punita Mittal: చెప్పండి.. మేం వింటాం!

పాస్‌ అవుతామా.. ఒకవేళ అయితే మంచి ఉద్యోగం వస్తుందా? ప్రేమిస్తే ఇంట్లో వాళ్లని ఒప్పించగలమా... పెద్ద వాళ్లు చూసిన సంబంధం అయితే ఎలాంటి వాడు వస్తాడో... ఇలా ఒక్కో దశలో మెదడు మోసే భారమెంతో! ‘ఇక నా వల్ల కావట్లేదు’ అని మనసులోని దిగులంతా ఎవరో ఒకరి ముందు  పరిచేయాలనిపిస్తుంది.

Published : 30 Apr 2023 00:22 IST

పాస్‌ అవుతామా.. ఒకవేళ అయితే మంచి ఉద్యోగం వస్తుందా? ప్రేమిస్తే ఇంట్లో వాళ్లని ఒప్పించగలమా... పెద్ద వాళ్లు చూసిన సంబంధం అయితే ఎలాంటి వాడు వస్తాడో... ఇలా ఒక్కో దశలో మెదడు మోసే భారమెంతో! ‘ఇక నా వల్ల కావట్లేదు’ అని మనసులోని దిగులంతా ఎవరో ఒకరి ముందు పరిచేయాలనిపిస్తుంది.  అలాంటి వాళ్ల బాధను అర్థం చేసుకోవడమే కాదు.. మీకు మేమున్నామని లక్షలమందికి తోడు నిలుస్తున్నారు కొందరు యువతులు..

గుండె భారం తగ్గిస్తూ..

మనసులోని బాధను పంచుకుంటే తగ్గుతుంది. ఆ సమస్యను అధిగమించిన వారితో మాట్లాడితే సరైన పరిష్కారమూ దొరుకుతుంది అని నమ్ముతారు పునీతా మిట్టల్‌, మహక్‌ మహేశ్వరి. ఇద్దరూ ఐఐటీయన్లే! ఉద్యోగులుగా స్థిరపడినా వారికి మొదట్నుంచీ స్టార్టప్‌ ప్రారంభించాలని కోరిక. ఓసారి తమిళనాడులోని ఆరోవిల్లే వెళ్లిన పునీతకు అక్కడి ప్రజల ఐకమత్యం, శాంతియుత బృంద చర్చలు చూసి మానసిక సమస్యలపై దృష్టి పెట్టాలన్న ఆలోచన వచ్చింది. మహక్‌కీ అది నచ్చడంతో 2021లో ‘సోల్‌ అప్‌’ ప్రారంభమైంది. ‘బాధితులు వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకున్నాక సమస్య తీవ్రతను బట్టి రెండు రకాల పరిష్కారాలు సూచిస్తాం. ఒకటి... దాన్ని అధిగమించిన వారితో మాట్లాడించడం.. రెండు అలాంటివారిని బృందంగా చేసి, నిపుణుల ఆధ్వర్యంలో సలహాలు, యాక్టివిటీస్‌ చేయించడం. అనుబంధాలు, కెరియర్‌, పిల్లల పెంపకం, చెడు అలవాట్లు వంటి అన్ని సమస్యలకూ పరిష్కారం చూపుతున్నాం’ అనే ఈ మిత్రులు తాజాగా షార్క్‌ట్యాంక్‌ ఇండియాలో తమ వ్యాపార ఆలోచన పంచుకొని రూ.50 లక్షల పెట్టుబడినీ అందుకున్నారు.


వాళ్లందరికీ సాయమవ్వాలనీ..

