Deepika Deshwal: ఉపన్యాసాలతో.. రికార్డు!

మహిళల హక్కులు-మానవ హక్కుల గురించి అందరూ మాట్లాడతారు. కానీ అంతర్జాతీయ వేదికలపై వీటి గురించి ప్రసంగాలు చేస్తూ.. ఎంతోమందిలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది యువ యాక్టివిస్ట్‌ దీపికా....

Published : 14 Jul 2023 13:15 IST

(Photos: Instagram)

మహిళల హక్కులు-మానవ హక్కుల గురించి అందరూ మాట్లాడతారు. కానీ అంతర్జాతీయ వేదికలపై వీటి గురించి ప్రసంగాలు చేస్తూ.. ఎంతోమందిలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది యువ యాక్టివిస్ట్‌ దీపికా దేశ్వాల్‌. ఇటీవలే ముగిసిన ‘హ్యూమన్‌ రైట్స్‌ యూత్‌ సమిట్‌ - 2023’లో స్ఫూర్తిదాయక ప్రసంగం చేసి ఐరాస ప్రతినిధుల్నే కాదు.. ఎందరో దేశాధినేతల మనసు దోచుకుందామె. అయితే ఐరాస వేదికగా తానిలా ప్రసంగించడం ఇది మూడోసారి. తద్వారా యూఎన్‌ వేదికగా మూడుసార్లు ఉపన్యసించిన మొదటి అమ్మాయిగా, పిన్న వయస్కురాలిగా ‘ఇండియన్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో చోటు సంపాదించిందామె. వృత్తిరీత్యా లా ఆఫీసర్‌ అయిన దీపిక.. వక్తగానే కాదు, సమాజ సేవకురాలిగా, అథ్లెట్‌గానూ ఎంతోమందికి సుపరిచితం! ఈ నేపథ్యంలో ఈ యువ యాక్టివిస్ట్‌ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..!

దిల్లీకి చెందిన దీపిక ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంఫిల్‌ పూర్తి చేసింది. గతంలో అమెరికా ప్రభుత్వం నిర్వహించిన ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రామ్‌లోనూ భాగమైంది. దిల్లీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తిచేసిన ఆమె.. ప్రస్తుతం సుప్రీంకోర్టులో లా ఆఫీసర్‌గా పనిచేస్తోంది. మరోవైపు సెన్సార్‌ బోర్డ్‌ సభ్యురాలిగానూ కొనసాగుతోంది.

అథ్లెట్‌గా.. యూత్‌ లీడర్‌గా!

దీపిక చిన్నతనం నుంచి రాజకీయాలపై మక్కువ చూపేది. ఈ క్రమంలోనే దిల్లీ యూనివర్సిటీలో చదువుకునే సమయంలో ఆ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘానికి (DUSU) సెక్రటరీగా వ్యవహరించింది. ఎక్కువగా లింగ సమానత్వం, మానవ హక్కులపై దృష్టి సారించే ఆమె.. దిల్లీలోని పలు ప్రాంతాల్లో ఆయా అంశాలపై తలెత్తిన సవాళ్లు, సమస్యల పరిష్కారం దిశగా కృషి చేసింది. ఇలా ప్రజల మేలు కోరి ఆమె చేస్తోన్న సేవలకు గుర్తింపుగా ఇటీవలే జరిగిన ‘దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌’ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించింది దిల్లీ ప్రభుత్వం. ఈ క్రమంలోనే సరస్వతీ విహార్‌ వార్డ్‌ 58 నుంచి పోటీ పడి గెలుపొందింది. మరోవైపు దీపిక క్రీడాకారిణి కూడా! రెజ్లింగ్‌, జూడో.. వంటి క్రీడల్లో పట్టు పెంచుకుంది.

‘స్కూల్లో చదువుకునే రోజుల్లో బాస్కెట్‌బాల్‌ ఎక్కువగా ఆడేదాన్ని. మా నాన్న, అంకుల్‌ ఇద్దరూ రెజ్లర్లే. వాళ్ల స్ఫూర్తితో రెజ్లింగ్‌ ఎంచుకున్న నేను.. అంతర్‌-కళాశాల పోటీల్లో తొలిసారి పాల్గొన్నా. ఆపై ప్రొఫెషనల్‌ ట్రైనింగ్‌ తీసుకొని.. దిల్లీ తరఫున జాతీయ స్థాయి క్రీడల్లో పోటీ పడ్డా. ఆరు బంగారు పతకాలు సాధించా.. నాకు జూడో క్రీడలోనూ ప్రవేశం ఉంది..’ అని చెబుతోంది దీపిక.

కొవిడ్‌ వారియర్‌గా..!

