స్మగ్లర్లతో పోరాడుతూ.. ఆ తాబేళ్ల ప్రాణాలు కాపాడుతోంది!

మనుషులే కాదు.. మూగజీవాలు, జలచరాలూ అక్రమ రవాణాకు గురవుతుంటాయి. ఆపై వాటిని తమ అవసరాల కోసం వాడుకుంటూ లేదంటే చంపేస్తూ రాక్షసానందం పొందుతుంటారు కొందరు వ్యాపారులు. అలాంటి రాక్షస క్రీడకు అడ్డుకట్ట వేస్తోంది అరుణిమా సింగ్‌....

Published : 24 May 2024 15:34 IST

(Photos : Instagram)

మనుషులే కాదు.. మూగజీవాలు, జలచరాలూ అక్రమ రవాణాకు గురవుతుంటాయి. ఆపై వాటిని తమ అవసరాల కోసం వాడుకుంటూ లేదంటే చంపేస్తూ రాక్షసానందం పొందుతుంటారు కొందరు వ్యాపారులు. అలాంటి రాక్షస క్రీడకు అడ్డుకట్ట వేస్తోంది అరుణిమా సింగ్‌. పర్యావరణం, జలచరాల సంరక్షణ అంటే ప్రాణం ఇచ్చే ఆమె.. తన జీవితాన్ని సముద్ర జీవుల పరిరక్షణకే అంకితం చేసింది. ఈ క్రమంలోనే తాబేళ్లు, మొసళ్లు, డాల్ఫిన్లు అంతరించిపోకుండా, వాటి అక్రమ రవాణాకు అడ్డుపడుతూ ఎన్నో మూగ జీవాల ప్రాణాలు నిలుపుతోంది. ఇప్పటిదాకా దాదాపు 30 వేలకు పైగా తాబేళ్లను సంరక్షించి ‘తాబేళ్ల ప్రాణదాత’గా మారింది అరుణిమ. ‘ప్రపంచ తాబేళ్ల దినోత్సవం’ సందర్భంగా ఈ టర్టిల్ కన్జర్వేటర్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

అరుణిమా సింగ్‌ది ఉత్తరప్రదేశ్‌లోని మలిహాబాద్‌. అక్కడికి దగ్గర్లోనే గోమతి నది ఉంది. పచ్చని ప్రకృతిపై ప్రేమతో, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి.. చిన్నతనంలో తరచూ తన గ్రాండ్‌ పేరెంట్స్‌తో కలిసి ఆ నది వద్దకు వెళ్లేదామె. అందులోని తాబేళ్లు, మొసళ్లు, ఇతర జలచరాలను దగ్గర్నుంచి గమనించేది. ఈ క్రమంలోనే తనకు తెలియకుండానే వాటిపై ఇష్టాన్ని పెంచుకుంది అరుణిమ. అయితే ఒకదశలో అవి అంతరించిపోతున్నాయని గుర్తించిన ఆమె.. ఎలాగైనా వాటిని సంరక్షించాలని నిర్ణయించుకుంది.

పార్ట్‌టైమ్‌గా మొదలుపెట్టి..!
‘2010లో లైఫ్‌ సైన్స్‌ విభాగంలో మాస్టర్స్‌ చదివేటప్పుడు జలచరాల సంరక్షణ దిశగా తొలి అడుగు వేశాను. ఈ క్రమంలోనే Turtle Survival Alliance (TSA)లో చేరి పలు సేవా కార్యక్రమాల్లో భాగమయ్యాను. వన్యప్రాణి సంరక్షణపై లక్నో యూనివర్సిటీ వేదికగా ఏర్పాటుచేసిన ఓ అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడాను. మరోవైపు ఉత్తరప్రదేశ్‌ అటవీ శాఖతో మమేకమై.. ఇదే అంశాన్ని ఇక్కడి టీచర్లు, విద్యార్థులు, ప్రజల్లోకీ తీసుకెళ్లాను. జలచరాల సంరక్షణ గురించి స్కూళ్లు, గ్రామాలు, నగరాల్లో అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహించేవాళ్లం. మరోవైపు మత్స్యకారులు, పోలీసు శాఖ వారినీ ఈ సెషన్స్‌లో భాగం చేసే వాళ్లం.. ఇలా అటు చదువుకుంటూ.. ఇటు పార్ట్‌టైమ్‌గా మొదలైన ఈ సేవ.. రాన్రానూ ఫుల్‌టైమ్‌గా మారిపోయింది..’ అంటోంది అరుణిమ. ప్రస్తుతం TSA ఇండియా ప్రాజెక్ట్‌ కో-ఆర్డినేటర్‌గా, ‘TSA Foundation ఇండియా’ స్వచ్ఛంద సంస్థలో ఫ్రెష్‌వాటర్‌ వైల్డ్‌లైఫ్‌ బయాలజిస్ట్‌గా కొనసాగుతోంది అరుణిమ.

