కొలీగ్‌తో సంబంధం.. ఆయన్ని క్షమించలేకపోతున్నా..!

నేను టీచర్‌గా పని చేస్తున్నాను. మా వారు ఒక ప్రైవేటు సంస్థలో పెద్ద హోదాలో పని చేస్తున్నారు. మా వారికి తనతో పాటు ఉద్యోగం చేస్తోన్న ఒక మహిళతో సంబంధం ఉందని నాకు తెలిసింది. ఈ విషయం గురించి తనని గట్టిగా అడిగితే నిజమేనని ఒప్పుకున్నారు.

Published : 28 Feb 2024 14:28 IST

నేను టీచర్‌గా పని చేస్తున్నాను. మా వారు ఒక ప్రైవేటు సంస్థలో పెద్ద హోదాలో పని చేస్తున్నారు. మా వారికి తనతో పాటు ఉద్యోగం చేస్తోన్న ఒక మహిళతో సంబంధం ఉందని నాకు తెలిసింది. ఈ విషయం గురించి తనని గట్టిగా అడిగితే నిజమేనని ఒప్పుకున్నారు. ఆమెకు దూరంగా ఉంటానని పిల్లలపై ఒట్టు కూడా వేశారు. మాకు ఇద్దరమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు తన విషయం బయటపడితే బంధువుల్లో తలెత్తుకోలేం. అందుకే మౌనంగా ఉన్నాను. కానీ, నా భర్తను క్షమించలేకపోతున్నాను. తను నా కళ్ల ముందు కనబడితే ఏదో ఒక మాట అనకుండా ఉండలేకపోతున్నాను. మనసులో ఎప్పుడూ దిగులుగా, ఆందోళనగా, అసహనంగా ఉంటోంది. పిల్లలకు సరిగా చదువు కూడా చెప్పలేకపోతున్నాను. దయచేసి ఈ నరకం నుంచి బయటపడే మార్గం చెప్పగలరు. - ఓ సోదరి

జ. మీరు చెబుతోన్న విషయాలను బట్టి మీరు అసలు సమస్య నుంచి బయటపడ్డారు. అయితే మీరు ఆ విషయాన్ని నమ్మాలి. కానీ, ఆ బాధ మిమ్మల్ని ఇంకా వెంటాడుతోంది. ఈ క్రమంలోనే మీ భర్తను ఏదో ఒక మాట అనడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చాలామందిలో కనిపించే లక్షణమే. ఇది పెద్ద సమస్య కాదు. సాధారణంగా జీవితంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాటి నుంచి బయటపడ్డా.. వాటి తాలూకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఇలాంటప్పుడు వాటికనుగుణంగా స్పందించడం మామూలే. దీనినే ‘ఎడ్జస్ట్‌మెంట్‌ రియాక్షన్’ అంటారు.

ఈ క్రమంలో మీరు మునుపటిలా మీ భర్తతో సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి కొంత సమయం పడుతుంది. అయితే దీనికంటే ముందు ‘నేను నరకంలో ఉన్నాను’ అనే ఆలోచనను మీ మనసు నుంచి తీసేయండి. మీ భర్త చేసిన తప్పు గురించి ఆలోచించకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఇందుకోసం ఇతర అంశాలపై దృష్టి పెట్టండి. ఒకవేళ మీకు ఇంతకుముందే ఏవైనా వ్యాపకాలు ఉంటే తిరిగి వాటిపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. మీరు టీచర్‌గా పనిచేస్తున్నానని చెప్పారు. కాబట్టి, మీ పిల్లలకు వివిధ అంశాలను కొత్తగా ఎలా చెప్పాలో ఆలోచించండి. అది మీ కెరీర్‌కు కూడా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఆ ఆలోచనల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.

దంపతుల మధ్య అన్యోన్యత ఎంతో అవసరం. అది లేనప్పుడు దాని ప్రభావం మీ ఇద్దరిపై మాత్రమే కాకుండా పిల్లలపై కూడా పడుతుంటుంది. కాబట్టి, జరిగిన తప్పుల గురించి చర్చించుకోవడం వల్ల, నిందించుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. దీనికి బదులుగా మీరిద్దరూ తిరిగి సంతోషకరమైన జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో ఆలోచించండి. ఇందుకోసం గతంలో సంతోషంగా గడిపిన క్షణాలను గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులందరూ కలిసి ఎక్కువ సమయం గడిపేలా ప్లాన్ చేసుకోండి. దీనివల్ల చాలావరకు సమస్య తగ్గుతుంది. అప్పటికీ మీరు ఆ బాధ నుంచి బయటపడలేకపోతుంటే సైకియాట్రిస్ట్‌ను సంప్రదించండి. వారి సూచనలు, సలహాలతో కొద్ది రోజుల్లోనే సమస్య నుంచి బయటపడచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్