అవసరం లేకపోయినా షాపింగ్ చేస్తున్నారా? ఈ డిజార్డర్ కావచ్చేమో!

ఆడవాళ్లు సహజంగానే షాపింగ్‌ ప్రియులు. సమయం, సందర్భంతో పనిలేకుండా తరచుగా షాపింగ్‌కి వెళ్లే వారిని మనం చూస్తుంటాం. అంతేనా.. ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్లలో గంటల కొద్దీ సమయం గడిపేవారూ చాలామందే ఉంటారు. ఏదేమైనా ఇది హద్దుల్లో ఉన్నంత....

Published : 08 Oct 2022 15:52 IST

నళినికి షాపింగ్‌ అంటే మహా ఇష్టం.. అందుకే కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు.. ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్స్ చూడడం లేదంటే ఫ్రెండ్స్‌తో షాపింగ్‌కి వెళ్లడం చేస్తుంటుంది.

మౌని వార్డ్‌రోబ్‌ నిండా ఫ్యాషన్‌ యాక్సెసరీలే! మార్కెట్లోకి ఏదైనా కొత్త నగ వచ్చిందంటే చాలు.. అది అవసరం ఉన్నా, లేకపోయినా కొనేయడం ఆమెకు అలవాటు.

ఆడవాళ్లు సహజంగానే షాపింగ్‌ ప్రియులు. సమయం, సందర్భంతో పనిలేకుండా తరచుగా షాపింగ్‌కి వెళ్లే వారిని మనం చూస్తుంటాం. అంతేనా.. ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్లలో గంటల కొద్దీ సమయం గడిపేవారూ చాలామందే ఉంటారు. ఏదేమైనా ఇది హద్దుల్లో ఉన్నంత వరకు సమస్య లేదు కానీ.. వ్యసనంలా మారితేనే ‘బయింగ్‌ షాపింగ్‌ డిజార్డర్‌’కు దారితీస్తుందంటున్నారు నిపుణులు. మరి, ఇంతకీ ఏంటీ సమస్య? దీనివల్ల కలిగే పర్యవసానాలేంటి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

సాధారణంగా ఏదైనా పండగో, ప్రత్యేక సందర్భమో ఉన్నప్పుడు షాపింగ్‌ చేయడం మనకు అలవాటు! పండగల సీజన్లో కొన్ని ప్రత్యేకమైన రాయితీలు/ఆఫర్లు అందుబాటులో ఉన్నప్పుడు అవసరమున్న వస్తువుల్ని కొనడమూ సహజమే. కానీ కొంతమంది మాత్రం ఎప్పుడూ షాపింగ్‌కి వెళ్లడం, ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్లలో గడపడం.. అవసరం ఉన్నా, లేకపోయినా ఆయా వస్తువుల్ని కొనేయడం.. వంటివి చేస్తుంటారు. ఇలా నిరంతరాయంగా దీనికే అలవాటు పడిపోయారంటే వారిలో ఉండే ‘బయింగ్ షాపింగ్‌ డిజార్డర్‌’ కూడా ఓ కారణం కావచ్చంటున్నారు నిపుణులు.

ఇలా గుర్తించచ్చట!

ఒక వ్యసనానికి అలవాటు పడినప్పుడు.. దాన్ని మానడం చాలా కష్టం. షాపింగ్ ఒక వ్యసనంగా మారినా అంతే. పురుషులతో పోల్చితే మహిళల్లోనే ఈ తరహా వ్యసనం ఎక్కువని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే దీన్ని తేలిగ్గా తీసుకుంటే భవిష్యత్తులో వివిధ మానసిక సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కొన్ని లక్షణాల ఆధారంగా దీన్ని ఆదిలోనే గుర్తిస్తే మంచిదంటున్నారు. అవేంటంటే..!

రోజూ లేదా వారానికోసారి ఏదో ఒక వస్తువు కొనే అలవాటు ఉండడం..

ఏదైనా కారణం వల్ల షాపింగ్‌ చేయకపోతే ఒత్తిడికి గురవడం..

