Tina Dabi: నా పెదవికి నవ్వులు నేర్పావు.. ప్రియా నీకు జోహారు!

‘నా పెదవికి నవ్వులు నేర్పావు.. ప్రియా నీకు జోహారు..’ అంటూ మురిసిపోతోంది ఐఏఎస్‌ ఆఫీసర్‌ టీనా దాబి. సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో ఆలిండియా టాపర్‌గా నిలిచిన తొలి దళిత మహిళగా చరిత్ర సృష్టించిన ఆమె.. విడాకుల తర్వాత మళ్లీ త్వరలోనే రెండోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ క్రమంలో- తనకు కాబోయే భర్తను పరిచయం....

Published : 29 Mar 2022 17:11 IST

(Photos: Instagram)

‘నా పెదవికి నవ్వులు నేర్పావు.. ప్రియా నీకు జోహారు..’ అంటూ మురిసిపోతోంది ఐఏఎస్‌ ఆఫీసర్‌ టీనా దాబి. సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో ఆలిండియా టాపర్‌గా నిలిచిన తొలి దళిత మహిళగా చరిత్ర సృష్టించిన ఆమె.. విడాకుల తర్వాత మళ్లీ త్వరలోనే రెండోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ క్రమంలో- తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ సోషల్‌ మీడియాలో తాజాగా ఫొటోలు షేర్‌ చేసింది టీనా. ప్రస్తుతం ఈ జంట ఫొటోలు వైరల్‌గా మారాయి. వీళ్ల రెండో పెళ్లి ముచ్చట్లు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

టీనా దాబి భోపాల్‌లో పుట్టి పెరిగింది. అక్కడి కార్మెల్ కాన్వెంట్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె.. దిల్లీలోని లేడీ శ్రీరాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. 2015లో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసిన టీనా.. తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ టాపర్‌గా నిలిచింది. దాంతో ఈ ఘనత సాధించిన తొలి దళిత మహిళగా చరిత్ర సృష్టించింది టీనా. ప్రస్తుతం రాజస్థాన్‌ ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తోందామె. అయితే సర్వీస్‌లో తనకంటే రెండేళ్ల సీనియర్‌ అయిన డాక్టర్‌ ప్రదీప్‌ గవాండేతో ఏడడుగులు వేయబోతున్నట్లు తాజాగా ప్రకటించిందీ ఐఏఎస్‌ అధికారిణి.

నాలుగు నెలల ప్రేమ?!

ప్రదీప్‌ది మహారాష్ట్ర. 2013 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం రాజస్థాన్‌ పురావస్తు, మ్యూజియం శాఖకు డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఐఏఎస్‌ కాక ముందు ఆయన వృత్తిరీత్యా డాక్టర్‌. ఇక, ప్రదీప్‌తో తన పెళ్లి విషయాన్ని ప్రకటిస్తూ.. తమ నిశ్చితార్థ ఫొటోల్ని ఇన్‌స్టాలో పంచుకుంది టీనా.

‘నా పెదాలపై చిరునవ్వును నింపావు డియర్‌! #Fiance’ అంటూ క్యాప్షన్‌ పెట్టిందామె. ఇక ఇవే ఫొటోల్ని ప్రదీప్‌ కూడా తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఇందులో వీరిద్దరూ మిక్స్‌ అండ్‌ మ్యాచింగ్‌గా ఎరుపు రంగు దుస్తుల్ని ధరించి చిరునవ్వులు చిందించారు. అయితే టీనా కంటే ప్రదీప్‌ 13 ఏళ్లు పెద్దవారు. గత నాలుగు నెలలుగా ప్రదీప్‌-టీనా ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. ఈ జంట ఏప్రిల్‌ 22న ఒక్కటి కానుంది. ప్రస్తుతం వీళ్ల వెడ్డింగ్‌ కార్డ్‌ కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ జంటకు అటు ప్రముఖులు, ఇటు నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

మనస్పర్థలతో..

అయితే వీరిద్దరికీ ఇది రెండో వివాహం. 2018లో టీనా.. అథర్ ఆమిర్ ఖాన్ అనే ఐఏఎస్ ఆఫీసర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2015లో నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో టీనా దాబి మొదటి ర్యాంకు సాధించగా.. అథర్ రెండో ర్యాంకులో నిలిచారు. శిక్షణ సమయంలో వీరి మధ్య పరిచయం ప్రేమకు దారితీసింది. అలా 2018లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఇద్దరూ ఐఏఎస్ లు కావడమే కాకుండా, వీరిది మతాంతర వివాహం కావడంతో అప్పట్లో ఆ వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. పలువురు ప్రముఖులు వీరి పెళ్లికి హాజరయ్యారు. అయితే, మనస్పర్థల కారణంగా గతేడాది వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

కరోనా కట్టడిలో..

టీనాకు సోషల్‌ మీడియాలోనూ ఫాలోయింగ్‌ ఎక్కువే! ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాను 14 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇక తన వృత్తిలో భాగంగా.. కరోనా సమయంలో రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌గా విధులు నిర్వర్తించిన ఆమె.. ‘భిల్వారా మోడల్‌’ ఇనీషియేటివ్‌తో ఆ జిల్లాలో కరోనాను కట్టడి చేయడంలో సఫలీకృతురాలైంది. తద్వారా అప్పుడూ వార్తల్లో నిలిచింది టీనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్