తాబేళ్లపై పీహెచ్‌డీ!
తాబేళ్ల సంరక్షణపై మక్కువతో లక్నో యూనివర్సిటీ నుంచి ‘టర్టిల్ ఎకాలజీ’లో పీహెచ్‌డీ పూర్తిచేసిన అరుణిమ.. ఈ సమయంలో తాబేళ్ల జనాభాను పెంచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించానంటోంది.
‘పీహెచ్‌డీలో భాగంగానే మంచి నీటి సరస్సుల్లో పెరిగే తాబేళ్ల సంతానోత్పత్తిని పెంచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించాను. అలాగే ఉత్తరప్రదేశ్‌ అటవీ శాఖతో కలిసి జలచరాల సంరక్షణ-వాటి జనాభాను పెంచేందుకు Assurance Colonies ఏర్పాటులో నా వంతు పాత్ర పోషించా. అలాగే ఈ సంరక్షణ కార్యక్రమాల్లో భాగమయ్యే బృందాలకు జలచరాల సంరక్షణ-వాటి సంతానోత్పత్తిపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా నిర్వహించా..’ అంటోంది అరుణిమ. ఇలా తన అధ్యయనంలో భాగంగా ఓవైపు తాబేళ్ల పరిరక్షణపై దృష్టి పెడుతూనే.. మరోవైపు మొసళ్ల సంరక్షణ, నిర్లక్ష్యానికి గురైన డాల్పిన్లను రక్షించి.. వాటికి పునరావాసం కల్పించడం.. వంటి చర్యలు తీసుకుంటోంది.

వాటికి పునర్జన్మనిచ్చింది!
టీమ్‌ వర్క్‌తోనే ఏదైనా సాధ్యమంటోంది అరుణిమ.. ప్రస్తుతం TSA ప్రాజెక్ట్‌ కో-ఆర్టినేటర్‌గా తన బృందంతో కలిసి ఎన్నో జలచరాల అక్రమ రవాణాను అడ్డుకుంటోన్న ఆమె.. మరెన్నో సముద్ర జీవులకు ప్రాణ దానం చేస్తోంది. ‘నేను, నా టీమ్‌తో కలిసి స్మగ్లింగ్‌కి గురైన ఎన్నో తాబేళ్లను కాపాడగలిగాను. మూడేళ్ల క్రితం సుమారు 300 పైచిలుకు తాబేళ్లను స్మగ్లర్లు గోమతి నది నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా రవాణా చేశారు. వాటిని కాపాడి తొలుత నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌లో విడిచిపెట్టాం. ఆ తర్వాత మా పునరావాస కేంద్రంలో వాటికి పరీక్షలు నిర్వహించి.. తిరిగి గోమతి నదిలో వదిలిపెట్టాం. ఇలా ఇప్పటివరకు దాదాపు 28 వేల పైచిలుకు తాబేళ్లు, 25కు పైగా గంగానదిలోని డాల్ఫిన్లు, పదుల సంఖ్యలో మొసళ్లను సంరక్షించగలిగాం.. ఇదంతా టీమ్‌ వర్క్‌తోనే సాధ్యమైంది..’ అంటోందీ టర్టిల్ లవర్‌.

‘ప్రకృతి రత్న’.. ‘ఎర్త్‌ హీరో’!
సుమారు 14 ఏళ్లుగా జలచరాల సంరక్షణ కోసం పాటుపడుతోన్న అరుణిమను పలు అవార్డులు వరించాయి. ఆమె సేవల్ని గుర్తించిన ‘పీహెచ్‌డీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ’.. 2018లో నిర్వహించిన ‘నేచర్‌ అండ్‌ వైల్డ్‌లైఫ్‌ కన్జర్వేషన్‌ కాన్ఫరెన్స్‌’ వేదికగా ‘ప్రకృతి రత్న’ అవార్డుతో సత్కరించింది. ‘నాట్‌వెస్ట్‌ గ్రూప్‌ ఇండియా’.. ‘Save the Species’ విభాగంలో ‘ఎర్త్‌ హీరో’ పురస్కారాన్ని బహూకరించింది. సందర్భమొచ్చినప్పుడల్లా జలచరాల సంరక్షణపై వర్క్‌షాప్స్‌ నిర్వహిస్తూ, ఆయా కార్యక్రమాల్లో ప్రసంగిస్తూ ఈ అంశాలపై అందరిలో అవగాహన పెంచుతోంది అరుణిమ.
‘జలచరాల్ని స్మగ్లర్ల నుంచి విడిపించే క్రమంలో పలు సవాళ్లు, బెదిరింపులు కూడా ఎదురవుతుంటాయి. అయినా నేను అలాంటి వాటికి భయపడను. ఎందుకంటే మనం ఎంచుకున్న లక్ష్యం గొప్పదైనప్పుడు.. ఇలాంటి సవాళ్లను ఎదిరించడం పెద్ద కష్టం కాదనేది నా భావన!’ అంటూ తన మాటలతోనూ స్ఫూర్తి రగిలిస్తోందీ ఎర్త్‌ హీరో.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్