విడాకుల విషయం పిల్లలకెలా చెప్పాలి?

విడాకులు చాలా సున్నితమైన అంశం. అప్పటిదాకా కలిసుండి విడిపోయే జంటలు ఎంత భావోద్వేగానికి గురవుతారో.. ఈ విషయం తెలుసుకొని వాళ్ల పిల్లలూ అంతకంటే ఎక్కువగా బాధపడతారు. అందుకే కొంతమంది ఈ విషయాన్ని తమ పిల్లల దగ్గర దాచిపెడుతుంటారు.. మరికొందరు తమకు అర్థం చేసుకొనే వయసు రాలేదు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటారు.

Published : 16 Apr 2024 20:20 IST

విడాకులు చాలా సున్నితమైన అంశం. అప్పటిదాకా కలిసుండి విడిపోయే జంటలు ఎంత భావోద్వేగానికి గురవుతారో.. ఈ విషయం తెలుసుకొని వాళ్ల పిల్లలూ అంతకంటే ఎక్కువగా బాధపడతారు. అందుకే కొంతమంది ఈ విషయాన్ని తమ పిల్లల దగ్గర దాచిపెడుతుంటారు.. మరికొందరు తమకు అర్థం చేసుకొనే వయసు రాలేదు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటారు. కానీ ఇది సరికాదంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. తల్లిదండ్రులిద్దరూ విడిపోయాక ఆ విషయం తెలుసుకొని వారు కుమిలిపోయే కంటే.. ముందే సామరస్యంగా విడాకుల విషయాన్ని పిల్లలకు చెప్పడం మంచిదంటున్నారు. ఈ క్రమంలో కొన్ని నియమాలు పాటించడం వల్ల పిల్లల మనసు నొచ్చుకోకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..

ఇద్దరూ కలిసే..!

భార్యాభర్తల మధ్య విడాకులకు ఎన్నో అంశాలు కారణమవుతుంటాయి. అభిప్రాయభేదాలు, గొడవలతో ఇద్దరికీ క్షణం కూడా పొసగని పరిస్థితులు ఏర్పడచ్చు. ఇలాంటప్పుడు ఏ నిర్ణయాన్నైనా కలిసి తీసుకోవడమనేది కష్టమే! ఇలా ఎడమొహం-పెడమొహంగా మారిన జంటలు తమ విడాకుల విషయాన్ని పిల్లలతో పంచుకోవడానికి ఆసక్తి చూపరు. ఒకవేళ చెప్పాలనుకున్నా.. ఎవరికి వారే వ్యక్తిగతంగా, భాగస్వామితో సంబంధం లేదన్నట్లుగా చెబుతుంటారు. అయితే ఇలా భార్యాభర్తలిద్దరిలో ఒక్కరే తమ విడాకుల విషయం చెప్పడం వల్ల పిల్లల పసి హృదయాలపై ప్రతికూల భావన పడుతుంది. తమ పేరెంట్స్‌ విడాకుల విషయాన్ని వారు జీర్ణించుకోలేరు. కాబట్టి భవిష్యత్తులో విడిపోతున్నప్పటికీ ఈ విషయాన్ని జంటగానే పిల్లలకు వివరించాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో విడాకులు తీసుకోవడానికి తమ మధ్య తలెత్తిన సమస్యలు, సంఘటనల గురించి వారికి సామరస్యంగా, అర్థమయ్యేలా చెప్పాలి. ఫలితంగా పిల్లలు కొంత వరకు పరిస్థితిని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకు తగినట్లుగా తమను తాము మార్చుకోవడానికీ వారు మానసికంగా సిద్ధపడతారు.

నిందించుకోవద్దు!

దంపతుల మధ్య పరిస్థితులు విడాకుల దాకా వచ్చాయంటే.. ఇద్దరికీ ఏ విషయంలోనూ పడట్లేదన్న విషయం స్పష్టమవుతుంది. దీంతో ఒకరు ఏం మాట్లాడినా మరొకరు వ్యతిరేకించడం, నిందించుకోవడం, దూషించుకోవడం.. ఇలా ఎప్పుడు చూసినా ఇద్దరి మధ్య ఒక రకమైన యుద్ధ వాతావరణం కనిపిస్తుంటుంది. నిజానికి భార్యాభర్తలు ఇలా పిల్లల ముందే గొడవలు పడడం, విడాకులకు నువ్వు కారణమంటే.. నువ్వు కారణమంటూ నిందించుకోవడం వల్ల వారి పిల్లల పసి హృదయాలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. వీళ్లిలా కీచులాడుకుంటే తమ భవిష్యత్తు ఏంటన్న ప్రశ్న కూడా ఆ చిన్నారుల మదిలో మెదులుతుంది. కాబట్టి విడాకులకు సంబంధించిన ప్రతికూల పరిస్థితుల ప్రభావం చిన్నారులపై పడకుండా ఉండాలంటే.. విడాకులు మంజూరయ్యే వరకూ దంపతులిద్దరూ సామరస్యంగా మెలగాలి.. పిల్లల విషయంలో ఎప్పటిలాగే తల్లిదండ్రులుగా తమ బాధ్యతల్ని నిర్వర్తించాలి. అప్పుడే జంటలు విడాకులు తీసుకుంటున్నప్పటికీ పిల్లలకు తమ భవిష్యత్తుపై ఓ భరోసా ఏర్పడుతుంది.

