అక్క నాసాలో సైంటిస్ట్.. చెల్లెలు డాక్టర్..!

ఎన్నో నిగూఢ రహస్యాల్ని తనలో నిక్షిప్తం చేసుకున్న అంతరిక్షం గురించి తెలుసుకోవడమంటే ఎవరికైనా ఆసక్తే! కేవలం తెలుసుకొని సరిపెట్టుకోకుండా.. అంతరిక్ష రంగంలో తన కెరీర్‌ని కొనసాగించాలని చిన్న వయసులోనే నిర్ణయించుకుంది లక్నోకు చెందిన ప్రియాంక శ్రీవాస్తవ. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళ కల్పనా చావ్లా....

Updated : 06 Mar 2023 17:42 IST

(Photos: Twitter)

ఎన్నో నిగూఢ రహస్యాల్ని తనలో నిక్షిప్తం చేసుకున్న అంతరిక్షం గురించి తెలుసుకోవడమంటే ఎవరికైనా ఆసక్తే! కేవలం తెలుసుకొని సరిపెట్టుకోకుండా.. అంతరిక్ష రంగంలో తన కెరీర్‌ని కొనసాగించాలని చిన్న వయసులోనే నిర్ణయించుకుంది లక్నోకు చెందిన ప్రియాంక శ్రీవాస్తవ. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళ కల్పనా చావ్లాను స్ఫూర్తిగా తీసుకొని ఈ రంగంలోకి అడుగుపెట్టిన ప్రియాంక.. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లుగా.. నాసాలో కొలువు తెచ్చుకుంది. అంతేనా.. మూడేళ్ల క్రితం మార్స్ పైకి విజయవంతంగా దిగిన పర్‌సీవరెన్స్‌ రోవర్‌ ప్రయోగంలో భాగమైన తొమ్మిది మంది భారతీయుల్లో ప్రియాంక కూడా ఒకరు. ప్రస్తుతం నాసా జేపీఎల్‌లో స్పేస్‌ సిస్టమ్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తోన్న ఆమె.. మరో రెండు అంతరిక్ష ప్రయోగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచ వేదికపై శాస్త్రసాంకేతిక రంగాల్లో (STEM) తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న ఈ యంగ్‌ సైంటిస్ట్‌ స్ఫూర్తి గాథ.. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా మీకోసం..!

ప్రియాంక పుట్టింది అమెరికాలోనే అయినా.. పెరిగిందంతా లక్నోలో! పంజాబ్‌ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో బీటెక్‌ పూర్తిచేసిన ఆమె.. మిచిగాన్‌ యూనివర్సిటీలో ‘స్పేస్‌ సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌’ విభాగంలో మాస్టర్స్‌ పూర్తిచేసింది. ప్రియాంక తల్లిదండ్రులిద్దరూ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగులు. అయినా తమ ఇద్దరు కూతుళ్లను అనుకున్న రంగాల్లో ప్రోత్సహించారు.

టీవీలో ఆమెను చూశాక..!

చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండే ప్రియాంక.. ఓ రోజు టీవీలో కల్పనా చావ్లా అంతరిక్ష నౌకకు సంబంధించిన వార్త చూసింది. అంతే.. పెద్దయ్యాక తానూ అంతరిక్ష రంగంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నానంటోందామె.

‘నాకు చిన్నతనం నుంచి అంతరిక్ష రంగమంటే విపరీతమైన ఆసక్తి. పెద్దయ్యాక దీన్నే కెరీర్‌గా మార్చుకోవాలనుకున్నా. ఓ రోజు టీవీలో కల్పనా చావ్లా అంతరిక్ష నౌకకు సంబంధించిన వార్త చూశాక.. నా కోరిక మరింత బలపడింది. అమ్మతో కూడా ఇదే విషయం చెప్పా. ఆ సమయంలో అమ్మ నాకు అబ్దుల్ కలాం పుస్తకం తీసుకొచ్చి ఇచ్చింది. అది నాలో మరింత ప్రేరణ కలిగించింది. కాస్త పెద్దయ్యాక ఓ ప్రాజెక్ట్‌లో భాగంగా సునీతా విలియమ్స్‌ను కలుసుకున్నా. అంతరిక్షం, అంతరిక్ష రంగానికి సంబంధించిన చాలా విషయాల్ని ఆమె నుంచి తెలుసుకున్నా..’ అంటూ అంతరిక్ష రంగంపై తనకున్న మక్కువను బయటపెట్టిందీ యంగ్‌ సైంటిస్ట్.

ఏడేళ్లలో నాలుగు ప్రయోగాల్లో..!

చదువు పూర్తయ్యాక నాసాకు చెందిన డెన్వర్‌ శాఖలో ఇంటర్న్‌షిప్‌ చేసిన ప్రియాంక.. ఆపై నాసా జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబొరేటరీలో ఉద్యోగానికి ఎంపికైంది. ఆ సమయంలో నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మార్స్‌ పర్‌సీవరెన్స్‌ రోవర్‌ ప్రయోగంలో భాగమైందామె. ఇలా ఈ ప్రయోగంలో భాగమైన తొమ్మిది మంది భారతీయుల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. ఇక 2020 లో ఈ ప్రయోగం విజయవంతమవడంతో ప్రియాంక పేరు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. ఇక అంతకుముందు ‘Orbiting Carbon Observatory-3’ అనే మరో ప్రయోగంలో తనదైన ముద్ర వేసిందీ యువ సైంటిస్ట్‌. ఇలా ఏడేళ్ల తన నాసా కెరీర్‌లో భాగంగా ఇప్పటివరకు నాలుగు ప్రయోగాల్లో భాగమైన ప్రియాంక.. ప్రస్తుతం నాసా జేపీఎల్‌లో స్పేస్‌ సిస్టమ్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఇక ఈ ఏడాది ప్రయోగించబోతున్న ‘Psyche Space Mission’తో పాటు.. వచ్చే ఏడాది ‘Europa Clipper’ అనే మరో ప్రయోగంలోనూ చురుగ్గా పాలుపంచుకుంటోందామె.

క్రెడిటంతా అమ్మానాన్నలదే!

అంతరిక్ష రంగంలో కెరీర్‌ అంటే మాటలు కాదు.. బోలెడంత డబ్బు ఖర్చు పెట్టాలి.. అయితే తనది మధ్య తరగతి కుటుంబమైనప్పటికీ.. అమ్మానాన్నలు నన్ను ఈ రంగంలో ప్రోత్సహించడానికి వెనకాడలేదంటోంది ప్రియాంక.
‘మాది మధ్య తరగతి కుటుంబం. మిచిగాన్‌ యూనివర్సిటీలో చదువుకునే అవకాశమొచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితుల కారణంగా వెళ్లకూడదనుకున్నా. కానీ అమ్మానాన్నలు నన్ను వెనకడుగు వేయనివ్వలేదు. కాస్త కష్టమైనా సరే.. నా ఖర్చులకు సరిపడా డబ్బు సమకూర్చారు. ఎడ్యుకేషన్ లోన్ కూడా తీసుకున్నా.. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు అమ్మానాన్నలే కారణం. నన్నే కాదు.. చెల్లినీ తనకు ఆసక్తి ఉన్న వైద్య రంగంలో ప్రోత్సహించారు. ప్రస్తుతం తను విదేశాల్లో డాక్టర్గా స్థిరపడింది. ఇక మా కుటుంబంలో నేనే ఏకైక ఇంజినీర్‌ని అని చెప్పుకోవడం గర్వంగా అనిపిస్తోంది..’ అంటూ చెప్పుకొచ్చిందీ యువ ఇంజినీర్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్