మీ పిల్లల్లో ఈ లోపాలున్నాయా? గమనిస్తూ ఉండండి..

ముగ్ధకు మూడేళ్ల కొడుకున్నాడు. ఈ పాటికే మాటలు నేర్చుకోవాల్సిన వాడు తల్లి చెప్తే అస్సలు వినడు.. కనీసం పిలిచినా తనవైపు చూడడు. వీడినెలా మార్చాలో తెలియక తలపట్టుకుంటోందామె.

Published : 15 Feb 2022 17:19 IST

ముగ్ధకు మూడేళ్ల కొడుకున్నాడు. ఈ పాటికే మాటలు నేర్చుకోవాల్సిన వాడు తల్లి చెప్తే అస్సలు వినడు.. కనీసం పిలిచినా తనవైపు చూడడు. వీడినెలా మార్చాలో తెలియక తలపట్టుకుంటోందామె.

ఎనిమిదేళ్ల అనన్యకు గ్రాహ్య శక్తి తక్కువ. స్కూల్లో పాఠాలు శ్రద్ధగానే వింటుంది. కానీ అవి ఎక్కువసేపు గుర్తుపెట్టుకోలేదు. ఇది ఆమెకే కాదు.. ఆమె తల్లిదండ్రులకూ పెద్ద సమస్యగా మారింది.

పిల్లలు వయసు పెరుగుతున్న కొద్దీ ఎన్నో విషయాలు నేర్చుకుంటుంటారు. మాట్లాడడం, చదవడం, రాయడం, ఆలోచించడం, గ్రహించడం, గుర్తుపెట్టుకోవడం.. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అలవడుతుంటాయి. అయితే కొంతమంది చిన్నారులు మాత్రం ఈ విషయాల్లో వెనకబడిపోతుంటారు. దీన్నే నేర్చుకోవడంలో లోపం (Learning disability) అంటున్నారు నిపుణులు. ADHD (Attention Deficit Hyperactivity Disorder) సమస్య ఉన్న వారిలోనూ ఇలాంటి మెదడు సంబంధిత లోపాలు తలెత్తచ్చంటున్నారు. అలాగని నిరాశ చెందకుండా.. పిల్లలు ఎదుర్కొంటున్న ఈ సమస్యల్ని గుర్తించి.. తగిన చికిత్స/థెరపీ అందిస్తే వారు తప్పక గాడిలో పడతారంటున్నారు నిపుణులు. మరి, అదెలాగో మనమూ తెలుసుకుందాం రండి..

వంశపారంపర్యంగా వస్తుందా?

పిల్లలు ఆయా విషయాల్ని నేర్చుకోవడంలో వెనకబడిపోవడానికి వివిధ రకాల కారణాలున్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా చాలా కేసుల్లో ఈ సమస్య వంశపారంపర్యంగా తలెత్తే అవకాశాలున్నాయంటున్నారు. అంటే.. తల్లిదండ్రులకు లేదంటే రక్తసంబంధీకుల్లో ఎవరికైనా ఈ సమస్య ఉన్నట్లయితే చిన్నారులకూ రావచ్చట! అంతేకాదు.. తక్కువ బరువుతో జన్మించడం, నెలలు నిండకుండానే జన్మించడం, తలకు దెబ్బ తగలడం, Meningitis (మెదడు, వెన్నెముకకు రక్షణ కల్పించే పొరల్లో వాపు ఏర్పడడం).. వంటివన్నీ పిల్లల్లో నేర్చుకునే లోపాలకు కీలక కారణాలంటున్నారు నిపుణులు.

ఇలా గుర్తించచ్చు!

వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల్లో మానసిక లోపాలున్నాయని గ్రహించి చాలామంది తల్లిదండ్రులు నిరాశ చెందుతుంటారు. ఇక తమ చిన్నారి అందరు పిల్లలతో కలవలేడేమోనని బాధపడుతుంటారు. అయితే దీనివల్ల ప్రయోజనం ఉండదని, అసలు సమస్యేంటో గుర్తించి నిపుణులతో చికిత్స/థెరపీ అందిస్తే సానుకూల ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పిల్లల్లో ఉన్న మానసిక లోపాల్ని ఇలా గుర్తించచ్చంటున్నారు.

* సాధారణంగా పిల్లలు రెండు నుంచి మూడేళ్ల మధ్య పదాలు పలకడం, చిన్న చిన్న వాక్యాలు చెబుతుంటే తిరిగి చెప్పడం.. వంటివి చేస్తుంటారు. ఒకవేళ ఇలా చెప్పట్లేదంటే వాళ్లలో కొత్త అంశాలు నేర్చుకునే విషయంలో, ప్రత్యేకించి భాషాపరమైన విషయాలలో జాప్యం జరుగుతున్నట్లుగా అర్థం చేసుకోవాలి.

