బేకరీ వర్కర్‌ కూతురు.. ‘నీట్‌’ టాపర్‌!

‘కష్టే ఫలి’ అన్నారు పెద్దలు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, కష్టాలను తట్టుకుంటూ ముందుకు సాగినప్పుడే విజయం మన సొంతమవుతుంది. ఇదే నిరూపించింది ముంబయికి చెందిన అమీనా ఆరిఫ్‌ కడివాలా. ఇటీవలే విడుదలైన నీట్‌ ఫలితాల్లో వంద శాతం మార్కులు సాధించి.. ఆలిండియా టాపర్‌గా నిలిచింది.

Updated : 08 Jun 2024 21:49 IST

(Photo: Twitter)

‘కష్టే ఫలి’ అన్నారు పెద్దలు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, కష్టాలను తట్టుకుంటూ ముందుకు సాగినప్పుడే విజయం మన సొంతమవుతుంది. ఇదే నిరూపించింది ముంబయికి చెందిన అమీనా ఆరిఫ్‌ కడివాలా. ఇటీవలే విడుదలైన నీట్‌ ఫలితాల్లో వంద శాతం మార్కులు సాధించి.. ఆలిండియా టాపర్‌గా నిలిచింది. బేకరీ వర్కర్‌ కూతురైన ఆమె.. ఇటు ఆర్థికంగా ఎన్నో కష్టాలకోర్చింది. మరోవైపు పదో తరగతి వరకు ఉర్దూ మీడియంలో చదివి.. ఆపై ఆంగ్ల మాధ్యమంలోకి ప్రవేశించి భాష పరంగా పలు సవాళ్లను ఎదుర్కొంది. అయినా వీటన్నింటినీ అధిగమించి అమీనా టాపర్‌గా నిలిచిన తీరు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం!

ఎంత టాపర్‌ అయినా వంద శాతం మార్కులు సాధించడం అరుదు. కానీ అమీనా ఇది సాధించి చూపించింది. ముంబయిలోని జోగేశ్వరి ప్రాంతానికి చెందిన ఆమె.. ఇటీవలే వెల్లడైన నీట్‌ ఫలితాల్లో 720కి గాను 720 మార్కులు సాధించి.. ఆలిండియా టాపర్‌గా  నిలిచింది. ముంబయి సిటీలో ఈ ఘనత సాధించిన ఏడుగురిలో అమీనా ఒకరు. అయితే జీవితంలో పలు సవాళ్లను ఎదుర్కొని ఆమె ఈ ఘనత సాధించడం విశేషం!

ఇంగ్లిష్‌ రాకపోయినా..!

అమీనాది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం. ఆమె తండ్రి బేకరీలో పనిచేస్తుంటారు. దీంతో చిన్న వయసు నుంచి నాణ్యమైన విద్యకు నోచుకోకపోయినా.. చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిందామె. స్థానికంగా ఉన్న మద్ని హైస్కూల్‌లో పది వరకు చదివిన ఆమె.. పదో తరగతిలో 93.2 శాతం ఉత్తీర్ణత సాధించింది. మితీబాయి కాలేజీలో ఇంటర్‌ పూర్తిచేసిన అమీనా.. 95 శాతం మార్కులతో మరోసారి తన ప్రతిభను నిరూపించుకుంది. అందులోనూ పది వరకు ఆమె ఉర్దూ మీడియంలో చదివి.. ఇంటర్‌లో ఆంగ్ల మాధ్యమాన్ని ఎంచుకుందామె. ఈ క్రమంలో తొలుత ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం లేకపోవడంలో భాష పరంగా పలు ఇబ్బందుల్ని ఎదుర్కొంది అమీనా. ఆపై ఇంగ్లిష్‌పై పట్టు సాధించి మంచి మార్కులు సంపాదించుకుందామె. ఇంటర్‌ పూర్తయ్యాక నీట్‌ పరీక్ష రాసినా తొలిసారి మంచి స్కోర్‌ సాధించలేకపోవడంతో.. రెండోసారి ప్రయత్నించింది. ఈసారి ఏకంగా ఆలిండియా ర్యాంకు సాధించి వార్తల్లోకెక్కిందీ బ్రిలియంట్‌ గర్ల్‌.

వారి ప్రోత్సాహంతో..!

తనకు జాతీయ స్థాయిలో తొలి ర్యాంకు రావడానికి తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, టీచర్ల సలహాలే కారణమంటోంది అమీనా.

‘నిజానికి నీట్‌ రాయాలన్న ఆలోచన నాకు లేదు. కానీ ఓసారి ప్రయత్నిద్దామన్న ఉద్దేశంతో లాక్‌డౌన్‌ సమయంలో తొలిసారి ఈ పరీక్ష రాశాను. అప్పుడు మంచి స్కోర్‌ సాధించలేకపోయా. ఆ తర్వాత కాలేజీలో మా టీచర్ల సలహా మేరకు నీట్‌ కోచింగ్‌లో చేరాను. ఆరు గంటల శిక్షణకు తోడు మరో నాలుగ్గంటలు ఇంట్లో సాధన చేశా. మాక్‌ టెస్ట్‌లు ఎక్కువగా రాసేదాన్ని. ప్రతిసారీ స్కోర్‌ 620 దాటేది.. దాంతో తుది పరీక్షలో 700లకు పైగా మార్కులొస్తాయని ఊహించా. కానీ వంద శాతం మార్కులు రావడం, జాతీయ స్థాయిలో తొలి ర్యాంకు దక్కడం చాలా సంతోషంగా ఉంది. నన్ను ఇంతగా ప్రోత్సహించిన నా తల్లిదండ్రులు, టీచర్లకు రుణపడి ఉంటా.. దిల్లీ ఎయిమ్స్‌లో వైద్య విద్య చదవాలనుకుంటున్నా..’ అంటోంది అమీనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్