షాపింగ్‌తో ఒత్తిడి, ఆందోళనల్ని దూరం చేసుకోవడం..

ఆయా వస్తువులు కొన్న తర్వాత ఒక రకమైన సంతృప్తి, భావోద్వేగాలకు లోనవడం..

ఖర్చుకు వెనకాడకుండా నచ్చిన వస్తువు కొనాలన్న ఆతృతతో ఉండడం..

పాత క్రెడిట్‌ కార్డు బిల్లులు చెల్లించకుండానే కొత్త ఖాతాలు తెరవడం..

ఎలాగైనా షాపింగ్‌ చేయాలన్న ఆరాటంతో ఇంట్లో వాళ్లకు అబద్ధాలు చెప్పడం.. అరుదుగా ఇంట్లో నుంచి డబ్బులు దొంగిలించే వారూ లేకపోలేదట!

చేసిన షాపింగ్‌ తాలూకు బిల్లులు/రుజువులు ఇంట్లో ఎవరికీ కనిపించకుండా దాచేయడం..

అత్యవసర పనులు, ఆఫీస్‌ పనులు కూడా పక్కన పెట్టి.. నిరంతరం ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్లలో గడపడం..

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని వ్యసనంలా భావించి.. ఓసారి సంబంధిత నిపుణుల్ని సంప్రదించడం ఉత్తమం.

డబ్బు, సమయం.. వృథా!

నిజానికి అవసరం ఉన్నా, లేకపోయినా.. ఆయా వస్తువుల్ని కొనడం వల్ల ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చవుతుంది.. పైగా వాటిని తరచూ వాడం కాబట్టి.. వాటిపై పెట్టుబడి పెట్టడం వృథా! దీంతో పాటు గంటల కొద్దీ సమయాన్ని షాపింగ్‌ కోసం వెచ్చించడం కూడా వృథానే! అంతేకాదు.. బయింగ్‌ షాపింగ్‌ డిజార్డర్‌ వల్ల దీర్ఘకాలంలో ఒత్తిడి, ఆందోళనలు, యాంగ్జైటీతో పాటు ఇతరులతో పోల్చుకొని బాధపడడం, మిమ్మల్ని మీరు తక్కువ చేసి చూసుకోవడం, అనవసరమైన ఆలోచనలతో మనసు పాడుచేసుకోవడం.. ఇలా ఈ రుగ్మత మానసిక ఆరోగ్యాన్ని చాలావరకు దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఇది వ్యక్తిగత జీవితం, వృత్తిఉద్యోగాలు, అనుబంధాల పైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

పరిష్కారం ఉందా?

షాపింగ్‌కి బాగా అలవాటు పడినప్పటికీ చాలామంది ఈ సమస్యను తేలిగ్గా తీసుకుంటుంటారు.. కానీ పైన చెప్పినట్లుగా ఆయా లక్షణాలను ఎవరికి వారు గుర్తించినప్పుడు వెంటనే నిపుణుల్ని సంప్రదించడం మంచిది. ఈ క్రమంలో మీకున్న సమస్య తీవ్రతను బట్టి.. కొన్ని థెరపీలు, వ్యక్తిగత కౌన్సెలింగ్‌ వంటివి అందిస్తారు. మరీ సీరియస్‌ కేసుల్లో ఆయా మానసిక సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని రకాల మందులు కూడా సూచిస్తారట! ఇక ఈ డిజార్డర్‌ నుంచి బయటపడేందుకు ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాయం కూడా తీసుకోవచ్చు. ఖాళీ సమయాల్లో మనసు షాపింగ్ పైకి మళ్లకుండా వారితో గడపడం, మీ ఖాతాల్లో డబ్బు తక్కువ మొత్తంలో ఉంచుకోవడం, తెలిసిన వారి దగ్గర్నుంచి ఆర్థిక సలహాలు తీసుకోవడం.. వంటివన్నీ ముఖ్యమే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్