ఆ భరోసా ఇవ్వండి!

భార్యాభర్తలుగా మీరిద్దరూ విడిపోవచ్చు.. ఎవరి దారి వాళ్లు చూసుకోవచ్చు. కానీ పిల్లల జీవితం నుంచి ఇద్దరిలో ఏ ఒక్కరూ దూరం కాలేరు. విడాకులొచ్చాక కూడా పిల్లల ఎదుగుదల, వారి భవిష్యత్తు గురించి ఇద్దరూ కలిసి కట్టుగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనూ జంటగానే హాజరు కావాల్సి వస్తుంది. ఇదే విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేలా వివరించండి. ఎందుకంటే పేరెంట్స్‌ విడిపోవడం వల్ల తాము ఎవరో ఒక్కరి దగ్గరే పెరిగే అవకాశం ఉంటుందని, మరొకరి ప్రేమకు తాము పూర్తిగా దూరం కావాల్సి వస్తుందేమోనన్న బాధలో కూరుకుపోతుంటారు చిన్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే.. విడిగా ఉంటోన్న తమ తల్లి/తండ్రిని కలవడానికి ప్రత్యేకంగా సమయం కేటాయించుకోవడం, పేరెంట్‌ టీచర్‌ మీటింగ్స్‌కి ఇద్దరం కలిసే వస్తామని, ఎప్పటిలాగే ఏడాదికోసారి లేదా రెండుసార్లు వెకేషన్లకు వెళ్లడమూ కొనసాగిస్తామని.. ఇలా ఆయా విషయాల్లో పిల్లలకు భరోసా ఇవ్వాలి. అలాగని వీటిని మాటలకే పరిమితం చేయకుండా.. కచ్చితంగా పాటించాలి. అప్పుడే పిల్లలకు తల్లిదండ్రులిద్దరి ప్రేమ సమానంగా అందుతుంది. విడాకుల ప్రభావం పిల్లల పసి మనసులపై పడకుండానూ జాగ్రత్తపడచ్చు.

వాళ్లను దోషుల్ని చేయద్దు!

కొన్ని జంటలు విడాకుల వల్ల ఎదురయ్యే ఒత్తిళ్లను, కోపాన్ని పిల్లలపై చూపిస్తుంటారు. ‘మీ వల్లే మా మధ్య మనస్పర్థలొచ్చాయి..’ అంటూ క్షణికావేశంలో నోరు జారుతుంటారు. దీనివల్ల పిల్లలు నిజంగా తామే తమ తల్లిదండ్రుల విడాకులకు కారణమయ్యామేమోనని మానసిక క్షోభకు గురవుతుంటారు. ఇది వారిని అభద్రతా భావంలోకి నెట్టేస్తుంది. ఇప్పుడే తమ తల్లిదండ్రులు తమను ఇలా దోషుల్ని చేస్తుంటే.. భవిష్యత్తులో వాళ్ల ప్రేమ పొందలేమేమోనన్న భయాందోళనల్లో కూరుకుపోతారు. అందుకే దంపతులు తమ విడాకుల వల్ల ఎదురయ్యే ఒత్తిళ్లను పిల్లలపై చూపడం సరికాదంటున్నారు నిపుణులు. పిల్లల్ని ఇలా అనవసరంగా నిందించడం, దోషుల్ని చేయడం కంటే.. సంయమనం పాటిస్తూ తమ జీవితంలో ఎదురైన అనిశ్చితి ఎదుర్కోవాలంటున్నారు. ఇదే సమయంలో పిల్లలకు తల్లిదండ్రులిద్దరి ప్రేమ సమానంగా అందేలా జాగ్రత్తపడమంటున్నారు.

కాస్త సమయమివ్వండి!

దంపతులు తమ విడాకుల విషయాన్ని ఎంత సామరస్యంగా, సున్నితంగా పిల్లలకు చెప్పినా.. వారు ఎంతో కొంత మానసిక ఒత్తిడికి గురవడం సహజం. ఈ క్రమంలో కొందరు చిన్నారులు పరిస్థితుల్ని త్వరగా అర్థం చేసుకొని వాటికి అలవాటు పడడానికి ప్రయత్నిస్తే.. మరికొందరు కాస్త సమయం తీసుకోవచ్చు. కాబట్టి త్వరగా అర్థం చేసుకోమని, మారమని వారిపై ఒత్తిడి తీసుకురాకుండా.. పరిస్థితుల్ని జీర్ణించుకొనేలా వారికి కొంత సమయమివ్వమంటున్నారు నిపుణులు. ఇదే సమయంలో పిల్లలు ఆయా పరిస్థితులకు తగినట్లుగా అడ్జెస్ట్‌ అయ్యేందుకు కావాల్సిన సౌకర్యాల్ని, వాతావరణాన్ని తల్లిదండ్రులే సమకూర్చడం వల్ల వారికి మానసికంగా భరోసా కల్పించిన వారవుతారు. ఇది వారిని భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలిగే ఓర్పును, నేర్పును అందిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్