స్కూల్లో ఉన్నప్పట్నుంచే సమాజ సేవ చేయడంలో ముందుండేది దీపిక. ఇక కరోనా సమయంలో ఆమె సేవా గుణం మరింత విస్తృతమైంది. కొవిడ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్న సమయంలో పంజాబ్‌లోని కొన్ని గ్రామాల్ని దత్తత తీసుకొని.. వారికి ఆహారం, వైద్య సదుపాయాలు అందేలా చూసిందామె. దిల్లీలోని పలు గ్రామాలు, కాలనీలకు రేషన్‌ బియ్యం అందేలా చొరవ తీసుకుంది. అక్కడి సావన్‌ పార్క్‌, రాణా పార్క్‌, సిరాస్‌ పూర్‌ గ్రామం.. వంటి ప్రాంతాల్లో ఆకలితో అలమటిస్తోన్న రోజువారీ కూలీలకు మూడు పూటలా భోజనం అందించి వారి ఆకలి తీర్చింది. అధికారులను సమన్వయం చేసుకుంటూ.. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి వెంటిలేటర్లు, అంబులెన్స్‌ సేవలు అందేలా కృషి చేసింది. ఈ క్రమంలో తన నెలవారీ జీతాన్ని సేవల కోసమే వినియోగించిందామె. అంతేకాదు.. తన తల్లితో కలిసి మాస్కులు తయారుచేసి ఎంతోమందికి అందించిందామె. ఇలా ఆమె సేవల్ని గుర్తించిన అప్పటి పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ వీడియో కాల్‌ చేసి ఆమెతో మాట్లాడారు.. ఆమె సేవల్ని కొనియాడారు.

‘బ్రేవరీ’ గర్ల్!

అవసరార్థుల్ని ఆదుకోవడమే కాదు.. ప్రమాదంలో ఉన్న ఎంతోమంది అమ్మాయిల మాన, ప్రాణాలు కాపాడింది దీపిక. 2019లో సోషల్‌ మీడియాలో వేధింపులకు గురైన దాదాపు 80 మంది అమ్మాయిల్ని ఆ ఉచ్చులో నుంచి బయటపడేసి.. నేరస్థుల్ని ప్రభుత్వానికి పట్టించిందామె. ఈ క్రమంలోనే పంజాబ్‌ ప్రభుత్వం ఆమెను ‘బ్రేవరీ అవార్డు’కు సిఫార్సు చేసింది. మరోవైపు.. వ్యభిచార కూపంలో చిక్కుకున్న అమ్మాయిలను రక్షించి వారికి పునరావాసం కల్పించడంలోనూ కృషి చేసింది. గృహహింసను ఎదుర్కొన్న పలువురు మహిళలకు కావాల్సిన సహాయ సహకారాలు అందించింది దీపిక.

‘అమ్మాయిలు, మహిళలు ఎలాంటి కష్టంలో ఉన్నా ఆదుకోవడానికి నేను సిద్ధంగా ఉంటా. అయితే చాలామంది కుటుంబ సభ్యుల ఒత్తిడి, భయం కారణంగా తామెదుర్కొనే హింస గురించి బయటపెట్టలేకపోతున్నారు. దీనివల్ల నేరాలు పెరుగుతాయే తప్ప తగ్గవు. కాబట్టి మహిళలపై జరుగుతున్న నేరాలు తగ్గుముఖం పట్టాలంటే వారు ధైర్యంగా బయటికి రావాలి.. తమపై జరిగిన హింస గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అప్పుడే నేరస్థులకు శిక్ష పడుతుంది.. స్త్రీలకు న్యాయం జరుగుతుంది..’ అంటుంది దీపిక. మరోవైపు అమ్మాయిలు, మహిళల కోసం పలు వర్క్‌షాప్స్‌ ఏర్పాటుచేసి స్వీయ రక్షణ నైపుణ్యాలూ నేర్పించిందీ యువ యాక్టివిస్ట్.

హక్కుల పరిరక్షకురాలు!

మానవ హక్కులు, మహిళల హక్కులపై పోరాడడంలోనూ ముందుంటుంది దీపిక. గతంలో రెండేళ్ల పాటు ‘ఐరాస మానవ హక్కుల మండలి’కి మన దేశం తరఫున ప్రాతినిథ్యం వహించిన ఆమె.. ఈ క్రమంలో నాలుగు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసింది. ‘మానవ హక్కులు-మహిళా హక్కులు’ అనే అంశంపై ఇప్పటికే రెండుసార్లు ఐరాస వేదికగా ప్రసంగించిన దీపిక.. ఇటీవలే ముగిసిన ‘హ్యూమన్‌ రైట్స్‌ యూత్‌ సమిట్‌ - 2023’లో మూడోసారి ఇదే అంశంపై ప్రసంగించింది. ఇలా తన ప్రసంగంతో ఈ సమావేశంలో పాల్గొన్న 150 దేశాల ప్రతినిధులు, పలువురు దేశాధినేతల్నీ ఆకట్టుకుందామె. తద్వారా 2018-2023 మధ్యలో మూడుసార్లు ఐరాసలో ప్రసంగించిన తొలి భారతీయ అమ్మాయిగా, పిన్న వయస్కురాలిగా ‘ఇండియన్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో చోటు సంపాదించింది. అంతేకాదు.. దీనిపై ‘గిన్నిస్‌ బుక్‌’లోనూ తన పేరును రిజిస్టర్‌ చేసుకోనున్నట్లు చెప్పుకొచ్చింది దీపిక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్