పెళ్లికి ముందు ఆ విషయం దాచాడు!

మాది ప్రేమ వివాహం. అతను బంధువుల పెళ్లిలో పరిచయమయ్యాడు. దూరపు చుట్టరికం కూడా ఉంది. దాంతో మా ఇద్దరి పేరెంట్స్ కూడా పెళ్లికి ఒప్పుకున్నారు. అయితే తను పెళ్లికి ముందు చాలా అబద్ధాలు చెప్పాడు.

Updated : 23 Nov 2023 21:57 IST

మాది ప్రేమ వివాహం. అతను బంధువుల పెళ్లిలో పరిచయమయ్యాడు. దూరపు చుట్టరికం కూడా ఉంది. దాంతో మా ఇద్దరి పేరెంట్స్ కూడా పెళ్లికి ఒప్పుకున్నారు. అయితే తను పెళ్లికి ముందు చాలా అబద్ధాలు చెప్పాడు. ఉద్యోగం చేస్తున్నానని చెప్పాడు. కానీ తనకు ఉద్యోగం లేదు. అసలు ఏ పనీ చేయడు. చాలా బద్ధకస్తుడు. వాళ్ల పేరెంట్సే తనను పోషిస్తున్నారు. వాళ్లు కూడా విసుగు చెంది అతనికి తన కెరీర్‌ గురించి చూసుకోమని చెప్పడం మానేశారు. నాకు కూడా విసుగొస్తోంది. ఇక నేను జాబ్‌ చేయడం తప్ప మరో దారి లేదు. అయితే ఉద్యోగం చేసి అతన్ని కూర్చోబెట్టి పోషించాలా? లేదంటే పుట్టింటికి వెళ్లాలా? అనేది తేల్చుకోలేకపోతున్నాను. - ఓ సోదరి

జ. సాధారణంగా వివాహం చేసుకునే క్రమంలో ముందుగానే అవతలి వ్యక్తికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే మీ ఇద్దరూ ప్రేమించుకున్నప్పటికీ జాబ్ విషయంలో అతను అబద్ధం చెప్పాడంటున్నారు. ఇప్పుడు వాటి గురించి బాధపడకుండా మీ వంతుగా సమస్యను ఎలా పరిష్కరించుకోగలరో ఆలోచించండి.

మీరు అతని గురించి చెబుతోన్న అంశాల్లో ‘బద్ధకస్తుడు, ఉద్యోగం లేదు, ఏ పనీ చేయడు’ అన్న విషయాలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మీరు ఎక్కడా అతనికి చెడు అలవాట్లు ఉన్నాయని, అతని ప్రవర్తనతో ఇబ్బంది పడుతున్నారని చెప్పలేదు. కాబట్టి, అతను ఉద్యోగం చేసే విధంగా ప్రోత్సహించండి. ఉద్యోగం చేయకపోతే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వస్తాయో అతనికి వివరించండి. ప్రస్తుతం తల్లిదండ్రులే అతన్ని పోషిస్తున్నారని చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ వారిని పోషించాల్సిన పరిస్థితులు వస్తే.. ఆ బాధ్యత తన మీదే ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేయండి. అలాగే తనలో ఉన్న నైపుణ్యాలను గుర్తించి అందుకు తగిన పని చేసే విధంగా అతన్ని ప్రోత్సహించండి. ఈ ప్రయత్నాలతో తనలో మార్పు వస్తే మంచిదే.. లేదంటే సైకాలజిస్టును సంప్రదించండి. వారు వివరాలన్నీ తెలుసుకొని.. తనలో మార్పు తెచ్చే దిశగా ప్రయత్నం చేస్తారు.

ఇకపోతే- మీరు ఉద్యోగం చేస్తానంటున్నారు. మీకు మీరు ఆర్థిక స్వావలంబన సాధించడానికి ఉద్యోగం చేయడం మంచిదే. అయితే మీరు జాబ్ చేస్తూ అతన్ని కూర్చోబెట్టి పోషించడం వల్ల అతనికి బద్ధకం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి, అతను చిన్నదో, పెద్దదో ఉద్యోగం చేయడం ప్రారంభించిన తర్వాత మీరూ ఓ ఉద్యోగం వెతుక్కోండి. తద్వారా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇద్దరూ ఆనందంగా జీవించే అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్