Anand Mahindra : బంగారు తల్లీ.. నువ్వే మా అందరికీ స్ఫూర్తి!

మనలోని లోపాల్ని తలచుకుంటూ కూర్చుంటే అక్కడే ఆగిపోతాం.. అదే వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తే నలుగురికీ స్ఫూర్తినివ్వగలుగుతాం.. తాజాగా ఈ విషయం మరోసారి నిరూపించి చూపించింది యువ ఆర్చర్‌ శీతల్‌ దేవి. పుట్టుకతోనే చేతులు లేకపోయినా.. సమాజంలో తనకంటూ గుర్తింపు సంపాదించుకోవాలనుకుంది.

Published : 31 Oct 2023 12:52 IST

(Photos: Twitter)

మనలోని లోపాల్ని తలచుకుంటూ కూర్చుంటే అక్కడే ఆగిపోతాం.. అదే వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తే నలుగురికీ స్ఫూర్తినివ్వగలుగుతాం.. తాజాగా ఈ విషయం మరోసారి నిరూపించి చూపించింది యువ ఆర్చర్‌ శీతల్‌ దేవి. పుట్టుకతోనే చేతులు లేకపోయినా.. సమాజంలో తనకంటూ గుర్తింపు సంపాదించుకోవాలనుకుంది. ఈ పట్టుదలే తనను విలు విద్యలో ఆరితేరేలా చేసింది. చేతుల్లేకపోతేనేం.. కాళ్లతో బాణం వేయడం నేర్చుకొని.. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొడుతోంది. ప్రస్తుతం చైనాలో జరుగుతోన్న ‘ఆసియా పారా గేమ్స్‌’లో మూడు పతకాలు సాధించిన ఈ పారా అథ్లెట్‌.. తన అద్భుత ప్రదర్శనతో రికార్డు పుటల్లోకి ఎక్కింది. ఈ క్రమంలో ఒకే క్రీడల్లో రెండు పసిడి పతకాలు గెలుచుకున్న తొలి భారతీయ పారా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది శీతల్‌. అందుకే ప్రత్యేక అవసరాలున్నా తన విలువిద్యతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోన్న ఈ యువ క్రీడాకారిణికి ‘టీచర్‌’ అంటూ కితాబునిచ్చారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా. ఈ నేపథ్యంలో ఈ యువ ఆర్చర్‌ స్ఫూర్తిదాయక క్రీడా ప్రయాణం గురించి తెలుసుకుందాం..!

జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామంలో పుట్టి పెరిగింది పదహారేళ్ల శీతల్. ఆమెది నిరుపేద కుటుంబం. తండ్రి వ్యవసాయం చేస్తుంటాడు.. తల్లి మేకల కాపరి. Phocomelia Syndrome అనే అరుదైన సమస్య కారణంగా రెండు చేతుల్లేకుండానే పుట్టింది శీతల్‌. దీంతో తమ కూతురిలోని వైకల్యాన్ని చూసి వారు తొలుత చాలా బాధపడ్డారు. అయినా తనకు ఆసక్తి ఉన్న రంగంలో ప్రోత్సహించాలనుకున్నారు.

ఫోన్‌ కాల్‌ ఇచ్చిన ఆలోచన!

శీతల్‌ కూడా తన శారీరక లోపాన్ని చూసి ఎప్పుడూ అధైర్యపడలేదు. దీన్ని అధిగమించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలనుకుంది.. ఆ సమయం కోసం వేచి చూసింది. అయితే అనుకోకుండా ఓ రోజు స్థానిక ఆర్చరీ కోచ్‌ నుంచి వచ్చిన ఫోన్‌ కాల్‌ తన జీవితాన్నే మార్చేసిందంటోంది శీతల్.

‘అసలు నేను క్రీడల్లోకి అడుగుపెడతానని కలలో కూడా అనుకోలేదు. అందులోనూ చేతుల్లేకపోయినా ఆర్చరీలో రాణిస్తానని అస్సలు ఊహించలేదు. అయితే ఓ రోజు ఇక్కడి ‘మాతా వైష్ణోదేవి ష్రైన్‌ బోర్డ్‌ ఆర్చరీ అకాడమీ’ కోచ్‌ కుల్‌దీప్‌ సర్‌ నాకు ఫోన్‌ చేశారు. ఓ ఆర్మీ ఆఫీసర్‌ ద్వారా నా గురించి తెలుసుకున్నట్లు చెప్పారు. ఓసారి అకాడమీకి రమ్మని ఆహ్వానించారు. అక్కడికెళ్లాక.. ఎంతోమంది శారీరక, మానసిక లోపాలున్న వారు ఆర్చరీ సాధన చేయడం చూశా.. తమ లోపాల్ని అధిగమిస్తూ రాణించడం చూసి స్ఫూర్తి పొందా.. అప్పుడే నేనూ విలువిద్య సాధన చేయాలని నిర్ణయించుకున్నా..’ అంటోందీ పారా అథ్లెట్.

ఆరు నెలల్లోనే ఆరితేరింది!

విల్లు ఎక్కు పెట్టి బాణం సంధించాలంటే రెండు చేతులే కీలకం! కానీ చేతుల్లేని శీతల్ కాళ్లతో ఆర్చరీ సాధన చేయాలనుకుంది. ఇలా తనలోని పట్టుదలను గుర్తించిన కోచ్‌ కుల్‌దీప్‌ ఆమె కోసం ప్రత్యేక విల్లును తయారుచేయించారు. రెండు కాళ్లతో విల్లును ఎక్కుపెట్టి.. మెడ-భుజం సహాయంతో బాణాన్ని సంధించడం నేర్చుకుందామె. ఇలా ఆరు నెలల్లోనే ఈ క్రీడలో ఆరితేరింది శీతల్.