* ఇక మూడేళ్లు దాటిన పిల్లలు మాట్లాడే మాటలు స్పష్టంగా, చాలా వరకు పెద్ద వాళ్లకు అర్థమయ్యేలా ఉంటాయి. కానీ అలా మాట్లాడకపోయినా, పదాలు పలకడంలో ఇబ్బంది పడుతున్నా ఆలస్యం చేయకూడదు.

* స్కూల్లో చేరడానికి ముందే చాలామంది పిల్లలు రంగులు, ఆకృతులు, అక్షరమాల, అంకెలు.. వంటివన్నీ నేర్చుకుంటారు. ఒకవేళ అలా నేర్చుకోవడంలో ఇబ్బంది పడినా.. అదీ లోపమేనని తల్లిదండ్రులు గుర్తించాలి.

* వయసు పెరిగే కొద్దీ స్నానం చేయడం, దుస్తులు వేసుకోవడం, తినడం.. ఇలా చాలా వరకు తమ పనులు తాము చేసుకోవడం పిల్లలకు నేర్పిస్తాం. కానీ ఒకవేళ అలా చెప్పినా నేర్చుకోలేకపోతే మాత్రం వారిలో మానసికంగా ఏదో లోపం ఉందని అనుమానించడంలో తప్పు లేదంటున్నారు నిపుణులు.

* ఎదిగే కొద్దీ పిల్లలు కొత్తగా ఏదైనా చెప్తే ఒక చోట కూర్చొని ఏకాగ్రతతో వినడం, తదేకంగా అలాగే చూస్తుండడం సహజమే. కానీ అలా చేయకపోయినా, కళ్లలోకి కళ్లు పెట్టి చూడకపోయినా, కోపం-చిరాకు ప్రదర్శించినా.. ఆలస్యం చేయకుండా థెరపిస్ట్‌ని సంప్రదించడం ఉత్తమం.

* ఇక స్కూలుకెళ్లే పిల్లల్లో.. చదవడంలో ఇబ్బంది (Dyslexia), రాయడంలో సమస్య (Dysgraphia), గణితం నేర్చుకోవడంలో ఇబ్బంది (Dyscalculia).. వంటివి తలెత్తినా వారిలో నేర్చుకునే లోపాలున్నాయని గ్రహించడం ముఖ్యమని గుర్తుపెట్టుకోండి.
పరిష్కారం.. మన చేతుల్లోనే!

ప్రతి సమస్యకూ ఓ పరిష్కారమున్నట్లే.. పిల్లల్లో నేర్చుకునే లోపాల్ని అధిగమించడానికీ పరిష్కార మార్గాలున్నాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో సంబంధిత నిపుణుల వద్ద చికిత్స/థెరపీ అందించడంతో పాటు తల్లిదండ్రులు కూడా ఇంట్లో పిల్లలతో మెలిగేటప్పుడు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవడం ముఖ్యమంటున్నారు.

ప్రత్యేకతల్ని ప్రశంసించండి!

పిల్లల్లో ఇలాంటి లోపాలే కాదు.. వారికంటూ కొన్ని ప్రత్యేకతలూ ఉంటాయి. అయితే చాలామంది తల్లిదండ్రులు పిల్లల్లో ఉన్న లోపాలనే ఎత్తి చూపుతారు.. కానీ ప్రత్యేకతల్ని గ్రహించరు. కానీ నేర్చుకునే లోపాల్ని అధిగమించాలంటే ఇలాంటి ప్రత్యేకతలపై దృష్టి సారించడం మంచిదంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. మీ చిన్నారికి ఆటలంటే ఇష్టమనుకోండి.. అందులోనే ప్రోత్సహించండి.. వాళ్లు సక్సెసైన ప్రతిసారీ ప్రశంసించండి. ఇక వారి సంతోషానికి అవధులుండవు. ఈ మానసిక ఆనందమే వారి సమస్యకు క్రమంగా పరిష్కారం చూపే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.

వాళ్లతో కలవనివ్వండి!

