మళ్లీ తననే పెళ్లి చేసుకోవాలనుంది!

భార్యాభర్తల మధ్య ప్రేమే కాదు.. అప్పుడప్పుడు గొడవలూ జరుగుతుంటాయి. ఇలాంటి సమయంలో పంతాలకు పోకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుంటే బంధం నిలబడుతుంది. లేదంటే ఆ తర్వాత పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. ఇలాంటి పశ్చాత్తాపమే బిల్‌ గేట్స్‌....

Published : 04 May 2022 20:22 IST

(Photos: Instagram)

భార్యాభర్తల మధ్య ప్రేమే కాదు.. అప్పుడప్పుడు గొడవలూ జరుగుతుంటాయి. ఇలాంటి సమయంలో పంతాలకు పోకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుంటే బంధం నిలబడుతుంది. లేదంటే ఆ తర్వాత పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. ఇలాంటి పశ్చాత్తాపమే బిల్‌ గేట్స్‌ మాటల్లో కనిపిస్తోంది. ‘మెలిందాతో తనది గొప్ప వివాహ బంధమని.. అవకాశమొస్తే మళ్లీ తననే పెళ్లి చేసుకోవాలనుందం’టూ ఇటీవలే తన మనసులోని మాటను ఓ సందర్భంలో పంచుకున్నారు బిల్‌. ఇక మరో వైపు మెలిందా కూడా తన భర్తతో విడాకుల తర్వాత ఎన్నో రోజులు ఏడ్చానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ఇలా వీళ్లిద్దరూ ‘మాట వరసకే అన్నా.. తిరిగి కలిస్తే బాగుండ’ని అనుకుంటున్నారు చాలామంది. ఈ నేపథ్యంలో 27 ఏళ్ల తమ వైవాహిక బంధంలో భాగంగా ఈ జంట వివిధ సందర్భాల్లో నెమరువేసుకున్న కొన్ని ఆసక్తికర విశేషాల గురించి తెలుసుకుందాం రండి..

ప్రేమ-డేటింగ్‌-పెళ్లి!

ప్రేమ బంధం శాశ్వతమవ్వాలంటే కేవలం చూపులే కాదు.. అభిరుచులు-ఇష్టాయిష్టాలు కూడా కలవాలంటారు. బిల్‌-మెలిందాల ప్రేమ విషయంలో కూడా ఇదే జరిగింది. 1987లో బిల్‌ మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా వ్యవహరిస్తోన్న సమయంలో ఆ కంపెనీలో ప్రొడక్ట్‌ మేనేజర్‌గా చేరారు మెలిందా. అప్పట్లో ఆ కంపెనీలో చేరిన తొలి మహిళా ఎంబీఏ గ్రాడ్యుయేట్‌ మెలిందానే! ఇద్దరి అభిరుచులు, ఆలోచనా విధానం ఒకేలా ఉండడంతో మనసులు కలిశాయి. దీంతో ఆమెను ఓ రోజు డిన్నర్‌ డేట్‌కు కూడా తీసుకెళ్లారట బిల్‌. ఇలా కొన్నేళ్ల పాటు డేటింగ్‌ చేసిన ఈ జంట.. 1994లో కొత్త ఏడాది రోజున హవాయి దీవుల్లో పెళ్లి బంధంతో ఒక్కటైంది. వీరి 27 ఏళ్ల అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ముగ్గురు పిల్లలున్నారు. సేవా గుణం అణువణువునా నిండి ఉన్న వీరిద్దరూ 2000 సంవత్సరంలో ‘బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజారోగ్యం, విద్య, వాతావరణ పరిరక్షణ.. తదితర అంశాలపై ఎన్నో సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ వస్తోందీ సంస్థ.

ఈ క్రమంలో తమ ఆస్తిలో సుమారు మూడో వంతు సేవా కార్యక్రమాలకే వినియోగిస్తున్నారంటే ఈ జంట దాతృత్వం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇలా వృత్తి జీవితంలోనే కాదు.. కుటుంబం, పిల్లల బాధ్యతనూ కలిసి కట్టుగానే నిర్వహిస్తామని, ఎందులోనైనా ఐక్యతను చూపుతామంటూ ఓ సందర్భంలో పంచుకున్నారు మెలిందా. ఇలా ఫౌండేషన్ కార్యక్రమాలతో పాటు మహిళా సాధికారత కోసం కూడా కృషి చేస్తున్నారు మెలిందా. ఇందులో భాగంగా ఒక ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీని కూడా నెలకొల్పారు.

నా కన్నా నాలుగాకులు ఎక్కువే చదివింది!

