Relationship Tips: ఆ సమస్యకు కారణం మీరా? మీవారా?

దాంపత్య బంధంలో కలతలు సహజం. భార్యాభర్తలిద్దరూ సర్దుకుపోతే ఇలాంటివి ఎన్నొచ్చినా క్షణాల్లో పరిష్కారమవుతాయి. కానీ కొంతమంది మాత్రం ప్రతి విషయంలోనూ భాగస్వామితో కయ్యానికి కాలు దువ్వడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. మాటలు, చేతలతో వారి మనసును గాయపరుస్తుంటారు. తమది తప్పని తెలిసినా దాన్ని అంగీకరించరు.. సరికదా అన్నింట్లోనూ తామే కరక్ట్‌ అన్నట్లుగా వ్యవహరిస్తారు.

Published : 13 Apr 2024 20:58 IST

దాంపత్య బంధంలో కలతలు సహజం. భార్యాభర్తలిద్దరూ సర్దుకుపోతే ఇలాంటివి ఎన్నొచ్చినా క్షణాల్లో పరిష్కారమవుతాయి. కానీ కొంతమంది మాత్రం ప్రతి విషయంలోనూ భాగస్వామితో కయ్యానికి కాలు దువ్వడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. మాటలు, చేతలతో వారి మనసును గాయపరుస్తుంటారు. తమది తప్పని తెలిసినా దాన్ని అంగీకరించరు.. సరికదా అన్నింట్లోనూ తామే కరక్ట్‌ అన్నట్లుగా వ్యవహరిస్తారు. ఫలితంగా ఇద్దరి మధ్య దూరం పెరగడంతో పాటు అనుబంధంలోని మాధుర్యమూ ఆవిరైపోతుంది. అయితే ఇది ఇద్దరినీ విడదీయకముందే జాగ్రత్తపడమంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. ఇందుకోసం తమ దాంపత్య బంధంలో ప్రతికూల పరిస్థితులు రావడానికి అసలు కారణం దంపతులిద్దరిలో ఎవరో గుర్తించమంటున్నారు. ఇద్దరి మాటలు, చేతల్లో కొన్ని మార్పుల ద్వారా ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడం సులువవుతుందంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

ఇలా ప్రవర్తిస్తున్నారా?

⚛ గొడవలైనప్పుడు క్షణికావేశంలో భార్యాభర్తలిద్దరూ మాటా మాటా అనుకున్నా.. ఆ తర్వాత తప్పు తెలుసుకొని తిరిగి కలిసిపోవడం చూస్తుంటాం. కానీ కొంతమంది భాగస్వామి వేసిన ప్రతి అడుగులోనూ తప్పులు వెతుకుతుంటారు. ప్రతి నిర్ణయాన్నీ వ్యతిరేకిస్తారు. ఈ క్రమంలో అవతలి వారు బాధతో ఓ మాట అన్నా.. విడాకులిస్తానంటూ బెదిరిస్తుంటారు. ఇలా ప్రతి చిన్న విషయానికే విడాకులిస్తాననడం వారి అభద్రతా భావానికి సంకేతమంటున్నారు నిపుణులు. ఇలా ఇద్దరి మధ్య దూరం పెరగడానికి, అనుబంధంలో కలతలు రేగడానికి అసలు కారణం వారేనంటున్నారు.

⚛ ఎవరూ వంద శాతం పర్‌ఫెక్ట్‌ కాదు.. ప్రతి ఒక్కరూ తెలిసో, తెలియకో కొన్ని తప్పులు/పొరపాట్లు చేస్తుంటారు. వాటిని గ్రహించి సరిదిద్దుకుంటే సమస్య ఉండదు. ఇక భార్యాభర్తలిద్దరూ ఒకరి తప్పుల్ని మరొకరు క్షమించడమూ సహజమే. అలాకాకుండా మీ భాగస్వామి మాటిమాటికీ మీరు చేసిన పాత తప్పుల్ని గుర్తుచేస్తూ.. మాటలు, చేతలతో వేధిస్తుంటే మాత్రం.. మీ మధ్య దూరం పెరగడానికి, అనుబంధం సన్నగిల్లడానికి అసలు కారణం వారే అని అర్థం చేసుకోవాలి.

⚛ మంచి జరిగితే తమకు ఆపాదించుకోవడం, చెడు జరిగితే ఇతరుల పైకి నెట్టేయడం.. ఇలా కొంతమంది చేస్తుంటారు. కొందరు దంపతుల్లోనూ ఇలాంటి ప్రవర్తనను గమనించచ్చు. ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయమే అయినా.. తప్పుల్ని భాగస్వామి పైకి నెట్టేసే వారే తమ అనుబంధంలో కలతలకు అసలు కారణమని గ్రహించమంటున్నారు నిపుణులు.

