Updated : 19/01/2023 09:58 IST

చేదు అనుభవాలే.. హాస్య గుళికలుగా..

ఒకర్నొకరు ఆటపట్టించుకుంటూ హాస్యం సృష్టించడం మామూలే. కానీ ఒకే వ్యక్తి ఏకబిగిన మాట్లాడుతూ నవ్వుల వర్షం కురిపించడం మహా కష్టం. అలాంటి స్టాండప్‌ కమెడియన్‌ శ్వేతా మంత్రి. ధీమాగా ఛలోక్తులు విసిరే ఆ అమ్మాయి నిలబడటానికే కష్టమైన వైకల్యంతో బాధ పడుతోందంటే నమ్మకం కలగదు. అంత హుషారుగా, ఉత్సాహంగా ఉండే శ్వేత ప్రయాణం ఆమె మాటల్లోనే...

నేను స్పైనా బిఫిడా సమస్యతో పుట్టాను. వెన్నెముక కొంత చీలి ఉంది. వక్రత, అగమ్య గోచరాలనే ఫ్రీ ప్యాకేజ్‌తో లోకంలోకి వచ్చాను. వీటికి తోడు ఒకసారి కాలు ఫ్రాక్చరవడంతో కొన్నాళ్లు మంచంలోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో స్టాండప్‌ కామెడీ వీడియోలు చూశాను. ‘అరే.. నేనూ బోలెడన్ని ఛలోక్తులు విసురుతూ ఉంటానుగా.. నాలాంటివాళ్లకి ఎదురయ్యే సమస్యలూ, అవమానాలతో షో ఎందుకు చేయకూడదు?!’ అనిపించింది. అది కార్యరూపం ధరించి నేను స్టేజ్‌ ఎక్కినరోజు ప్రపంచ వికలాంగుల దినోత్సవం. అందాకా వికలాంగులు షో చేశారు కానీ వైకల్యం మీద చేయలేదు.

అవహేళనలూ చేదు అనుభవాలకు హాస్యం రంగు అద్దేసరికి అద్భుతంగా పేలింది. కానీ కొందరికి నచ్చక ‘మామూలు జోక్స్‌ చెప్పొచ్చుగా’ అన్నారు. ‘ఇవి అవసరం. ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను కనుక బాగా చెప్పగలుగుతాను’ అన్నాను. నా చెణుకులు కొందరికి అసౌకర్యం కలిగించినా.. ఆ చేదు నిజాలను హాస్యంగా అందిస్తూనే ఉంటాను. ఎందుకంటే అవి అందరికీ చేరాల్సిన అమూల్య సందేశాలు. వికలాంగులు కనిపించగానే జాలిగా చూస్తూ సాయం చేయడానికి సిద్ధమైపోతుంటారు. వాళ్లేమైనా అడిగారా? సానుభూతిని భరించడం ఎంత దుర్భరమో ఎందుకర్థం కాదు.. తరహాలో ఆలోచనలు రేకెత్తించేలా చేస్తుంటాను. నేను ఫోకస్‌ పెట్టింది వైకల్యమే అయినా అత్యుత్సాహం, ఉదాసీనత, ఇంటిపనులు, సంబంధ బాంధవ్యాలు, ప్రేమ పెళ్లిళ్లు, స్టూడెంట్ల అల్లరి చేష్టలు, భార్యాభర్తల గొడవల్లాంటి అనేక విషయాల మీదా చేస్తుంటాను. ఇదేమీ సులువైంది కాదు. విషాదాన్ని వినోదంగా మార్చి చెప్పాలి.

వైకల్యం అనగానే అయ్యో అంటారు. లేదంటే చెట్టెక్కిస్తారు. నిజానికి రెండూ సరికాదు. నేను నా సమస్యని అధిగమించి స్టాండప్‌ కామెడీ చేస్తున్నానని మహా స్ఫూర్తి అంటూ ప్రశంసలు కురిపించారు. అంటే అవకరం ఉన్నవాళ్లు అందరిలా చేయలేరనే భావన జనాల్లో నిండి ఉంది. మమ్మల్ని ప్రత్యేకంగా చూడొద్దని మళ్లీ మళ్లీ చెబుతుంటాను.

వైకల్యం వల్ల చాలా విషయాల్లో ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుంది. ప్రయాణించాలన్నా, పబ్లిక్‌ టాయ్‌లెట్‌ వాడాలన్నా కష్టంగా ఉంటుంది. ఆటోవాలా మీటర్‌ రేట్‌కు రెట్టింపు ఇవ్వమంటాడు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా మాకు ప్రత్యేక సదుపాయాలు కల్పించమని అడుగు తుంటాను. ప్రభుత్వాలూ ప్రజలూ ఆ పని చేస్తే చాలు.

స్టాండప్‌ కామెడీతోబాటు కథనాలూ రాస్తుంటాను. ‘డిజెబిలిటీ.. ఎ స్టేట్‌ ఆఫ్‌ మైండ్‌’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించాను. ఇవన్నీ తప్పకుండా ప్రభావం చూపుతాయని, త్వరలోనే వికలాంగులు అవస్థ పడకుండా సుఖంగా, సౌఖ్యంగా జీవనం సాగించే రోజులు వస్తాయని నమ్ముతున్నాను. మూస పద్ధతులను వదిలేసి ఎప్పటికప్పుడు కొత్తగా చెప్పేందుకు, మరింత మెరుగుదల కనబరచేందుకు ప్రయత్నిస్తుంటాను. ఎప్పటికైనా అంతర్జాతీయ స్థాయికి చేరతానని నమ్ముతున్నాను’.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి