Archana Mukul Agarwal: సుగంధాల పంటతో కోట్ల ఆదాయం!

చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం చేయాలనుకునే తరం మారింది. ఇప్పుడు ఇంజినీరైనా, డాక్టరైనా.. మనసుకి నచ్చిన పని చేయడంలోనే తమ విజయం దాగుందని నమ్మే రోజులివి. దాన్నే ఫాలో అయిపోయారు నాగ్‌పుర్‌కి చెందిన అర్చన ముకుల్‌ అగర్వాల్‌.

Updated : 29 May 2023 06:18 IST

చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం చేయాలనుకునే తరం మారింది. ఇప్పుడు ఇంజినీరైనా, డాక్టరైనా.. మనసుకి నచ్చిన పని చేయడంలోనే తమ విజయం దాగుందని నమ్మే రోజులివి. దాన్నే ఫాలో అయిపోయారు నాగ్‌పుర్‌కి చెందిన అర్చన ముకుల్‌ అగర్వాల్‌. వందల ఎకరాల్లో సుగంధ పంటల సాగు... వాటితో తయారు చేస్తోన్న ఎసెన్షియల్‌ ఆయిల్స్‌తో వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఆమె స్ఫూర్తి ప్రయాణం తెలుసుకుందామా!

సొంతంగా వ్యాపారం చేయాలన్న కల, వరుస కష్టాలతో సతమతమవుతోన్న అన్నదాతలకు చేయూతగా ఉండొచ్చన్న ఆలోచనే తనని సాగు, వ్యాపార మార్గంలోకి నడిపించాయంటారు అర్చన. ఆమెది నాగ్‌పుర్‌. ఇంజినీరింగ్‌ చదవగానే పెళ్లయ్యింది. ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే తన కాళ్లపై తాను నిలబడాలని అనుకునేవారామె. ఆ విషయాన్ని భర్త, అత్తింటివారికి చెబితే... నీ ఇష్టమేనన్నారు. అయితే, ఎలాంటి ఉపాధి మార్గాన్ని ఎంచుకోవాలో తెలుసుకునేందుకు మాత్రం కాస్త సమయం పట్టింది. ఆ కాలంలోనే ఆ ప్రాంతంలోని రైతులు పంటలు సరిగా పండక, చేతికొచ్చిన పంటకు సరైన మద్దతు ధర దక్కక విలవిల్లాడటం గమనించారు. అప్పుడో ఆలోచన వచ్చి... బంజరు భూముల్లో సైతం పండగలిగేవి ఏమున్నాయో తెలుసుకోవడం మొదలుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా సుగంధ పరిమళాల మొక్కలకు, వాటి నూనెలకు ఉన్న డిమాండ్‌ గురించి అప్పుడే తెలిసింది అర్చనకు. దాంతో వాటి సాగు చేయాలనుకున్నారు.  వినియోగదారుల అవసరాలను గుర్తించి సంబంధిత ప్రొడక్ట్‌లనూ మార్కెట్‌లోకి తీసుకురావాలనుకున్నారు. అలా 2014లో మంగళం ఆగ్రో సంస్థను ఏర్పాటు చేశారు. దీని కింద తీసుకొచ్చిన మొదటి ప్రొడక్ట్‌ సిట్రనెల్లా ఎపెన్షియల్‌ ఆయిల్‌. దోమలను అరికట్టడానికి ఎక్కువమంది రసాయన ఉత్పత్తులను వాడటం, వాటివల్ల మనుషులకూ హాని జరగుతోందన్న పరిశోధనలతో... ప్రత్యామ్నాయంగా ఈ నేచురల్‌ రిపల్లెంట్‌ తయారీ చేపట్టారు.

హడావుడిగా పేరు పెట్టి...

