గెలిచి.. చూపించారు!

కాళ్లూ, చేతులూ లేవని కలత పడలేదు.. కలలు తోడుగా రెక్కలు కట్టుకుని విజయాలని అందుకున్నారు. సాధించడానికి వైకల్యం అడ్డుకాదని నిరూపించారు. తాజా ఆసియన్‌ పారాగేమ్స్‌లో దేశానికి స్ఫూర్తిగా నిలిచిన కొందరు అమ్మాయిల విజయగాథలివి.

Updated : 01 Nov 2023 13:22 IST

కాళ్లూ, చేతులూ లేవని కలత పడలేదు.. కలలు తోడుగా రెక్కలు కట్టుకుని విజయాలని అందుకున్నారు. సాధించడానికి వైకల్యం అడ్డుకాదని నిరూపించారు. తాజా ఆసియన్‌ పారాగేమ్స్‌లో దేశానికి స్ఫూర్తిగా నిలిచిన కొందరు అమ్మాయిల విజయగాథలివి..


ఏడాదిన్నర శిక్షణతోనే

- శీతల్‌ దేవి

విల్లు ఎక్కుపెట్టి బాణం వదలడానికి రెండు చేతులే కీలకం! కానీ అవి లేకుండానే ఆర్చరీలో రాణిస్తోంది శీతల్‌ దేవి. ఈమెది జమ్మూకశ్మీర్‌లోని మారుమూల పల్లె. నాన్న రైతు, అమ్మ మేకల కాపరి. పుట్టుకతోనే చేతుల్లేని కూతురిని చూసి బాధపడ్డా తను ఏం చేస్తానన్నా ప్రోత్సహించాలని ముందే అనుకున్నారట. అలాంటి శీతల్‌ని ఆర్చరీ ఆకర్షించింది. చేతుల్లేని అమెరికన్‌ ఆర్చర్‌ మట్‌ స్టుజ్‌మ్యాన్‌ని చూసి స్ఫూర్తి పొందింది. కాళ్లతో విల్లును పట్టుకొని మెడ, భుజం సాయంతో బాణం వదలడం సాధన చేసింది. ఆరునెలల్లోనే ఆరి తేరింది. ఇప్పటికి తను సాధన చేయడం మొదలుపెట్టి ఏడాదిన్నరే అవుతోంది. కానీ దేశీయంగానే కాదు.. యూరోపియన్‌ పారా ఆర్చరీ కప్‌, ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌ వంటి అంతర్జాతీయ పోటీల్లోనూ పతకాలు సాధించింది. వరల్డ్‌ పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్స్‌కు చేరిన తొలి చేతుల్లేని మహిళా ఆర్చర్‌గా నిలిచింది. తాజా ఆసియన్‌ పారా గేమ్స్‌లో మూడు పతకాలతో రికార్డునీ సాధించింది. ‘ఆర్చరీ ఎంచుకున్నప్పుడు కృత్రిమ చేతులు పెట్టించుకుందామంటే వైద్యులు కుదరదన్నారు. దాంతో నాకు తగ్గట్టుగా విల్లును తయారు చేయించారు. చేతుల్లేకపోతేనేం చెట్లు, పర్వతాలను సునాయాసంగా ఎక్కగలను. ఆ బలమే నన్ను విజేతగా నిలిపింది’ అంటోన్న శీతల్‌ లక్ష్యం ప్యారిస్‌ పారాలింపిక్స్‌. ఇప్పటికే ఆ అర్హతనూ సాధించింది. 16ఏళ్ల శీతల్‌ పట్టుదల, కృషి చూసి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర మెచ్చుకోవడమే కాదు.. ఆమెకు నచ్చిన కారును బహుమతిగా ఇస్తామన్నారు.


మన బంగారం!

