ఆస్తంతా అమ్మాయిలకు.. ఇల్లరికపు అల్లుళ్లుగా అబ్బాయిలు.. ఎక్కడో తెలుసా!

ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో కొడుకు పుడితే వారసుడు పుట్టాడని వేడుక చేసుకోవడం సహజంగా కనిపించేదే.. కానీ అక్కడ అమ్మాయి పుడితేనే సెలబ్రేషన్స్!సాధారణంగా పెళ్లి తర్వాత వధువు అత్తారింటికి వెళ్తే.. అక్కడ మాత్రం అబ్బాయిలే ఇల్లరికపు అల్లుళ్లుగా వధువు వెంట నడవడం ఆనవాయితీ!

Updated : 16 Mar 2024 15:26 IST

ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో కొడుకు పుడితే వారసుడు పుట్టాడని వేడుక చేసుకోవడం సహజంగా కనిపించేదే.. కానీ అక్కడ అమ్మాయి పుడితేనే సెలబ్రేషన్స్!

సాధారణంగా పెళ్లి తర్వాత వధువు అత్తారింటికి వెళ్తే.. అక్కడ మాత్రం అబ్బాయిలే ఇల్లరికపు అల్లుళ్లుగా వధువు వెంట నడవడం ఆనవాయితీ!

అలాగే అక్కడ ఆస్తీ, ఇంటి పెత్తనం.. అంతా కూతుళ్లదే!

అదేంటి.. పితృస్వామ్య వ్యవస్థకు పూర్తి భిన్నంగా ఉన్నాయే ఈ సంప్రదాయాలు అనుకుంటున్నారా? ఉండడం కాదు.. దశాబ్దాలుగా అక్కడ మాతృస్వామ్య వ్యవస్థే రాజ్యమేలుతోంది. ఓవైపు ప్రపంచమంతా స్త్రీ సమానత్వం కోసం పోరాటం చేస్తుంటే.. అక్కడ పురుషులు తమకు మహిళలతో సమాన అవకాశాలు కల్పించాలని మొరపెట్టుకుంటున్నారట! అలాగని ఇవన్నీ వేరే దేశస్థుల పద్ధతులనుకుంటే పొరపాటే! ఎందుకంటే ఆడవాళ్లకు పట్టం కట్టే ఈ వ్యవస్థ మనదేశంలోనే ఉంది. అదెక్కడో? ఆ వింత పద్ధతులేంటో మహిళా దినోత్సవం నేపథ్యంలో మనమూ తెలుసుకుందాం రండి..

సాధారణంగా గిరిజన గ్రామాల్ని వెనుకబడిన ప్రాంతాలుగా భావిస్తుంటాం. కానీ కొన్ని తెగలు పాటించే సంప్రదాయాలు, ఆచరించే పద్ధతులు సమాజానికే స్ఫూర్తిగా నిలుస్తుంటాయి. మేఘాలయ రాష్ట్రంలోని ఖాసీ, గరో తెగలూ ఇందుకు మినహాయింపు కాదు. మయన్మార్‌ (అప్పటి బర్మా), బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన ఈ తెగలు మేఘాలయలోని జైంటియా పర్వత ప్రాంతాల్లో స్థిరపడ్డాయి. ఈ తెగలకు చెందిన మరికొన్ని కుటుంబాలు అసోం, మణిపూర్‌, పశ్చిమ బంగ రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. అయితే మేఘాలయలో స్థిరపడ్డ ఖాసీ, గరో తెగలు దశాబ్దాలకు పూర్వమే కొన్ని ప్రత్యేక పద్ధతులు, సిద్ధాంతాలు పాటించాలని నియమంగా పెట్టుకున్నారు. నేటికీ వాటిని పాటిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఆడపిల్ల పుడితే పండగే!

ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో తమకు ఒక్క కొడుకైనా పుట్టాలని, వంశోద్ధారకుడు, ఆస్తికి వారసుడు కావాలని కోరుకోవడం చూస్తుంటాం. ఇక కొడుకు పుడితే పార్టీలు, వేడుకలు చేసుకునే వాళ్లూ చాలామందే! అయితే ఆడపిల్ల పుడితే వేడుకలు జరుపుకొనే వారూ మన దగ్గర లేకపోలేదు. కానీ ఖాసీ, గరో తెగల్లో ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా ఊరంతా పండగ వాతావరణం నెలకొంటుంది. కొడుకు పుడితే సాధారణ స్థాయిలో వేడుకలు జరుపుకోవడం, అదే కూతురు పుడితే అంగరంగ వైభవంగా సెలబ్రేట్‌ చేసుకోవడం అక్కడి తెగల్లో కనిపిస్తుంటుంది. ఇలా కూతురు పుట్టుకను వేడుకగా చేసుకోవడమే కాదు.. భవిష్యత్తులో ఆ ఇంటి పెత్తనమంతా ఆమెకే అప్పగించడమూ అక్కడ కామన్.

