Vaishali Sagar: ఆ పిల్లల్ని దత్తత ఇవ్వలేకపోయా!
కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలో... ఫోన్‌లో అవతలి వైపు నుంచి ఓ పెద్దావిడ గొంతు.. ‘నువ్వే లేకపోతే నా కూతురు ప్రాణాలతో ఉండేది కాదమ్మా. నీ పేరేంటో నాకు తెలియదు. చెబితే ఇప్పుడే పుట్టిన నా మనవరాలికి ఆపేరే పెట్టాలనుకుంటున్నా’ అందావిడ. హైదరాబాద్ అమ్మాయి వైశాలీ సాగర్‌కి ఇలాంటి కృతజ్ఞతలు కొత్తేం కాదు. అవన్నీ తన సేవని మరింత ముందుకు తీసుకెళ్లేవే అనే ఆమె తాజాగా జీపీబిర్లా ఫెలోషిప్‌ని అందుకున్నారు.
కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలో... ఫోన్‌లో అవతలి వైపు నుంచి ఓ పెద్దావిడ గొంతు.. ‘నువ్వే లేకపోతే నా కూతురు ప్రాణాలతో ఉండేది కాదమ్మా. నీ పేరేంటో నాకు తెలియదు. చెబితే ఇప్పుడే పుట్టిన నా మనవరాలికి ఆపేరే పెట్టాలనుకుంటున్నా’ అందావిడ. హైదరాబాద్ అమ్మాయి వైశాలీ సాగర్‌కి ఇలాంటి కృతజ్ఞతలు కొత్తేం కాదు. అవన్నీ తన సేవని మరింత ముందుకు తీసుకెళ్లేవే అనే ఆమె తాజాగా జీపీబిర్లా ఫెలోషిప్‌ని అందుకున్నారు. ఈ సందర్భంగా వసుంధరతో మాట్లాడారు...
నాకు ఊహ తెలియకముందే నాన్న చనిపోయారు. బంధువులు ఎవరింటికి వెళ్లినా ‘మీ నాన్న చేసిన మేలు మర్చిపోలేమ’నే అంటారు. అలా ఆయన ప్రభావంతో సేవామార్గం పట్టా. మాది హైదరాబాద్. నాన్న విద్యాసాగర్. సైనిక ఉద్యోగి. అమ్మ నాగలక్ష్మి లెక్చరర్. ఒక్కతే ఎన్నో కష్టాలుపడి నన్నూ, అక్కను పెంచి పెద్ద చేసింది. కుటుంబ పెద్ద నీడ లేకుండా పెరిగాను కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే అనాథలకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు నేనున్నాననే భరోసా ఇవ్వాలనుకున్నా. ఈ ఆలోచన వచ్చేనాటికి నా వయసు 17. మేముండే ఎస్‌ఆర్‌నగర్‌కు దగ్గర్లో మాతాశిశు సంరక్షణ కేంద్రం ఉండేది. అక్కడకు వెళ్లి అనాథ పిల్లలకు పాఠాలు చెప్పేదాన్ని. వాళ్లతో సమయం గడుపుతున్నప్పుడు సంతోషంగా అనిపించేది. బీబీఏలో చేరి చదువుతూనే, స్వచ్ఛంద సంస్థల్లో వాలంటీర్‌గా పనిచేసేదాన్ని. ఇప్పటిదాకా 7 సంస్థలతో కలిసి పనిచేశా. నా సంపాదన, సమయంలో 20 శాతం సామాజిక సేవకోసం కేటాయిస్తున్నా. వారాంతాలు రాగానే వృద్ధాశ్రమాలు, నగర శివార్లలోని చిల్డ్రన్ హోమ్‌లకు వెళ్తుంటా. వాళ్ల అవసరాలేంటో తెలుసుకుంటా. ముఖ్యంగా వాళ్లకు బయట ప్రపంచం తెలియాలని వర్క్‌షాపులు నిర్వహిస్తుంటా.
అందుకే ఉద్యోగం వదిలేశా..
