భాగస్వామి అలవాట్లతో ఇబ్బంది పడుతున్నారా..?

కొంతమంది దంపతులు వారి భాగస్వామికి ఉన్న కొన్ని అలవాట్లు తమకి ఇబ్బంది కలిగిస్తున్నా మౌనంగా భరిస్తూ ఉంటారు. వాటి గురించి తమ భాగస్వామితో ఎలా మాట్లాడాలి? ఎలాంటి అపార్థాలకూ తావీయకుండా తమ ఇబ్బందిని వారికి అర్థమయ్యేలా ఎలా వ్యక్తీకరించాలో తెలియక సతమతమవుతూ ఉంటారు.

Published : 01 Mar 2024 13:25 IST

కొంతమంది దంపతులు వారి భాగస్వామికి ఉన్న కొన్ని అలవాట్లు తమకి ఇబ్బంది కలిగిస్తున్నా మౌనంగా భరిస్తూ ఉంటారు. వాటి గురించి తమ భాగస్వామితో ఎలా మాట్లాడాలి? ఎలాంటి అపార్థాలకూ తావీయకుండా తమ ఇబ్బందిని వారికి అర్థమయ్యేలా ఎలా వ్యక్తీకరించాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అటువంటప్పుడు కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా పరిష్కారం లభించే అవకాశాలు ఉంటాయంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు..

మనకి ఉండే కొన్ని అలవాట్ల వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగినప్పుడు వాటిని పూర్తిగా మానుకోవడానికి లేదా ఇతరులను ఇబ్బందులకు గురి చేయకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. మరి, భాగస్వామి విషయంలో ఇలాంటి ఇబ్బంది కలిగించే అలవాట్లు ఉంటే ఏం చేయాలి? వీటి గురించి వారితో చర్చించడం అంత సున్నితమైన వ్యవహారమేమీ కాదు. ఎందుకంటే ఇలాంటి విషయాలు మాట్లాడే సమయంలో ఏ మాత్రం మాటతూలినా అది దంపతులిద్దరి మధ్యా వాగ్వాదానికి తెరతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అంశాలు చర్చించేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

పూర్తి అవగాహన ఉందా?

మీ భాగస్వామిలో మీకు ఇబ్బంది కలిగిస్తున్న అంశం లేదా అలవాటు పట్ల మీకు పూర్తి అవగాహన ఉందా? అది మిమ్మల్ని అంతగా ఎందుకు ఇబ్బందికి గురి చేస్తోందో మీకంటూ ఒక స్పష్టత కలిగి ఉండడం చాలా అవసరం. అప్పుడే మీ భాగస్వామితో ఈ విషయమై సునిశితంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. అలాగే ఇలాంటి విషయాల గురించి మాట్లాడేటప్పుడు వీలైనంత సౌమ్యంగానే వ్యవహరించాలని గుర్తుంచుకోండి. ప్రవర్తన ఏ మాత్రం మితిమీరినా, మాటలు నోరుజారినా దాని పర్యవసానాలు విపరీతంగా ఉంటాయని మర్చిపోకూడదు.

నిదానంగా చెప్పి చూడండి..

మీ భాగస్వామిలో మీకు ఇబ్బంది కలిగిస్తున్న అంశం గురించి వారితోనూ నిదానంగా చెప్పి చూడండి. అది మీకు ఎందుకు అంతగా ఇబ్బంది కలిగిస్తోంది? అనే కోణంలో నిదానంగా వారికి నచ్చచెబితే తప్పకుండా వారిలో మార్పు కనిపించే అవకాశాలుంటాయి. అలాగే వారి అలవాట్ల వల్ల మీరు ఎంత అసౌకర్యంగా ఫీలవుతున్నారు, ఎందుకు వాటి మీద అంతగా దృష్టి సారిస్తున్నారు అనే అంశాలను కూడా వారికి సవివరంగా చెప్పండి. ఇలా చేయడం వల్ల మీకు ఇబ్బంది కలిగించకూడదనే ఆలోచనతో వారిలో మార్పు రావచ్చు.

వాగ్వాదానికి తెర లేపద్దు..!

మీకు అసౌకర్యం లేదా ఇబ్బంది కలిగించే అలవాట్ల గురించి మీ భాగస్వామితో చర్చించాలే తప్ప వాటి గురించి మీకు మీరే ఏ విధమైన నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే మీ భాగస్వామిని కూడా ఫలానా నిర్ణయమే తీసుకోవాలంటూ బలవంతపెట్టకూడదు. అలా చేస్తే వారిపై మీరు అధికారం చలాయిస్తున్నారని భావించవచ్చు. ఫలితంగా మీ బంధం బీటలు వారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో వాగ్వాదానికి తెర లేపకండి.

తగిన సలహాలు ఇవ్వండి..

ఎప్పట్నుంచో ఉన్న అలవాటుని మార్చుకోవడానికో లేదా పూర్తిగా మానుకోవడానికో కాస్త సమయం పట్టడం సహజం. ఈ క్రమంలో మీరు వారిని ప్రోత్సహించేలా అందుకు తగిన సలహాలు- సూచనలు అందించండి. ఆ అలవాటు మానుకోవడం లేదా తగ్గించుకోవడం వల్ల వారికి కలిగే ప్రయోజనాల గురించి సానుకూలంగా వారికి వివరించే ప్రయత్నం చేయండి. ఫలితంగా వారిలోనూ ఎంతో కొంత మార్పు రాకపోదు.

మీరూ స్వాగతించండి..

జీవిత భాగస్వామితో ఇలాంటి అలవాట్ల గురించి చర్చించే క్రమంలో వారు మనకు ఉండే ఇబ్బందికరమైన అలవాట్ల గురించి కూడా ప్రస్తావించవచ్చు. అటువంటప్పుడు మీరు వాటిని ప్రతికూలంగా భావించకుండా మీ అలవాట్ల వల్ల వారికి ఏ విధంగా ఇబ్బంది కలుగుతోందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే భవిష్యత్తులో అటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తపడతాననే హామీని వారికి ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా వారు కూడా వారికి ఉన్న అలవాట్లను మార్చుకోవడానికో లేదా పూర్తిగా మానుకోవడానికో ప్రయత్నిస్తారు. దంపతుల్లో ఏ ఒక్కరు సలహాలు, సూచనలు ఇచ్చినా మరొకరు మనస్ఫూర్తిగా స్వాగతించేందుకు సన్నద్ధంగా ఉంటేనే ఆ కాపురం సంతోషంగా ముందుకి సాగిపోతుంది. ఏమంటారు??

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్