⚛ దంపతులే అయినా.. ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వారికి ఉంటుంది. ఈ విషయాన్ని విస్మరించి కొంతమంది తమ భాగస్వామి ఇలాగే ఉండాలి.. ఈ తరహా దుస్తులే వేసుకోవాలి.. నాకు నచ్చినట్లుగానే నడచుకోవాలి.. అంటూ ఆంక్షలు పెడుతుంటారు. ఇది అవతలి వారికి నచ్చక చీటికీ మాటికీ గొడవలవుతుంటాయి. ఇలా ఇద్దరి మధ్య దూరం పెరగడానికి ఆంక్షలు పెట్టిన వారే కారణం అంటున్నారు నిపుణులు. కాబట్టి హద్దులు దాటనంత వరకు ఒకరి స్వేచ్ఛను మరొకరు హరించకపోవడం మంచిదంటున్నారు.

⚛ అతి ఆలోచనల వల్ల కూడా దాంపత్య బంధంలో అరమరికలొస్తాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో భాగస్వామికి సంబంధించిన ప్రతి విషయాన్నీ లోతుగా పరిశీలించి చూడడం, విశ్లేషించడం వల్ల.. అందులో పొరపాట్లు లేకపోయినా.. ఉన్నట్లుగా భ్రమ కలుగుతుంది. ఇది ఇద్దరి మధ్య విభేదాలకు కారణమవుతుంది. కాబట్టి దంపతులిద్దరిలో ఎవరు ఇలాంటి ఆలోచన విధానంతో ఉంటే.. వారే దాంపత్య బంధంలో కలతలు రేగడానికి అసలు కారణం అంటున్నారు నిపుణులు.

⚛ అటు ఉద్యోగ బాధ్యతల్ని, ఇటు ఇంటి బాధ్యతల్ని సమానంగా పంచుకుంటున్నారు ఈతరం భార్యాభర్తలు. అయితే కొంతమంది ఇంటి పనుల విషయానికొస్తే.. అది నా పని కాదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అన్ని పనులు భాగస్వామి చేసుకున్నప్పటికీ.. కనీసం సహాయం చేయడానికి కూడా ముందుకు రారు. ఈ నిర్లక్ష్యమే ఇద్దరి మధ్య దూరం పెంచుతుంది. ఇలాంటి ప్రవర్తన మీకు భాగస్వామిపై, మీ అనుబంధంపై ఆసక్తి సన్నగిల్లిందనడానికి సంకేతం అంటున్నారు నిపుణులు.

⚛ భార్యాభర్తలు ప్రతి విషయంలో ఎంత బ్యాలన్స్‌డ్‌గా ఉంటే అనుబంధం అంత దృఢంగా ఉంటుంది. అయితే కొంతమంది భాగస్వామిపై అహంకారాన్ని ప్రదర్శిస్తుంటారు. తమ మాటే నెగ్గాలనుకోవడం, వారిపై ఆధిపత్యం చెలాయించడం, మాటిమాటికీ భాగస్వామిని తప్పు పట్టడం, అనుకున్న పనులు ఆ క్షణమే జరగాలనుకోవడం.. మీ మధ్య ప్రేమ తగ్గిపోవడానికి ఇలా పరోక్షంగా మీ ప్రవర్తన కూడా కారణమవుతుందంటున్నారు నిపుణులు.

గ్రహిస్తే సరిపోదు.. పరిష్కరించుకోవాలి!

దాంపత్య బంధంలో కలతలు రేగడానికి కారణం మీరేనని గ్రహిస్తే సరిపోదు.. ఆయా సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలో కూడా ఆలోచించాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పొరపాటు ఇద్దరిలో ఎవరిదైనా.. ఒప్పుకొని భాగస్వామిని క్షమాపణ కోరడం.. ఇకనుంచైనా ఒకరి మనసు మరొకరు తెలుసుకొని మసలుకోవడం.. వంటివి సమస్య అక్కడితో సద్దుమణిగేలా చేస్తాయి. అలాకాకుండా.. కొంతమంది మొండిగా ప్రవర్తిస్తుంటారు. ఇద్దరి మధ్య పొరపచ్ఛాలు రావడానికి తామే కారణం అని తెలిసినా.. తమను తాము మార్చుకోవడానికి, అవతలి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. పైగా ఎవరి మాట వినను అన్నంత మొండిగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారికి కౌన్సెలింగ్‌ మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ఒకవేళ ఇన్ని చేసినా.. భాగస్వామి మీతో కలిసుండడానికి ఇష్టపడకపోతే మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్