పడకగది విషయాలూ పంచుకుంటున్నాడు..!

నా పెళ్లై రెండేళ్లవుతోంది. నా భర్త సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్. నేను ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. నా భర్త ప్రవర్తనే నాకు సమస్యగా మారింది. పెళ్లైన రెండేళ్లకే ఆయన ప్రవర్తనతో విసిగిపోయాను. ప్రతి చిన్న విషయాన్ని స్నేహితులు, తల్లిదండ్రులతో పంచుకుంటున్నాడు.

Updated : 07 Feb 2024 21:11 IST

నా పెళ్లై రెండేళ్లవుతోంది. నా భర్త సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్. నేను ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. నా భర్త ప్రవర్తనే నాకు సమస్యగా మారింది. పెళ్లైన రెండేళ్లకే ఆయన ప్రవర్తనతో విసిగిపోయాను. ప్రతి చిన్న విషయాన్ని స్నేహితులు, తల్లిదండ్రులతో పంచుకుంటున్నాడు. దానివల్ల అత్తమామలకు చులకనగా మారాను. ఇంట్లో ఏం జరిగినా అత్తమామలు నన్నే నిందిస్తున్నారు. వీటికి తోడు ఆయనకు కోపం ఎక్కువ. ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందిస్తుంటాడు. ఇంట్లో ఏ వస్తువు కనిపించకపోయినా నన్నే బాధ్యురాలిని చేస్తుంటాడు. అతని తప్పును ఒప్పుకోకపోగా నాపై కోపం చూపిస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో మా గురించి కూడా అందరితోనూ పంచుకుంటున్నాడు. దాంతో మా దాంపత్య బంధానికి ప్రైవసీ లేకుండా పోయింది. ఈ ఆలోచనల వల్ల ఆఫీసులో సరిగా పని చేయలేకపోతున్నా. మానసిక ప్రశాంతత కరువైంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. రెండు భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు పెళ్లి అనే బంధంతో ఒక్కటవుతుంటారు. కాబట్టి, పెళ్లైన మొదట్లో ఒకరి అలవాట్లు, ఆలోచనలు మరొకరు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. అయితే, వాటికంటూ కొంత పరిమితి ఉంటుంది. కానీ, మీ విషయంలో అది శృతి మించిపోయినట్టుగా అనిపిస్తోంది. అతని ప్రవర్తన వల్ల మీరు తీవ్రంగా విసిగిపోయినట్టుగా అర్థమవుతోంది. ఇవి మీపై ప్రతికూల ప్రభావం చూపించడం సహజం. అయితే ఇలాంటి సందర్భంలో ధైర్యంగా ఉంటూ సమస్యను ఎదుర్కోవడానికి ప్రయత్నించాలన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి.

ముందుగా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి అంశంపై అతిగా స్పందించడం, అందరితోనూ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం, నేను చేసిందే కరెక్ట్‌ అనే భావన.. అతనిలో ఉన్నాయంటున్నారు. ఇవి అతనిలోని మానసిక అపరిపక్వతను సూచిస్తున్నాయి. అయితే దీనికి మీరు బాధ్యులు కాదన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి.

చాలా సమస్యలు చర్చించుకోవడం ద్వారానే పరిష్కారమవుతాయి. కాబట్టి, మీ భర్తతో మనసు విప్పి మాట్లాడడానికి ప్రయత్నించండి. ఈ క్రమంలో అతని ప్రవర్తన వల్ల మీరు పడుతున్న ఇబ్బందులను స్పష్టంగా తెలియజేయండి. ఒకవేళ అతని నుంచి సానుకూల స్పందన వస్తే ఇద్దరికీ ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గాలను వెతికే ప్రయత్నం చేయండి.

ఒకవేళ అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే నిపుణుల ద్వారా కపుల్‌ కౌన్సెలింగ్‌ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కౌన్సెలింగ్‌లో భాగంగా నిపుణులు- మీ ఇద్దరూ చర్చించుకోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడంతో పాటు సమస్య పరిష్కారానికి తగిన సలహా/సూచనలు ఇస్తుంటారు. అలాగే మీ భర్తకు ఏవైనా మానసిక సమస్యలుంటే గుర్తించి తగిన చికిత్సను సూచిస్తారు.

దాంపత్య బంధంలో ఇలాంటి సమస్యలు జీవిత భాగస్వామిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంటాయి. కాబట్టి, ఈ సమయంలో సహనం కోల్పోకుండా జాగ్రత్తపడాలి. అలాగే మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందుకోసం వ్యాయామం, ధ్యానం చేయడం వంటి వాటిని క్రమం తప్పకుండా పాటించండి. వీలైతే మీ పరిస్థితిని అర్థం చేసుకునే శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవడానికి ప్రయత్నించండి. సమస్య తప్పకుండా పరిష్కారమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్