‘చేతుల్లేకుండా కాళ్లతో బాణం వేయడానికి తొలుత చాలా ఇబ్బంది పడ్డా. ఈ సమయంలో కుల్‌దీప్‌ సర్‌ నాకు ఓ స్ఫూర్తిదాయక వీడియో చూపించారు. ప్రపంచంలోనే తొలి చేతుల్లేని ఆర్చర్‌గా గుర్తింపు పొందిన అమెరికన్‌ ఆర్చర్‌ మట్‌ స్టుజ్‌మ్యాన్‌ కూడా కాళ్లతో బాణం వేస్తూ కీర్తి గడించారు. ఆ వీడియో చూశాక నాలో పట్టుదల పెరిగింది. ఫలితంగా నేను ఆరు నెలల్లోనే పర్‌ఫెక్ట్‌గా లక్ష్యానికి గురిపెట్టేలా నైపుణ్యాలు సాధించగలిగాను..’ అంటోన్న ఈ యువ ఆర్చర్‌.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చేతుల్లేకుండా రాణిస్తోన్న ఆరుగురు ఆర్చర్లలో ఒకరిగా గుర్తింపు పొందింది. వీరిలో శీతల్‌ ఒక్కరే అమ్మాయి కావడం విశేషం!

ఆ ఘనత శీతల్‌దే!

ప్రస్తుతం శీతల్‌ ఆర్చరీ క్రీడలోకి అడుగుపెట్టి దాదాపు ఏడాదిన్నర పూర్తైంది. ఇంత తక్కువ సమయంలోనే అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతూ పలు పతకాలూ సాధించిందామె. ఈ ఏడాది మేలో జరిగిన ‘యూరోపియన్‌ పారా ఆర్చరీ కప్‌’లో రజత పతకం కైవసం చేసుకున్న శీతల్‌.. మరో అంతర్జాతీయ పోటీలో కాంస్యం చేజిక్కించుకుంది. ఇక ఇటీవలే చెక్‌ రిపబ్లిక్‌ వేదికగా జరిగిన ‘ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌’లో పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన ఆమె.. రెండు పాయింట్ల తేడాతో రన్నరప్‌గా రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితేనేం.. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ ఫైనల్స్‌ చేరిన తొలి చేతుల్లేని మహిళా ఆర్చర్‌గా చరిత్ర సృష్టించింది శీతల్‌. అంతేకాదు.. ఈ విజయంతో వచ్చే ఏడాది జరగబోయే ప్యారిస్‌ పారాలింపిక్స్‌కూ అర్హత సాధించిన ఈ యువ క్రీడాకారిణి.. ఈ ప్రతిష్టాత్మక పోటీలో పతకం నెగ్గడమే లక్ష్యంగా సాధన చేస్తున్నానంటోంది.


శీతల్‌.. మనందరికీ గురువు : ఆనంద్‌ మహీంద్రా

టోర్నీ టోర్నీకీ తన ప్రదర్శనను మెరుగుపరచుకుంటూ ముందుకు సాగుతోన్న శీతల్‌.. తాజాగా చైనా వేదికగా జరుగుతోన్న ‘ఆసియా పారా గేమ్స్‌’లోనూ తన పతకాల జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఈ పోటీల్లో రెండు పసిడి, ఒక రజతంతో.. మూడు విభాగాల్లో మూడు పతకాలు కొల్లగొట్టిందీ జమ్మూ అథ్లెట్‌. దీంతో ఒకే క్రీడల్లో రెండు పసిడి పతకాలు గెలిచిన తొలి భారతీయ పారా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించిందామె. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా శీతల్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. ‘జీవిత పాఠాలు నేర్పే టీచర్‌’గా ఆమెకు కితాబునిస్తూనే.. తన సంస్థ నుంచి ఆమెకు కారును ఆఫర్‌ చేశారు.

‘నా జీవితంలో నాకెదురయ్యే చిన్న చిన్న సమస్యల గురించి ఇకపై నేనెప్పుడూ, ఎవరికీ ఫిర్యాదు చేయను. శీతల్‌ దేవి మనందరికీ ఒక గొప్ప టీచర్‌. తన శారీరక లోపాల్ని అధిగమించి ఆమె రాణిస్తోన్న తీరు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం! బంగారు తల్లీ.. నువ్వు మా సంస్థ నుంచి ఏ కారైనా ఎంచుకో.. దాన్ని నీ అవసరాలకు అనుగుణంగా కస్టమైజ్‌ చేసి బహుమతిగా అందిస్తాం..’ అంటూ శీతల్‌ స్ఫూర్తిదాయక క్రీడా ప్రయాణాన్ని వీడియో రూపంలో సోషల్‌ మీడియాలో పంచుకున్నారాయన! చేతుల్లేకుండానే ఆర్చరీలో దేశానికి పతకాల పంట పండిస్తోన్న ఈ యువ అథ్లెట్‌ అడుగడుగునా అధిగమిస్తోన్న సవాళ్ల కంటే మన సమస్యలు చాలా చిన్నవని చెప్పకనే చెప్పారాయన! ప్రతిసారీ ప్రతిభ ఉన్న యువతను తనదైన రీతిలో ప్రోత్సహిస్తూ.. నెటిజన్ల ప్రశంసలందుకునే మహీంద్రా.. శీతల్‌పై తాజాగా తన అభిమానాన్ని ప్రదర్శిస్తూ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. అందుకే ‘మీ ఇద్దరికీ సెల్యూట్‌ సర్‌’ అంటూ చాలామంది పోస్ట్‌లు పెడుతున్నారు. మరోవైపు ప్రధాని మోదీ సహా ఇతర ప్రముఖులూ శీతల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్