గర్భవిచ్ఛిత్తికి ఏది సరైన సమయం?

అవాంఛిత, బలవంతపు గర్భధారణ.. మొదలైన సందర్భాలలో గర్భవిచ్ఛిత్తి కోసం వివిధ అసురక్షిత మార్గాల్ని అనుసరిస్తున్న వారు ఎందరో! దీని ప్రభావం వారి ఆరోగ్యంపై పడడంతో పాటు ఏటా 50 వేల మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ఈ క్రమంలో- సుప్రీంకోర్టు కీలక తీర్పు....

Updated : 30 Sep 2022 15:58 IST

అవాంఛిత, బలవంతపు గర్భధారణ.. మొదలైన సందర్భాలలో గర్భవిచ్ఛిత్తి కోసం వివిధ అసురక్షిత మార్గాల్ని అనుసరిస్తున్న వారు ఎందరో! దీని ప్రభావం వారి ఆరోగ్యంపై పడడంతో పాటు ఏటా 50 వేల మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ఈ క్రమంలో- సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెళ్లితో సంబంధం లేకుండా అవాంఛిత గర్భం దాల్చిన మహిళలెవరైనా సరే.. 24 వారాల వరకు గర్భవిచ్ఛిత్తి చేయించుకోవచ్చని పేర్కొంది. అలాగే ఎంటీపీ చట్టంలోని సెక్షన్‌ 3(బి)ఎ పరిధిలోకి తొలిసారిగా వైవాహిక అత్యాచారాన్ని తీసుకొచ్చింది. తన అంగీకారం లేకుండా భర్త బలవంతంగా చేసిన సంభోగం కూడా అత్యాచారం కిందకే వస్తుందని, ఈ క్రమంలో గర్భం ధరించినట్లయితే దానిని తొలగించుకొనే సంపూర్ణ హక్కు భార్యకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అసలు అబార్షన్లు ఏ సమయంలో/ ఏ దశలో సురక్షితం? ఈ విషయంలో నిపుణులేమంటున్నారో తెలుసుకుందాం..

పెళ్లైనా, కాకపోయినా..!

సరైన గర్భనిరోధక పద్ధతులు పాటించకపోవడం, పాటించినా అవి ఫెయిలవడం, అత్యాచారం, వైవాహిక అత్యాచారం, వివాహేతర సంబంధాలు.. ఇలాంటి సందర్భాల్లో మహిళలు అవాంఛిత గర్భం ధరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొంతమంది ఇష్టపూర్వకంగానే గర్భం ధరించినా పిండం ఎదుగుదలలో లోపాలున్నట్లయితే అనివార్య పరిస్థితులలో అబార్షన్ చేయించుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో గుట్టుచప్పుడు కాకుండా, చట్టవిరుద్ధంగా అబార్షన్లు చేయించుకోవడం, అసురక్షిత గర్భవిచ్ఛిత్తి పద్ధతులు పాటించేవారే ఎక్కువ! దీనివల్ల మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంతేకాదు.. కొందరు మహిళలు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ప్రత్యేకించి పెళ్లి కాకుండా గర్భం ధరించిన వారి విషయంలో ఇలాంటి అవకాశాలెక్కువ. ఈ నేపథ్యంలో తాజాగా ‘మెడికల్ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ చట్టం’(ఎంటీపీ)లో మార్పులు చేసింది భారత అత్యున్నత న్యాయస్థానం.

ఇందులో భాగంగా మహిళలు తమ వైవాహిక స్థితితో సంబంధం లేకుండా అవాంఛిత గర్భం దాల్చినట్లయితే.. వారు 24 వారాల వరకు చట్టపరంగా గర్భవిచ్ఛిత్తి చేయించుకోవచ్చని తాజాగా తీర్పు వెలువరించింది. 

ఎంటీపీ చట్టం ప్రకారం.. వివాహితులు, అత్యాచార బాధితులు, దివ్యాంగులు, మైనర్లు..  మొదలైన వర్గాలకు చెందిన మహిళలు 24 వారాల్లో గర్భవిచ్ఛిత్తి చేసుకోవచ్చు. అయితే వితంతువులు, అవివాహితులకు ఈ గడువు ఇప్పటివరకు ౨౦ వారాల వరకే ఉండేది.  తాజాగా సుప్రీంకోర్టు దీనిని 20 నుంచి 24 వారాలకు పెంచింది.

ఈ క్రమంలో- ‘చట్టప్రకారం మహిళలందరికీ సురక్షితంగా అబార్షన్‌ చేయించుకునే హక్కు ఉంటుంది. వివాహిత, అవివాహిత అనే కారణాలతో అవాంఛిత గర్భాన్ని తొలగించుకునే హక్కు లేదని చెప్పడం సరైనది కాదు.. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టం నిబంధనల ప్రకారం పెళ్లయినా, కాకపోయినా గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్‌ చేయించుకునే హక్కుంది. ఈ విషయంలో వివాహితులు, అవివాహితులు అని వివక్ష చూపించడం నేరం.. రాజ్యాంగ విరుద్ధం.. పెళ్లయిన వారిని 24 వారాల వరకు అబార్షన్‌కు అనుమతిస్తూ.. అవివాహితులను అనుమతించకపోవడం సరికాదు.

పిల్లల్ని కనాలా లేదా అనే విషయంలో వివాహిత మహిళలకు ఉండే స్వేచ్ఛే పెళ్లి కాని మహిళలకూ ఉంటుంది. ప్రతి మహిళకు తన శరీరంపై సంపూర్ణ హక్కు ఉంటుంది. గర్భస్రావం చేయించుకోవాలా వద్దా అన్న విషయంపై నిర్ణయం తీసుకొనే అధికారం కూడా అంతిమంగా ఆమెకే వదిలేయాలి’ అని కోర్టు పేర్కొంది.

ఎప్పుడు చేయించుకోవాలి?

అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవడమే కాదు.. దాన్ని ఎన్ని వారాల్లోపు తొలగించుకుంటే సురక్షితమో కూడా ఇక్కడ కీలకమైన అంశమే అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా తొలి త్రైమాసికంలో అంటే 12 వారాల్లోపు గర్భ విచ్ఛిత్తి చేయడం మంచిదంటున్నారు. ఒక్కోసారి ఇది కుదరక ఆలస్యమైన కొద్దీ కడుపులో పిండం ఎదుగుతుంది. ఇలాంటప్పుడు తొలగించడానికి కొన్ని కేసుల్లో సర్జరీ కూడా చేయాల్సి రావచ్చు. అంతేకాదు.. తీవ్రమైన కడుపు నొప్పి, రక్తం ఎక్కువగా కోల్పోవడం.. ఇలా ఆరోగ్యపరంగానూ మహిళలు పలు సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చంటున్నారు నిపుణులు. ఇక 24 వారాలు, అంతకు మించిన కేసుల్లో గర్భవిచ్ఛిత్తి చేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ అంటున్నారు. కాబట్టి అబార్షన్ల విషయంలో తొలినాళ్లలోనే సరైన నిర్ణయం తీసుకోవాలన్నది వైద్యుల అభిప్రాయం!

అలాగే కారణమేదైనా.. అబార్షన్‌ జరిగిన తర్వాత తిరిగి త్వరగా కోలుకోవాలంటే చక్కటి పోషకాహారం తీసుకుంటూ మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్