మనసుకు తగిలిన గాయాలు సాధారణంగా కొన్నాళ్లకి నయమవుతాయి. కానీ కొందరిని ఆ బాధ త్వరగా వదలదు. దాన్నుంచి బయటపడే సాయం అందక పోవడమే కారణం. అలాంటి వాళ్లకి సాయపడాలని శ్వేతా శ్రీనివాసన్‌ 14 ఏళ్ల వయసులోనే నిర్ణయించుకుంది. ఈమెది ముంబయి. బీఏ సైకాలజీ, ఎంఏ క్లినికల్‌ సైకాలజీ చదివి, సైకాలజీ థెరపిస్ట్‌ అయ్యింది. కొన్ని సంఘటనలు ఆమెతో ‘ద మైండ్‌ క్లాన్‌’ ప్రారంభింపచేశాయి. ‘అప్పటికి నా చదువు పూర్తవలేదు. స్నేహితురాలికి గర్భస్రావమైంది. ఆ బాధ నుంచి బయట పడటానికి వైద్యుడి దగ్గరకు వెళ్తే.. తనదే తప్పన్నట్లుగా మాట్లాడారట. మరో స్నేహితుడి విషయంలోనూ అంతే! ఇలా ఎన్నో ఘటనలు చూశాక మానసిక సమస్యలకు సరైన తీరులో చికిత్స చేసే వారి కొరతే ఎక్కువ అని అర్థమైంది. అందుకే 2018లో మావారు మణి కుమార్‌తో కలిసి ‘ద మైండ్‌ క్లాన్‌’ ప్రారంభించా. దీని ద్వారా థెరపిస్ట్‌లను ఒక తాటి మీదకి తెచ్చాం. అవతలి వారిని ప్రశ్నించడం, నిందించడం, తీర్పులు చెప్పడం ఉండదు. వాళ్ల బాధ వినడం.. దాన్ని పోగొట్టే దిశగా నడిపించడమే మా పని’ అనే శ్వేత యూట్యూబ్‌, వెరిజాన్‌, డీహెచ్‌ఎల్‌ వంటి ఎన్నో సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఇలా వేల మందికి ఉచితంగానే సాయం చేస్తోంది. తన ఆదాయాన్నీ దీనికే వినియోగిస్తోంది. దేశవ్యాప్తంగా పేద, ధనిక తేడా లేకుండా అందరికీ మానసిక చికిత్స అందుబాటులోకి తేవాలన్నదే తన లక్ష్యమట.


ఆ ఘటనే మూలం

‘ఐఐటీలో ఇంజినీరింగ్‌ నా కల. కోచింగ్‌ కోసమని ‘కోటా’ వెళ్లా. మొదట్లో బానే ఉంది. కానీ కొందరు రోజుకు 17, 18 గంటలు కష్టపడే వారు. కనీసం మూడోసారి ప్రవేశపరీక్ష రాస్తున్న వారెందరో! ఆ ఒత్తిడిలో కొనసాగలేనని వెనక్కి వచ్చా. నాతోపాటు వచ్చిన స్నేహితుడు అక్కడే ఉండిపోయాడు. ర్యాంకు రేసులో తనెంత ఇబ్బంది పడుతోందీ చెప్పేవాడు.  అమ్మా నాన్న నన్ను అర్థం చేసుకున్నారు కాబట్టి, నేను బయట పడగలిగా. తనకా అవకాశం లేదు. అందుకని తన బాధనంతా వెలిబుచ్చుకునే అవకాశ మిచ్చేదాన్ని. తర్వాత నాకు ఐఐటీ గువాహటిలో సీటొచ్చింది. బీటెక్‌ చివర్లో నా సహాధ్యాయి ఉద్యోగం రాదేమోనన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడింది. అప్పుడే.. ఒత్తిడి చాలా మంది సమస్య అని అర్థమైంది’ అంటుంది రిచా. దీనికో పరిష్కారం చూపాలని స్నేహితుడు పునీత్‌ మనుజాతో కలిసి 2014లో ‘యువర్‌దోస్త్‌’ ప్రారంభించింది. దానికి తనే సీఈఓ. ఈమెది బెంగళూరు. తన సంస్థ ద్వారా ఆన్‌లైన్‌ చాట్‌, వీడియో కాలింగ్‌, కౌన్సెలర్లతో నేరుగా మాట్లాడి కౌన్సెలింగ్‌ తీసుకునే వీలు కల్పిస్తోంది. కొవిడ్‌ సమయం నుంచి ఉద్యోగుల కోసం సంస్థలూ వీరిని ఆశ్రయించడం మొదలుపెట్టాయి. ఇప్పటి వరకూ 20 లక్షలకు పైగా కౌన్సెలింగులు ఇచ్చిన ఈ సంస్థలో దాదాపు వెయ్యి మంది నిపుణులున్నారు. ఎన్నో పురస్కారాలు అందుకున్న రిచా 2017లో ఫోర్బ్స్‌ జాబితాకీ ఎక్కింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్