నేర్చుకోవడంలో లోపాలున్న చిన్నారులు ఎదిగే క్రమంలో ఇతరులతో పోల్చుకొని ఒకింత భావోద్వేగానికి గురవుతుంటారు.. ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. అలాంటి పిల్లల లోపాల్ని ఎత్తి చూపుతూ అరవడం, కోపగించుకోవడం.. వంటివి తల్లిదండ్రులు అస్సలు చేయకూడదంటున్నారు నిపుణులు. అలా బాధపడుతున్నప్పుడు వాళ్లను ప్రేమగా దగ్గరికి తీసుకోవడం, వాళ్లలోని ప్రత్యేక నైపుణ్యాల్ని గుర్తుచేయడం, ఇలా కాకపోతే మరోలా నేర్చుకుందామంటూ ప్రోత్సహించడం.. ఇవన్నీ పిల్లల్లోని మానసిక/నేర్చుకోవడంలో ఉన్న లోపాల్ని అధిగమించే పద్ధతులే. అలాగే వీలు చిక్కినప్పుడల్లా వారిని బయటి ప్రదేశాలకు, పార్కులకు తీసుకెళ్లడం.. తోటి పిల్లలతో ఆడుకునేలా, మాట కలిపేలా ప్రోత్సహించడం.. వంటివి చేస్తే వాళ్లలో మార్పు రావడానికి పెద్ద సమయం పట్టదంటున్నారు నిపుణులు.

సలహా తీసుకోవడంలో తప్పు లేదు!

పిల్లల్లోని ఈ మానసిక లోపాల్ని అధిగమించడానికి మీ ప్రయత్నాలతో పాటు నిర్ణీత వ్యవధుల్లో నిపుణుల దగ్గరికి తీసుకెళ్లడం తప్పనిసరి. అయితే ఈ క్రమంలో మీలాగే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్నీ అక్కడికి తీసుకొస్తుంటారు. వీలైతే వాళ్ల పిల్లల సమస్యలు తెలుసుకోండి.. ఈ సమస్యను వాళ్లెలా పరిష్కరిస్తున్నారో అడగండి. అందులో మీ పిల్లలకూ ఉపయోగపడే సలహాలుండచ్చు. వాటిని గ్రహించి మీ పిల్లల విషయంలో అనుసరిస్తే కొంత వరకు ఫలితం ఉంటుంది. అంతేకానీ.. వాళ్లను అడిగితే ఏమనుకుంటారో.. మా పిల్లల గురించి వారికి చెప్తే దాన్నెలా స్వీకరిస్తారోనన్న మొహమాటం అస్సలు పనికి రాదంటున్నారు నిపుణులు.

నైపుణ్యాలే నడిపిస్తాయి!

మానసిక/నేర్చుకునే లోపాలున్న పిల్లల భవిష్యత్తు గురించి చాలామంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. ఈ లోపాలే వారి కెరీర్‌కు అడ్డుపడతాయేమోనని నిరాశ పడుతుంటారు. కానీ ఈ ప్రతికూల ఆలోచనలు సరికాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. దాన్ని పసిగట్టి ప్రోత్సహిస్తే పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించినట్లే! ఈ క్రమంలో సవాళ్లను అధిగమించడం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెంపొందించడం, వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు నేర్పించడం, ఆర్థిక విషయాల్లో అవగాహన కల్పించడం.. ఇలా ఒక్కొక్కటీ ఓపిగ్గా నేర్పించడం వల్ల వారి భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దిన వారవుతారు. పిల్లలూ తమకు అందివచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకొని కెరీర్‌లో సక్సెస్‌ సాధిస్తారు.
ఇక వీటితో పాటు పిల్లల్ని మరింత చురుగ్గా తయారుచేయడానికి చక్కటి పోషకాహారం, వ్యాయామాలు, ఐ-కాంటాక్ట్‌ని పెంపొందించే చిన్న చిన్న వర్కవుట్లు, మానసిక లోపాల్ని అధిగమించేందుకు యోగా-ధ్యానం.. వంటివన్నీ తప్పనిసరి అంటున్నారు నిపుణులు.

మరి, మీ పిల్లల్లోనూ ఇలాంటి మానసిక లోపాలున్నాయా? విషయాలు నేర్చుకోవడంలో, గ్రహించడంలో వెనకబడిపోతున్నారా? అయితే వాటిని అధిగమించడానికి తల్లిదండ్రులుగా మీరు ఎలాంటి చిట్కాలు పాటిస్తున్నారు? Contactus@vasundhara.net వేదికగా మీ విలువైన సలహాలు, సూచనలు మాతో పంచుకోండి. మీరిచ్చే టిప్స్‌ ఇలాంటి సమస్యలున్న పిల్లల తల్లిదండ్రులకు ఉపయోగపడచ్చు..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్