‘నన్ను కాదంటే.. నీ పెళ్లే జరగనివ్వనం’టున్నాడు..!

నా వయసు 28 సంవత్సరాలు. నేను నా బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయాను. అతనితో అయిదేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. నా తల్లిదండ్రులు అతనిపై మొదటి నుంచీ వ్యతిరేకంగానే ఉన్నారు. దానికి తగ్గట్టే అతని ప్రవర్తన....

Published : 15 Jul 2023 12:48 IST

(Representational Image)

నా వయసు 28 సంవత్సరాలు. నేను నా బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయాను. అతనితో అయిదేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. నా తల్లిదండ్రులు అతనిపై మొదటి నుంచీ వ్యతిరేకంగానే ఉన్నారు. దానికి తగ్గట్టే అతని ప్రవర్తన ఉండేది. అతనికి కోపం ఎక్కువ. ఉద్యోగం కూడా లేదు. మా మధ్య చాలా గొడవలు జరిగాయి. దాంతో వారి అనుమానాలు పెరిగాయి. కానీ, తగ్గలేదు. అయినప్పటికీ ఇలాంటి గొడవలు కొంతకాలం మాత్రమే ఉంటాయని వారిని ఒప్పించడానికి చాలాసార్లు ప్రయత్నించాను. కొన్నిసార్లు ఇంట్లో నుంచి పారిపోతానని బెదిరించాను కూడా. కానీ, ఇటీవలే జరిగిన ఒక గొడవ పరిస్థితిని మొత్తం మార్చేసింది. ఆ సమయంలో అతను నన్ను తీవ్రంగా కొట్టాడు. అంతకుముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. కానీ అతనిపై ఉన్న ప్రేమతో క్షమించాను. కానీ, ఈసారి క్షమించలేకపోయాను. దాంతో అతనికి బ్రేకప్‌ చెప్పేశా. ఆ తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయి. అతను పదే పదే ఫోన్‌ చేస్తుంటే లిఫ్ట్‌ చేయడం మానేశా. దాంతో అతను మా తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడాడు. అతని తల్లి కూడా అదేవిధంగా మాట్లాడింది. ‘నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ పెళ్లి ఎవరితోనూ జరగనివ్వను’ అని బెదిరించాడు. దానికి మా తల్లిదండ్రులు భయపడి నా అభిప్రాయం తీసుకోకుండానే తెలిసిన వ్యక్తితో పెళ్లి ఫిక్స్‌ చేశారు. సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ ఆలస్యమైతే నేను తిరిగి అతనితో వెళ్లిపోతానేమోనని ఆందోళన చెందుతున్నారు. నేను చెప్పేది వినడానికి వారు ఏమాత్రం సిద్ధంగా లేరు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ గొడవల వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. ఎవరి జీవితంలోనైనా బ్రేకప్‌ అనేది వాంఛనీయం కాదు. దీని నుంచి బయడపడాలంటే కొంత సమయం పడుతుంది. మీ బాయ్‌ఫ్రెండ్‌ ప్రవర్తన సరిగా లేకున్నా మీరు ఐదేళ్ల పాటు బంధం బీటలు వారకుండా ప్రయత్నించారు. మీరు చెప్పిన విషయాలను బట్టి అతనితో మీ బంధం మంచిది కాదనిపిస్తోంది. అలాగే మీపై భౌతిక దాడి కూడా చేశాడని అంటున్నారు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా భౌతిక దాడి చేయడాన్ని సమర్ధించకూడదు. కాబట్టి, అతని విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం సరైందేనని అనిపిస్తోంది. ఇందుకు బ్రేకప్‌ తర్వాత అతను, అతని తల్లి ప్రవర్తించిన తీరే నిదర్శనం. అయితే బ్రేకప్‌ తర్వాత పడే బాధ కొంత సమయం వరకే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి, ఈ విషయాలను పదేపదే గుర్తు చేసుకుని బాధపడకండి.

మీ తల్లిదండ్రులు మీ శ్రేయస్సు గురించి ఆలోచిస్తున్నారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఇలాంటి పరిస్థితిలో అతని నుంచి మిమ్మల్ని రక్షించడం కోసమే వారు ఈ నిర్ణయం తీసుకున్నారేమో పరిశీలించండి. అంతేకానీ.. మీ మీద కోపంతోనో, అతను భయపెట్టాడన్న కారణంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారన్న అపోహలో ఉండకండి. ఇలాంటి సమయంలో తల్లిదండ్రుల ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అంతమాత్రాన నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ కింద పేర్కొన్న సూచనలను పాటించడానికి ప్రయత్నించండి.

గతం గురించి ఆలోచించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండుదు. కాబట్టి, సమయం వృథా చేయకుండా భవిష్యత్తు గురించి ఆలోచించండి.

ఒక వ్యక్తితో మీరు ఇప్పటికే చాలా ఇబ్బంది పడ్డారు. అంతమాత్రాన మీ జీవితంలోకి వచ్చే మరో వ్యక్తి కూడా అలాగే ప్రవర్తిస్తాడని అనుకోవడానికి లేదు. ఒకవేళ మీకు అనుమానం ఉంటే మీ పేరెంట్స్ ఎంపిక చేసిన వ్యక్తి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి.

ఇంతకుముందులా మీ దినచర్యను పాటించండి. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి. ఇందుకోసం మీకు నచ్చిన పనులు చేయండి.

మీ తల్లిదండ్రులు మీ మాట వినడానికి సిద్ధంగా లేరని అంటున్నారు. కాబట్టి, మీ అభిప్రాయాన్ని ఒక్కసారిగా గొడవపడుతున్నట్లుగా కాకుండా వీలైనప్పుడల్లా నిదానంగా చెప్పడానికి ప్రయత్నించండి. ఈక్రమంలో ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చించడానికి ప్రయత్నించండి.

అప్పటికీ సరైన నిర్ణయం తీసుకోలేకపోతుంటే మానసిక వైద్య నిపుణుల సహాయం తీసుకోండి. వారు మీ సమస్యను విని తగిన సలహా సూచిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్