో మాట్లాడుకునే ప్రయత్నం చేయండి.. అవసరమైతే పెద్దల సహాయమూ తీసుకోండి. దీంతో భాగస్వామిలో మార్పొస్తే సరే సరి.. లేదంటే అంతిమ నిర్ణయం మీదే!
*భాగస్వామి ప్రవర్తన ఇబ్బందికరంగా అనిపిస్తోందంటే.. ఒకసారి వాళ్ల వైపు నుంచి కూడా ఆలోచించే ప్రయత్నం చేయండి. అసలు తమను ఇబ్బంది పెట్టడానికి గల కారణాలేంటో వారినే అడిగి తెలుసుకోండి. దాన్ని బట్టే తెలుస్తుంది.. వాళ్లు నిజంగానే ఇబ్బంది పడుతున్నారా? లేదంటే కావాలనే మిమ్మల్ని టార్గెట్‌ చేస్తున్నారా? అని! ఈ క్రమంలో అవతలి వారు మారేందుకు మీ వంతుగా ఓ అవకాశమిచ్చి చూడచ్చు.. ఆపై స్వయంగా నిర్ణయం తీసుకోవచ్చు.
*అనుబంధంలో తరచూ తమను ఇబ్బంది పెట్టే భాగస్వామిని మార్చుకోవాలంటే నిపుణుల కౌన్సెలింగ్‌ కొంతవరకు మేలు చేస్తుంది. అవతలి వాళ్ల ప్రవర్తన గురించి బయటపెడుతూనే అందుకు మీరు పడుతోన్న బాధ గురించి కూడా నిపుణుల సమక్షంలో వివరిస్తే.. దాన్ని బట్టి ఎవరిలో ఎలాంటి లోపాలున్నాయో తెలుసుకొని కౌన్సెలింగ్‌ఇస్తారు.

*భాగస్వామి పెట్టిన హింసతో మానసికంగా ఎంతో డిస్టర్బ్‌ అవుతుంటారు. దీన్నుంచి బయటపడాలంటే అభిరుచులపై దృష్టి పెట్టడం, అవసరమైతే థెరపీ, నిపుణుల కౌన్సెలింగ్‌ కూడా మేలు చేస్తాయి. ఈ క్రమంలో స్వీయ ప్రేమను పెంచుకోవచ్చు.. శారీరక, మానసిక ఆరోగ్యానికి ఇది మంచిది.
*అనుబంధంలో కలతలు రేగడానికి కారణం ఎవరైనా.. ఇద్దరూ సానుకూల దృక్పథంతో ముందుకెళ్లినప్పుడు తిరిగి బంధాన్ని నిపులుకోగలం. కాబట్టి భాగస్వామిని హింసించిన వారూ ఈ విషయంలో రియలైజ్‌ అవ్వాలి. ఈ క్రమంలో వారిని క్షమాపణ కోరడం, మరోసారి ఇలాంటిది పునరావృతం చేయమన్న భరోసాను వారికి ఇవ్వడం వల్ల దాంపత్య బంధం తిరిగి దృఢమవుతుంది.. నిజానికి ఇలా కలతల తర్వాత కలిసిపోయిన దంపతులు మరింత ప్రేమతో మెలుగుతారు కూడా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్