Anupriya Kapoor: పరుగుతో ఆందోళన పరార్‌

ప్రసవం అతి మామూలు సంగతి అనుకుంటాం. నిజానికది మరో జన్మెత్తడమే. శారీరకంగా, మానసికంగా నూ నీరసం ఆవరిస్తుంది. అందునా భర్తకు దూరమైతే ఆ తల్లి స్థితి దయనీయం. ‘ఒంటరి తల్లుల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌తో బాధపడుతున్నారు.

Updated : 27 May 2023 05:15 IST

ప్రసవం అతి మామూలు సంగతి అనుకుంటాం. నిజానికది మరో జన్మెత్తడమే. శారీరకంగా, మానసికంగా నూ నీరసం ఆవరిస్తుంది. అందునా భర్తకు దూరమైతే ఆ తల్లి స్థితి దయనీయం. ‘ఒంటరి తల్లుల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. దాన్ని నిర్లక్ష్యం చేస్తే చాప కింద నీరులా నిశ్శబ్దంగా వ్యాపిస్తూ చేయాల్సిన నష్టమంతా చేసేస్తుంది. ఆ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు. కొందరు ఏదో కోల్పోయినట్లుంటే, ఇంకొందరు నిరాశగా ఉంటారు. కొందరు మాటిమాటికీ ఏడిస్తే, కొందరు తామెందుకూ పనికిరామని విరక్తికి లోనవుతారు. కొందరు ఎటునుంచీ ఏ ఆశా లేదని ఒంటరితనంతో కుంగిపోతారు. ఆత్మహత్యకూ ప్రయత్నిస్తారు. ఇవి ప్రసవానంతర డిప్రెషన్‌ లక్షణాలని బాధపడుతున్న వ్యక్తికే తెలీదు. దీన్నుంచి బయటపడితే ఒంటరి తల్లులు బిడ్డ ముద్దుమురిపాలతో సంతోషిస్తారు’ అంటోంది బ్లాగర్‌, ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌, వ్యాపారవేత్త ‘అనుప్రియా కపూర్‌’. ఆ స్ఫూర్తి ప్రయాణం ఆమె మాటల్లోనే...

‘నేను సింగిల్‌ పేరెంట్‌ని.  నేనూ, నా భర్తా స్నేహపూర్వకంగానే విడిపోయాం. ప్రసవం తర్వాత డిప్రెషన్‌కు గురయ్యాను. మన సమాజంలో ఒంటరి తల్లి అంటే సవాలే మరి. పాప బాధ్యత నేనే తీసుకున్నాను. సహచరుడు లేకపోవడం అసంపూర్ణం అని నేననుకోలేదు. చిన్నతనం నుంచి మావయ్య వల్ల వేధింపులు ఎదుర్కోవడం వల్ల తన బిడ్డ విషయంలో అప్రమత్తంగా ఉండాలనుకున్నాను. డెలివరీ తర్వాత చాన్నాళ్లు ఇంటిపట్టునే ఉండిపోయా. కానీ ఏ వ్యాపకం లేకుండా అలా వ్యర్థంగా గడపటం మంచిది కాదనిపించింది. తొలి కాన్పు తర్వాత హార్మోన్లలో మార్పులతో చాలామందిలాగే డిప్రెషన్‌ ఆవరించింది. ఐదేళ్లకు పైగానే అలా బాధపడ్డాను. అతి చిన్న విషయాలకు కూడా బాబును కొట్టి తిట్టేదాన్ని. అలా చేసినందుకు నన్ను నేను హింసించుకునేదాన్ని. బతకడమే దండగ అనిపించేది. నేనేం చేస్తున్నానో నాకు  తెలిసేది కాదు. ఈ ట్రామా అంతా చూశాక సింగిల్‌ పేరెంటింగ్‌లో ఉండే కష్టనష్టాలను పరిష్కరించుకునే దిశగా సలహాలిస్తున్నాను.

మా కుటుంబసభ్యుల్ని, స్నేహితుల్నీ సాయం కోరితే అవమానించారు. నాది ఇతరులను ఆకర్షించే ప్రవర్తన అన్నారు. భావోద్వేగాలను అణచుకోవడానికి నన్ను నేను శిక్షించుకునేదాన్ని. ప్రతీ క్షణం పారిపోవాలనిపించేది. అలా పరుగు తీసేదాన్ని. అది ప్రశాంతతను ఇచ్చేది. సంతోషాన్ని వెతుక్కుంటూ మైళ్లకొద్దీ పరిగెత్తేదాన్ని. అలా నాలో పరుగులరాణి ఉందని గుర్తించాను. అలాగే రోజూ ధ్యానం, ప్రాణిక్‌ హీలింగ్‌ చేసేదాన్ని. క్రమంగా నాలో మాతృత్వ లక్షణాలు మరోసారి అంకురించాయి. బెంగళూరు ఫుల్‌ మారథాన్‌లు, అనేక హాఫ్‌ మారథాన్లలో పాల్గొన్నాను.

‘మామ్‌.. ఆన్‌ ది రన్‌’- పేరుతో నా అనుభవాలను బ్లాగ్‌లో పంచుకున్నాను. ప్రసవానంతర డిప్రెషన్‌కు పరుగు ఎంత ఉపకరిస్తుంది, ఫిట్‌నెస్‌, ఆరోగ్యకరమైన జీవనశైలి, సింగిల్‌ పేరెంటింగ్‌లో ఉండే కష్టాలను ఎలా చక్కబెట్టుకోవాలి- లాంటి అంశాలన్నీ చర్చించేదాన్ని. అందుకు అవసరమైన వీడియోలు, ట్రావెల్‌ పోస్టులూ అప్‌లోడ్‌ చేసేదాన్ని’ అనే అనుప్రియ ‘ఇంబ్యూ నేచురల్‌’ స్టార్టప్‌కు కోఫౌండర్‌. ఈ సంస్థ లైంగిక ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతల గురించి అవగాహన కల్పిస్తుంది. ఆయా సమస్యలకు పరిష్కారాలు సూచిస్తుంది. నచ్చిన వ్యాపకం, ఆర్థికస్వేచ్ఛ, వ్యాయామం.. అనే మూడు నైపుణ్యాలు ఉంటే స్త్రీల జీవితాలు మెరుగ్గా ఉంటాయనే ఆమె ఎన్నో అవరోధాలను అధిగమించింది. తన అనుభవాలతో బ్లాగ్‌ నడుపుతోంది. మామ్‌ ఆన్‌ ది రన్‌ ప్రోత్సాహంతో ఎందరో తమ జీవితాలను మెరుగుపరచుకున్నారు. తమ ఆశయాన్ని కొనసాగించేందుకు ఉపయోగపడే సాధనాలతో ఇంబ్యూ విజయం సాధిస్తోంది. పరుగు, ధ్యానాలే తనలో మార్పు తెచ్చి సంకల్పసిద్ధికి తోడ్పడుతున్నాయని, తన తండ్రి, పద్నాలుగేళ్ల కొడుకు తనకెంతో సహకరిస్తున్నారని చెబుతోంది. ఇప్పుడామె నియంత్రణల నుంచి విముక్తి పొందింది. తన విషయాలతో అందరినీ ప్రోత్సహిస్తూ సంతోషాలను ప్రసరింపచేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్