Relationship Tips: వీటికీ ఓ లెక్కుందండోయ్!

అనుబంధంలో ప్రేమలు, త్యాగాలు సహజం. అయితే వీటికీ ఓ లెక్కుందంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. అలాకాకుండా భాగస్వామిపై తమకున్న అతి ప్రేమను నిరూపించుకోవాలన్న ఉద్దేశంతో తమను తామే నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత నష్టపోయేది.....

Published : 29 May 2022 11:11 IST

అనుబంధంలో ప్రేమలు, త్యాగాలు సహజం. అయితే వీటికీ ఓ లెక్కుందంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. అలాకాకుండా భాగస్వామిపై తమకున్న అతి ప్రేమను నిరూపించుకోవాలన్న ఉద్దేశంతో తమను తామే నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత నష్టపోయేది మీరే అంటున్నారు. ఈ క్రమంలో జీవిత భాగస్వామిని ప్రేమగా చూసుకునే క్రమంలో దృష్టిలో పెట్టుకోవాల్సిన కొన్ని అంశాలేంటో తెలుసుకుందాం రండి..

క్షమకూ హద్దుంటుంది!

భార్యాభర్తల మధ్య తెలిసో, తెలియకో కొన్ని పొరపాట్లు దొర్లడం సహజం. వాటిని అర్థం చేసుకొని ఒకరినొకరు క్షమించగలిగితే బంధం నిలుస్తుంది. అయితే పొరపాట్లను/తప్పుల్ని క్షమించే విషయంలో ఆడవారే నాలుగాకులు ఎక్కువగా చదివారంటుంటారు. పైగా ఆడదానికి భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంటుందని చెబుతుంటారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది భర్తలు మితిమీరి పొరపాట్లు చేస్తుంటారు. ఈ క్రమంలో మీరు బాధపడతారని తెలిసి కూడా పదే పదే అదే పొరపాటు చేయడం మాత్రం క్షమార్హం కాదు. కాబట్టి ‘నా భర్తే కదా.. మారతాడులే!’ అని ప్రతిసారీ క్షమించేస్తే.. మీ అనుబంధంలో ప్రశాంతత కోల్పోవడంతో పాటు మిమ్మల్ని మీరే మోసం చేసుకున్న వాళ్లవుతారు.

ఎంత సమయం గడుపుతున్నారు?

దాంపత్య బంధం దృఢమవ్వాలంటే ఆలుమగలిద్దరూ వీలైనంత ఎక్కువ సమయం గడపడం మంచిదే! అలాగని దాని అర్థం మీ వ్యక్తిగత సమయాన్ని కూడా మీ భాగస్వామికే కేటాయించమని కాదు! ఈ విషయం తెలిసి కూడా ప్రేమను పెంచుకోవాలని కొందరు గంటల తరబడి భాగస్వామికే కేటాయిస్తుంటారు. అయితే ఇది తొలుత బాగానే ఉండచ్చు.. కానీ క్రమేణా మీ కోసం, మీ అవసరాల కోసం సమయం కేటాయించుకునే వీల్లేక ఒత్తిడికి లోనవుతారు. దీని ప్రభావం మీ కెరీర్ పైనే కాదు.. అనుబంధం పైనా పడుతుంది. కాబట్టి రోజులో మీకు మిగిలిన సమయాన్ని అన్ని పనులకు సమానంగా కేటాయించుకోగలిగితే ఏ గొడవా ఉండదు.

ప్రతిదీ పంచుకోవద్దు!

భార్యాభర్తల మధ్య పారదర్శకత ఉండడం మంచిదే. అంటే.. ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు లేకుండా ఉండడం వల్ల ఏ గొడవా రాదన్నది నిపుణుల అభిప్రాయం. అలాగని మీ భావోద్వేగాలన్నీ వారితో పంచుకోవడం మాత్రం సరికాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇలా ఎమోషనల్‌గా వారిపై ఆధారపడడం వల్ల వారికి చులకనయ్యే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి మీకున్న భావోద్వేగాల్ని కేవలం మీ భాగస్వామితోనే కాకుండా.. మీ స్నేహితులు, మీ తల్లిదండ్రులు, తోబుట్టువులు.. ఇలా ఎవరితో షేర్ చేసుకోవాల్సినవి వాళ్లతో పంచుకోవాలి.

తీసుకోవడమూ నేర్చుకోండి!

భాగస్వామి ప్రేమను పొందాలని ఎవరికుండదు  చెప్పండి? అయితే ఈ విషయంలో కొంతమంది అతిగా ప్రవర్తిస్తుంటారు. ఉదాహరణకు అకేషన్‌ ఉన్నా, లేకపోయినా.. అవతలి వారు ఇచ్చినా, ఇవ్వకపోయినా.. తరచూ వాళ్లపై బహుమతుల వర్షం కురిపిస్తుంటారు. ఒకవేళ భాగస్వామి తమకేమైనా కానుక ఇచ్చినా.. దాన్ని స్వీకరించడానికి నిరాకరిస్తుంటారట! ఎందుకంటే దీనివల్ల తాము చూపించే ప్రేమ ఎక్కడ తక్కువవుతుందోనన్నదే వారి భావన! అయితే ఇలా ఎప్పుడూ మీరే ఇచ్చుకుంటూ పోతే వారిలో ఒకరకమైన అలసత్వం పెరిగిపోతుంది. ఇది మీపై ప్రేమను పెంచడం కాదు.. తగ్గిస్తుంది. ఇలా మీరు ఎంత ప్రేమ కురిపించినా.. అవతలి వారికి మీపై ప్రేమ లేకపోతే ఆ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. కాబట్టి భార్యాభర్తల మధ్య ప్రేమంటే రెండు వైపుల నుంచీ సమానంగా ఉండాలి. ఇలా జరగాలంటే అవతలి వారు చూపించే ప్రేమను స్వీకరించడం కూడా నేర్చుకోవాలంటున్నారు నిపుణులు.

ఇక వీటితో పాటు ఆర్థికంగా స్థిరపడడం, మీ ఫీలింగ్స్‌కి కట్టుబడి మీకంటూ సొంత గుర్తింపును సంపాదించుకోవడం వల్ల మీకూ మేలు జరుగుతుంది. అటు మీ జీవిత భాగస్వామికి చులకన కాకుండానూ జాగ్రత్తపడచ్చు. తద్వారా అనుబంధంలో అరమరికల్లేకుండా ముందుకు సాగచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్