సుగంధ పంటల సాగులో నిమ్మగడ్డిదే మొదటి ప్రాధాన్యం. తమకున్న ఎనిమిదెకరాల బీడుభూముల్లోనే ఈ పంట వేశారు. ఆపై దాన్నుంచి నూనె తీసి...మస్కిటో రిపల్లెంట్‌ ఆయిల్‌ని తయారుచేశారు. దీన్ని తెలిసివారందరికీ వాడి చూడమని ఇస్తే... ప్రభావవంతంగా పనిచేస్తుందన్న ఫీడ్‌బ్యాక్‌తో దాన్ని బ్రాండింగ్‌ చేయాలనుకున్నారు. ఇందుకోసం జేబులోనైనా, బ్యాగులోనైనా సులువుగా వెంట తీసుకెళ్లేలా ఈ తైలాన్ని పెన్‌ ఆకృతిలో గల స్ప్రే సీసాలో నింపి అమ్మకానికి తీసుకొచ్చారు. అయితే, ఈ లోగా ఓ సేంద్రియ ఉత్పత్తుల సెమినార్‌లో ప్రసంగించడానికి అర్చనకు ఆహ్వానం అందింది. దాంతో ఆవిడ సిట్రనెల్లా స్ప్రేయర్‌లకు హడావుడిగా సిట్‌ స్ప్రే అనే పేరుని పెట్టేశారు. ఆ వేదికపై ఈ ఉత్పత్తులను ప్రదర్శించడంతో....మంచి ఆదరణా లభించింది. దాంతో చుట్టుపక్కల గ్రామాల రైతులను ప్రోత్సహించి మరిన్ని ఎకరాల్లో వ్యవసాయం మొదలుపెట్టారు. క్రమంగా దేశవిదేశాల్లో దీనికి డిమాండ్‌ పెరగడం, మరిన్ని ఉత్పత్తుల అవసరం గుర్తించడంతో....కాంట్రాక్ట్‌ వ్యవసాయ ఒప్పందాలు చేసుకోవడం ప్రారంభించారామె. అలా ప్రస్తుతం 500 ఎకరాల్లో గులాబీ, యూకలిప్టస్‌, నిమ్మగడ్డి...వంటి సుగంధ పంటలెన్నో పండిస్తున్నారు. వీటి నుంచి గులాబీనీరు, నూనె, నిమ్మ, యూకలిప్టస్‌ ఆయిల్స్‌, ఫ్లోరల్‌ వాటర్స్‌, పెర్‌ఫ్యూమ్‌ సోప్‌లు, క్యాండిల్స్‌, డిటర్జెంట్‌లు, బేబీరోల్స్‌ వంటి ఉత్పత్తులెన్నింటినో తయారు చేస్తున్నారు. కొవిడ్‌ కాలంలో డిస్‌ఇన్‌ఫెక్షన్‌ స్ప్రేలు, హెర్బల్‌ శానిటైజర్లూ తీసుకొచ్చారు. ఆపై సుగంధ నూనెలు, సహజ పరిమళ ద్రవ్యాలు, ఎయిర్‌ ఫ్రెషనర్లు, అరోమా డిఫ్యూజర్‌లు, ఇండస్ట్రియల్‌ ఫ్రాగ్రెన్స్‌ ప్రొడక్ట్స్‌ వంటి వందల రకాల తయారీ చేపట్టారు. ఇలా సేంద్రియ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తేవడమే కాదు...వాటిని అందరికీ అందుబాటు ధరల్లోకి తీసుకురావాలన్నది అర్చన ఆలోచన. తక్కువ సమయంలోనే సిట్రనెల్లా ఆయిల్‌ ఉత్పత్తితో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందీ సంస్థ. కోట్ల రూపాయల టర్నోవర్‌ సాధించడమే కాదు...మరెన్నో కొత్త ఉత్పత్తులు తీసుకురావడం, మరిన్ని ప్రాంతాలకు విస్తరించడమే లక్ష్యంగా సాగుతున్నారామె. ‘పెళ్లయితే మన అభిరుచుల్నీ, ఆసక్తుల్నీ వదిలిపెట్టేయక్కర్లేదు. పట్టుదలతో ముందుకెళ్తే సాధించలేనిదంటూ ఏమీ లేదు’ అంటారు అర్చన.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్