భార్యాభర్తలుగా ఉన్నన్నాళ్లే కాదు.. విడాకుల తర్వాత కూడా ఫౌండేషన్‌ బాధ్యతల్ని కలిసే నిర్వర్తిస్తున్నారు బిల్‌-మెలిందాలు. అయితే ఈ విషయంలో మెలిందా తన కంటే నాలుగాకులు ఎక్కువే చదివిందంటూ ఓ సందర్భంలో పంచుకున్నారు బిల్.
‘నిజమైన భాగస్వామి అంటే మెలిందానే! ఇతరులకు మంచి చేయడంలో తనెప్పుడూ ముందే ఉంటుంది. ఎవరికి ఏం కావాలన్న విషయాన్ని నా కంటే బాగా పసిగడుతుంది. సైన్స్‌ అంటే తనకు మహా ఇష్టం..’ అంటూ తన భార్య గురించి ఓ సందర్భంలో చెప్పుకొచ్చారాయన. ఇక బిల్‌ గురించి మెలిందాను అడిగితే.. ‘నేనెప్పుడూ ఆయన దృష్టి కోణంలోనే చూడాలనుకుంటా. ఆయనా నా విషయంలో ఇలాగే అనుకుంటారని నాకు తెలుసు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి అభిప్రాయభేదాలూ తలెత్తుతాయి. నిజానికి అవి మా మధ్య అనుబంధాన్ని మరింత దృఢం చేస్తాయి..’ అంటూ తమ దాంపత్య జీవితంలోని రహస్యాన్ని ఓసారి ఫేస్‌బుక్‌ లైవ్‌లో బయటపెట్టారామె. ఇలా 27 ఏళ్ల పాటు తమ వైవాహిక బంధంతో ఎన్నో జంటల్లో స్ఫూర్తి రగిలించిన ఈ జంట గతేడాది విడాకులు తీసుకునేసరికి.. యావత్ ప్రపంచం విస్మయానికి గురైంది.

మళ్లీ ఆమెనే పెళ్లి చేసుకుంటా!

విడాకుల తర్వాత కూడా సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరి గురించి మరొకరు ప్రస్తావిస్తూ, తమ వైవాహిక బంధంలోని తీపి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటున్నారు బిల్‌-మెలిందాలు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన మాజీ భార్యపై తనకున్న ఇష్టాన్ని మరోసారి చాటుకున్నారు బిల్.

‘గత రెండేళ్లలో నా జీవితంలో అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అందులో విడాకులు ఒకటి. అయితే నా దృష్టిలో మాది గొప్ప వివాహం. జరిగిన దాన్ని నేను మార్చలేను. అలాగని నేను వేరొకరిని పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. మిలిందానే మళ్లీ పెళ్లి చేసుకోవడం గురించి ఆలోచిస్తున్నా. ఇప్పటికీ మెలిందాతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. తనతో స్నేహంగానే ఉన్నానని నమ్ముతున్నా. మా మధ్య అత్యంత విలువైన, సన్నిహిత సంబంధం ఉంది. కలిసే ఫౌండేషన్‌ను స్థాపించాం.. ఇప్పటికీ కలిసే పనిచేస్తున్నాం.. అందుకు ఎంతో సంతోషంగా, సంతృప్తిగా అనిపిస్తోంది..’ అంటూ తన మనసులోని మాటలు వెలిబుచ్చారాయన.

అప్పుడు ఎంతో కుంగిపోయా!

ఇక విడాకుల తర్వాత మెలిందా కూడా ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటల్ని పంచుకుంటూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ‘విడాకులతో నేనెంతో కుంగిపోయా. చాలా రోజుల పాటు బాధపడ్డా. నేలపై కూర్చొని ఏడుస్తూనే ఉన్నా. ఇలా ఎలా జరిగింది? ఈ బాధ నుంచి నేనెలా బయటపడాలి? జీవితంలో ఎలా ముందుకెళ్లాలి? వంటి ఆలోచనలు నా మనసులో నిండిపోయాయి. కొన్నిసార్లైతే నా మీద నాకే కోపం వచ్చేది. ఇది నా జీవితంలో నేనెదుర్కొన్న అత్యంత ప్రతికూల సమయం. అయితే ఆ కుంగుబాటు నుంచి క్రమక్రమంగా కోలుకోవడం మొదలుపెట్టా.. నా జీవితంలో మరో పేజీని ప్రారంభించాల్సిన సమయం వచ్చిందని రియలైజ్‌ అయ్యా..’ అంటూ చెప్పుకొచ్చారు మెలిందా.

ఆవేశంతోనో, ఆలోచనతోనో.. జరిగిందేదో జరిగిపోయింది.. బిల్‌ అన్నట్లుగా అవకాశమొస్తే.. తిరిగి వీరిద్దరూ ఒక్కటవ్వాలని ప్రపంచమంతా కోరుకుంటోంది..! చూద్దాం.. ఏం జరుగుతుందో..?!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్