- జీవంజి దీప్తి

తెలంగాణ అథ్లెట్‌ జీవంజి దీప్తి పారా ఆసియా క్రీడల్లో అదరగొట్టింది. నాలుగేళ్ల వయసులోనే ఆటలపై ఇష్టం పెంచుకున్న ఈ అమ్మాయి...తనకున్న వైకల్యాన్ని వెనక్కి నెట్టి విజయ పతాకం ఎగరేస్తోంది. ఈమె స్వస్థలం వరంగల్‌ జిల్లాలోని కల్లెడ గ్రామం. తండ్రి యాదగిరి, తల్లి ధనలక్ష్మిలు వ్యవసాయ కూలీలు. ఇద్దరాడపిల్లల్లో దీప్తి పెద్దది. మానసిక వైకల్యంతో పుట్టిన తను శారీరకంగా మాత్రం దృఢంగా ఉండేది. చిన్నమ్మాయి మాట్లాడలేదు. దీంతో వీరి కుటుంబ ఆర్థిక, మానసిక పరిస్థితుల దృష్ట్యా ఆర్‌డీఎఫ్‌(రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌) దీప్తికి ఉచితంగా సీటిచ్చారు. ఆ క్రమంలోనే అక్కడ పీఈటీగా పనిచేస్తోన్న వెంకటేశ్వరరావు అసాధారణ వేగంతో పరుగెడుతున్న దీప్తిని గుర్తించి అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. అది మొదలు పాఠశాల స్థాయిలో ఏ టోర్నీల్లో అడుగుపెట్టినా పతకం పట్టుకొచ్చేది. అలా ఓ సారి ఖమ్మంలో జరిగిన క్రీడా పోటీల్లో  భారత అథ్లెటిక్స్‌ కోచ్‌ నాగపురి రమేశ్‌ కళ్లల్లో పడింది. ఆయన ప్రోత్సాహంతో హైదరాబాద్‌లోని సాయ్‌ కేంద్రానికి చేరింది దీప్తి. అక్కడి శిక్షణలో మరింత రాటుదేలి 400, 200 మీటర్ల పరుగులో అత్యుత్తమ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది. తాజాగా టీ20 మహిళల 400 మీటర్ల పరుగుపందెంలో ఆసియా క్రీడలూ, పారా ఆసియా క్రీడల రికార్డుల్ని బద్దలుకొట్టింది. 56.69 సెకన్లలో తన పరుగుని పూర్తి చేసి స్వర్ణపతకాన్ని అందుకుంది. 2024 పారా ఒలింపిక్స్‌కూ అర్హత సాధించింది.


ఈతను వదిలి

- ప్రాచీ యాదవ్‌

కనోయింగ్‌.. ఓవైపు చేత్తో మరోవైపు పాదాలతో రెండిటితో సత్తా చాటాలి. నడుము నుంచి కింది భాగం పనిచేయదు. అలాంటమ్మాయి ఈ క్రీడకి ఎలా సరిపోతుంది? ఈ అనుమానం బయటివాళ్లకే కాదు.. ప్రాచీకీ కలిగింది. ఈమెది మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌. పుట్టుకతోనే కాళ్లు పనిచేయవు. చిన్నారి ప్రాచీకి అదో దెబ్బ. కాస్త పెద్దయ్యాక అమ్మ క్యాన్సర్‌తో చనిపోవడంతో ఒకానొక దశలో కుంగిపోయింది. ఆ సమయంలో తనను ఆదుకున్నది ఆటలే. ప్రాచీ ఆసక్తిని చూసి వాళ్ల నాన్న ఈతలో చేర్చారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో పతకాలనూ సాధించింది. అయితే తన పొడవైన చేతులను చూసి, కోచ్‌ కనోయింగ్‌ వైపు ప్రోత్సహించారు. మొదట సందేహించినా ఒప్పుకొంది. దీంతో కోచ్‌ ఆమె కోసం అనువైన పడవనీ ప్రత్యేకంగా తయారు చేయించారు. ఆయన ఊహించినట్టుగానే ప్రాచీ మెరిసింది. పారా కనోయింగ్‌లో ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన తొలి భారతీయురాలు. వరల్డ్‌కప్‌, ఛాంపియన్‌షిప్‌ల్లో మెరిసి.. ‘ప్రాచీ వెళితే పతకం ఖాయ’మన్న పేరు తెచ్చుకుంది. తాజా ఆసియన్‌ పారా క్రీడల్లో కనోయింగ్‌ వివిధ విభాగాల్లో సిల్వర్‌తోపాటు బంగారు పతకాలూ సాధించి, రికార్డు సృష్టించింది. ‘కాళ్లున్న వాళ్లే ఏం చేయట్లేదు. సగం శరీరం పనిచేయదు నువ్వేం చేస్తావనేవారు. ఆ మాటే ఏదైనా సాధించాలన్న కసి పెంచింది. నాన్న ప్రోత్సాహం నాకు పెద్ద బల’మనే 28ఏళ్ల ప్రాచీ పారిస్‌ ఒలింపిక్స్‌కీ క్వాలిఫై అయ్యింది. అక్కడ పతకం సాధించడం ఆమె కల.


వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్