Laxmi Sirisha: చేతిరాతతో తలరాత మార్చుకున్నా!

ఎన్నో విఫలయత్నాలు, ఏవీ ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేదు. గెలవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎందుకూ పనికిరావన్న వాళ్లతోనే శభాష్‌ అనిపించుకోవాలని తపించింది. చేతిరాతను నేర్పించి లక్షలు సంపాదిస్తోంది నిజాంపట్నం లక్ష్మీ శిరీష. చేతిరాతతో లక్షలేంటి? ఈ ఆలోచన ఎలా వచ్చిందో శిరీష వసుంధరతో పంచుకున్నారిలా..

Updated : 16 May 2023 10:52 IST

ఎన్నో విఫలయత్నాలు, ఏవీ ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేదు. గెలవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎందుకూ పనికిరావన్న వాళ్లతోనే శభాష్‌ అనిపించుకోవాలని తపించింది. చేతిరాతను నేర్పించి లక్షలు సంపాదిస్తోంది నిజాంపట్నం లక్ష్మీ శిరీష. చేతిరాతతో లక్షలేంటి? ఈ ఆలోచన ఎలా వచ్చిందో శిరీష వసుంధరతో పంచుకున్నారిలా..

దువైన వెంటనే పెళ్లి చేశారు. చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారిని చూసినా ఏదో న్యూనతా భావం. చదువుకున్నా ఇంటికే పరిమితమైపోయానన్న బాధ. పోనీ అత్తారింటి ప్రోత్సాహం లేదా? అంటే నేను ఉద్యోగం చేయాలని నాకన్నా వాళ్లే ఎక్కువ కలలు కన్నారు. మాది గుంటూరు. నాన్న కంకిపాటి శ్రీనివాసరావు. విశ్రాంత సైనికోద్యోగి. అమ్మ పద్మావతి. అమ్మకు ఆర్ట్స్‌, క్రాఫ్ట్స్‌ అంటే ఇష్టం. తను నేర్చుకుని, ఇతరులకు శిక్షణ ఇచ్చేది. 2014లో నాకు పెళ్లైంది. మా ఆయన భరత్‌ భూషణ్‌, బ్యాంక్‌ ఉద్యోగి. నన్నూ బ్యాంక్‌ పరీక్షలు రాయమన్నారు. ఏడాది శిక్షణ తీసుకున్నా. మూడేళ్లు చాలా పరీక్షలు రాశాను. ఇంతలో గర్భం దాల్చాను. పుట్టింటికి వచ్చేశాను. పరీక్షల మీద ఆసక్తి పోయింది. ఇంతలో రెండో పాప. ఇద్దర్నీ చూసుకుంటూ ఇంటి నుంచే పని చేయాలనుకున్నా. అప్పుడే క్రాఫ్ట్స్‌పైకి మనసు మళ్లింది. యూట్యూబ్‌లో తరగతులు వినేదాన్ని. దాన్నే ప్రేరణగా తీసుకుని ‘నాతిచరామి’ సంస్థను ప్రారంభించా. పెళ్లిళ్లకు సంబంధించిన వస్తువులను చేసే దాన్ని. దుకాణాలకు తీసుకువెళ్లి నేనే మార్కెటింగ్‌ చేసే దాన్ని. కొందరు బాగున్నాయంటే, మరికొందరు ఎందుకమ్మా నీకివన్నీ అనేవారు. నా మొదటి సంపాదన రూ.500. డబ్బుల గురించి ఏరోజూ ఆలోచించలేదు. ఫలానా వ్యక్తి భార్య అనో, ఫలానా వారి అమ్మాయి అనో కాక, నాకో గుర్తింపు ఉండాలని తపించా. రోజులో 8 గంటలు తయారీ, విక్రయాలకే సరిపోయేది. పిల్లల్ని, దీన్ని చూసుకోలేక ఆపేశాను.

ఉద్యోగం చేతకాకే అన్నారు...

బయటికి వెళ్లి సంపాదించాలని ఎప్పుడూ ఆలోచించలేదు. సన్నిహితులు, స్నేహితులు చాలా మంది ఉద్యోగం చేత కాకనే ఇదంతా అన్నారు. ఒక్కోసారి వాళ్లతో మాట్లాడాలంటేనే భయపడేదాన్ని.. మాట పడాల్సి వస్తుందని. దాని నుంచి బయటపడటానికి యూట్యూబ్‌, పత్రికల్లో మహిళల స్ఫూర్తి కథనాలు చదివేదాన్ని. అవే పోరాడే ధైర్యాన్నిచ్చాయి. తరువాత యూట్యూబ్‌ ఛానెల్‌ ‘ఫసీ, మెసీ’ ప్రారంభించాను. అదీ బెడిసి కొట్టింది.

అలా మొదలైంది...

పిల్లలు ఎదిగారు. వారి చేతిరాతపై స్కూల్‌ నుంచి ఫిర్యాదులు వచ్చేవి. పాపకు మంచి చేతిరాతను నేర్పాలనుకున్నా. మూడు నెలలు నెట్‌లో వెతికాను. కర్సివ్‌, ప్రీ-కర్సివ్‌, ప్రింట్‌, క్యాలిగ్రఫీ నేర్చుకున్నా. పాపకు కర్సివ్‌ రైటింగ్‌ నేర్పించాను. అది చూసి చుట్టుపక్కల పిల్లలు వచ్చారు. వారికీ నేర్పించాను. దీన్నెందుకు వ్యాపారంగా మలచకూడదనిపించింది. అలా ‘‘మ్యాంగో హ్యాబీ క్లాసెస్‌’’కు బీజం పడింది. ఇదైనా కొనసాగిస్తావా మధ్యలోనే వదిలేస్తావా అని వెక్కిరించారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానాల్లో పిల్లలకు చేతిరాత నేర్పిస్తున్నాను. ఆర్ట్స్‌, క్రాఫ్ట్స్‌లో శిక్షణ ఇస్తున్నా. మా విద్యార్థుల్లో ఆరేళ్ల పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఉన్నారు. ఇప్పుడు బహుళజాతి కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు దీటుగా సంపాదిస్తున్నా. అంతేకాదు మరో 13 మందికీ ఉపాధి కల్పిస్తున్నా. అమెరికా, ఆస్ట్రేలియా, బ్యాంకాక్‌... ఇలా 9 దేశాల్లో మా విద్యార్థులున్నారు. దాదాపు 5వేల మందికి శిక్షణ ఇచ్చాం. మొదట్లో చిన్న పిల్లలకు నేర్పడం కష్టమయ్యేది. ఇప్పుడు 16 రోజుల్లోనే మంచి చేతిరాతను నేర్పించగలుగుతున్నాం. దీన్ని విస్తరించి, నాలాంటి గృహిణులు మరింత మందికి ఉపాధి కల్పించాలనే ఆశయంతో ముందుకు సాగుతున్నా...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్