మాటలకందని కృతజ్ఞత

కొత్త సంవత్సరం వచ్చేస్తోంది! ఈ పన్నెండు నెలలుగా మీ జీవితంలో ఏం మార్పులు జరిగాయి? ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఎవరెవరు తోడ్పాటునందించారు? ముఖ్యంగా మీకు తోడూనీడగా నిలబడిన వాళ్లు లేదా మాట, చేత సాయం చేసినవాళ్లు ఎవరు? అలాంటి అపురూప వ్యక్తులను ఈ తరుణంలో గుర్తుచేసుకుని.. మీ కృతజ్ఞతని, మనసులో భావాలని లేఖగా రాయండి.

Published : 27 Dec 2022 00:16 IST

కొత్త సంవత్సరం వచ్చేస్తోంది! ఈ పన్నెండు నెలలుగా మీ జీవితంలో ఏం మార్పులు జరిగాయి? ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఎవరెవరు తోడ్పాటునందించారు? ముఖ్యంగా మీకు తోడూనీడగా నిలబడిన వాళ్లు లేదా మాట, చేత సాయం చేసినవాళ్లు ఎవరు? అలాంటి అపురూప వ్యక్తులను ఈ తరుణంలో గుర్తుచేసుకుని.. మీ కృతజ్ఞతని, మనసులో భావాలని లేఖగా రాయండి. అది వాళ్లకూ మీకూ ఆనందాన్నిస్తుంది. ఈ కాలంలో ఉత్తరాలేంటి? వినడమే తప్ప ఏనాడూ రాయ లేదంటారా?! మచ్చుకు ఇవి చదవండి.. ఆ ప్రేరణతో మీరూ రాసేస్తారు..

‘సఖీ!

ఈ కష్టం నుంచి బయట పడగలనా? అంటూ భయంతో తల్లడిల్లుతున్నప్పుడు ఆసరాగా నిలబడ్డావు. అందాకా కుడితిలో పడిన ఎలుకలా కొట్టు మిట్టాడే దాన్ని. అలాంటిది నిన్ను చూడగానే హమ్మయ్య అనిపించింది. నీ ఇల్లూ వాకిలీ గురించి ఆలోచించకుండా నాలుగురోజులు మాతోనే ఉన్నావు. మీ వారు, పిల్లలూ తోచిన విధంగా సాయం చేశారు. మీరున్నారన్న భావనే కొండంత ధైర్యాన్నిచ్చింది. నీలాంటి వాళ్లు చెంతనుంటే ఎంతటి కష్టాన్నయినా తట్టుకునే స్థైర్యం వస్తుందని నిరూపించావు. నీ నేర్పూ ఓర్పులతో సమస్యలు దూది పింజల్లా తేలిపోయాయి. నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలీదు.. ప్రతీ క్షణం గుర్తొస్తున్నావని మాత్రం చెప్పగలను. ధన్యవాదాలంటూ భూమ్మీదంతా ముగ్గులు పెట్టాలనుంది. ఆకాశానికి వినిపించేలా థాంక్యూ అని అరిచి చెప్పాలనుంది. పెన్నుని గ్రాటిట్యూడ్‌ అనే ఇంకులో ముంచి మనసుని అక్షరాల్లోకి తర్జుమా చేసే ప్రయత్నమిది. ఇది కవిత్వం కాదు, నా మనసులో భావం. అనుక్షణం గుర్తు చేసుకుంటూ..
నీ ప్రియనేస్తం’

‘ఓయ్‌,

ఆర్నెల్ల క్రితం నువ్వు ఆఫీసులో చేరే నాటికీ, ఇప్పటికీ నాలో ఎంత మార్పో తలచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక పక్కన ముడుచుకుని పనిచేసుకునేదాన్ని. చొరవగా కబుర్లు చెబుతూ నన్ను నీతో కలిపేసుకున్నావు. ఇప్పుడు నేనూ నీలా గలగలా మాట్లాడేస్తున్నాను. ఆలోచనలు పంచుకుంటున్నాను. ఒకప్పటి భారాలూ వేదనలూ లేవు. హాయిగా ఉంది. అందరితో కలిసి పోతున్నానని మెచ్చుకుంటున్నారంటే కారణం నువ్వే! థాంక్యూ కన్నా! మనసులో ఉన్న కృతజ్ఞతనంతా నాలుగు ముక్కల్లో ఇమడ్చి చెప్పటం సాధ్యం కాదు కానీ నువ్వంటే చాలా ఇష్టమని, నీ పట్ల ఎప్పటికీ కృతజ్ఞత ఉంటుందనీ మాత్రం కచ్చితంగా చెప్పగలను. నీ నెచ్చెలి’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్