బీబీఏ పూర్తవుతూనే గూగుల్‌లో ఉద్యోగం వచ్చింది. లక్షల్లో జీతం.పని ఒత్తిడితో పిల్లల్ని కలవలేకపోయేదాన్ని. దీనికి తోడు సమాజానికి ఇంకా ఏదో చేయాలన్న తపనతో ఉద్యోగం వదిలేశా. ప్రస్తుతం అమెజాన్‌లో వివిధ ప్రభుత్వాలకు సాంకేతికత అందించే విభాగంలో పని చేస్తున్నా. దాంతోపాటు టీహబ్‌లో స్టార్టప్‌లకు మెంటర్‌గా ఉన్నా. మార్కెటింగ్, టెక్నాలజీ వినియోగం అంశాలపై పాఠాలు చెబుతుంటా. నాకు పర్యావరణ పరిరక్షణ అన్నా ఆసక్తే. అందుకే హైదరాబాద్ తరపున మంచుఖండం అంటార్కిటికాకి వెళ్లొచ్చా. అప్పటిదాకా స్వచ్ఛంద సంస్థలకే పరిమితమైన నాకు ఇదోరకం కొత్త అనుభూతినిచ్చింది. జాతీయస్థాయి జాగృతి యాత్రలోనూ పాల్గొని గ్రామాల అభివృద్ధి కోసం ప్రచారం చేశా. నాలాంటి ఆలోచనలే ఉన్న మరో 500 మంది యువతను ఒకే వేదికపై చూడటం మరచిపోలేని అనుభూతి. వాళ్లతో చేసిన 15 రోజుల రైలు ప్రయాణం గ్రామాలు, పట్టణాలకు మధ్య ఉన్న అంతరాలు తెలిసేలా చేసింది. వీటి నుంచి నేర్చుకున్న పాఠాలే ఎకనామిక్ ఫోరమ్‌లో సభ్యురాలిగా రాణించేందుకు సాయపడ్డాయి. తెలంగాణ ఎన్నికల సమయంలో ఓటు అవగాహన కోసం బైక్‌ర్యాలీని చేపట్టా. గ్రామాల్లో మహిళలకు, యుక్తవయసు ఆడపిల్లలకు పరిశుభ్రత, పోషకాహారం, బహిష్టు సమయాల్లో ఎలా ఉండాల్లో అవగాహన తీసుకొస్తున్నా. మాతాశిశు అభివృద్ధి కేంద్రంలో 5గురు పిల్లలకు లీగల్ గార్డియన్‌గా వ్యవహరించా. చెత్తకుండీలు, రైలు పట్టాలపై వదిలేసిన పిల్లలు వీళ్లంతా. వారి చదువు, పోషణ, ఆరోగ్య భాధ్యతలన్నీ అన్నీ నేనే తీసుకున్నా. వీళ్లని వేరేవాళ్లకి దత్తత ఇస్తున్నప్పుడు చాలా బాధనిపించింది. దత్తత తీసుకున్నవాళ్ల ఇంట్లో అమ్మమ్మలు, నాయనమ్మలకి నచ్చేది కాదు. దాంతో వెనక్కి తీసుకొచ్చేవారు. వాళ్లకి అవగాహన తెచ్చి ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి చాలా శ్రమపడాల్సి వచ్చింది.
జీపీబిర్లా ఫెలోషిప్...
నా సేవలను మెచ్చిన జీపీబిర్లా యాజమాన్యం ఫెలోషిప్‌కు ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా 18 మంది ఎంపికైతే అందులో నేనూ ఒకరిని. ఎంపికైన వారికి నాయకత్వ లక్షణాలు, సమయ పాలన, నైపుణ్యాలు, సామాజిక సేవ మొదలైన అంశాల్లో మరింత అవగాహన కల్పించడమే ఈ ఫెలోషిప్ ముఖ్యోద్దేశం. సామాజిక సేవ చేయాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులను, యువతను ప్రోత్సహిస్తూ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కమ్యూనిటీ ఆధ్వర్యంలోని గ్లోబల్ షేపర్స్ సంస్థ ద్వారా వీరందరినీ ఒకతాటిపైకి తీసుకొస్తున్నా.
ఆహ్వానం
వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.