అబ్బాయిలు అత్తారింటికి..!

మన దగ్గర ఆడపిల్ల పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లడం ఆనవాయితీ. కానీ ఖాసీ, గరో తెగల్లో ఇందుకు పూర్తి భిన్నమైన పద్ధతులున్నాయి. వివాహం తర్వాత వరుడే వధువు చేయి పట్టుకొని ఇల్లరికపు అల్లుడిగా రావాలట! ఒకవేళ ఆ ఇంట్లో ఒకరికి మించి ఆడపిల్లలుంటే.. చిన్న కూతురు మినహాయించి మిగతా వాళ్లంతా తమ భర్తలతో అదే ఇంట్లో ఉండచ్చు.. లేదంటే ఇద్దరూ విడిగానైనా కాపురం పెట్టచ్చు.. ఒకవేళ కూతుళ్లు అదే తెగకు చెందిన అబ్బాయిల్ని కాకుండా బయటి వారిని పెళ్లాడితే.. ఇల్లరికం పద్ధతి వర్తించదని, అలాంటప్పుడు ఇంటి బాధ్యతలు, ఆస్తిపాస్తుల అప్పగింతల విషయాల్లో సమస్యలు రావచ్చని అక్కడి వారు చెబుతున్నారు.

ఆమె మాటే శాసనం!

మన కుటుంబాల్లో ఎక్కువ శాతం ఇంటి బాధ్యతలు, పెత్తనం మగవాళ్లదే ఉండడం చూస్తుంటాం. కానీ ఖాసీ, గరో తెగల్లో ఆడవాళ్ల మాటే శాసనం! తీసుకునే నిర్ణయాల దగ్గర్నుంచి, పెట్టే ఖర్చుల దాకా ఇంటి ఆడవాళ్ల పెత్తనమే నడుస్తుందట! ఇక అక్కడి కుటుంబాల్లో చిన్నమ్మాయిని Khadduhగా పరిగణిస్తారు. పెళ్లి తర్వాత ఇంటి బాధ్యతలు, ఆస్తిపాస్తులన్నీ ఆమెకే దక్కుతాయి. ఇక తల్లి మరణం తర్వాత ఇంటి పెత్తనం కూడా చిన్న కూతురే నిర్వర్తించాల్సి ఉంటుంది. అంతేకాదు.. తనకు పుట్టబోయే పిల్లలకు కూడా తండ్రి ఇంటి పేరు కాకుండా తల్లి ఇంటి పేరు పెట్టడం అక్కడ దశాబ్దాలుగా కొనసాగుతోన్న మరో ఆచారం. ఇక పిల్లల బాధ్యత నిర్వర్తించే విషయంలోనూ తండ్రి కంటే తల్లికే అధికారాలెక్కువట! ఈ క్రమంలో పిల్లల పోషణ కోసం వ్యవసాయం, ఇతర వృత్తి ఉద్యోగాల్లోనూ ఇక్కడి మహిళలు రాణిస్తున్నారట! ఇలా ప్రతి విషయంలోనూ పురుషుల కంటే మహిళలు ఓ మెట్టు పైనుండడం వల్లే ఇక్కడ ఆడవాళ్లపై అత్యాచారాలు, గృహహింస, ఇతర వేధింపులు.. వంటివి ఉండవని స్థానికులు చెబుతున్నారు.

పురుష సమానత్వం కోసం..!

ప్రస్తుతం ప్రపంచంలో చాలా చోట్ల స్త్రీలకు సమాన హక్కులు, అవకాశాలు దక్కాలని.. మహిళలు, మహిళా సంఘాలు పోరాటం చేయడం చూస్తున్నాం. కానీ మాతృస్వామ్య వ్యవస్థగా పరిగణిస్తోన్న ఖాసీ, గరో తెగలకు చెందిన పురుషులు మాత్రం తమ సమానత్వం కోసం ఏళ్లుగా పోరాడుతున్నారట! ఇందుకోసం 1990 నుంచి అక్కడ ఓ స్వచ్ఛంద సంస్థ నిరంతరం కృషి చేస్తోందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ రెండు తెగలే కాదు.. 20వ శతాబ్దానికి పూర్వం కేరళలోని నాయర్‌ తెగలో కూడా మహిళలకు పట్టం కట్టే ఇలాంటి ఆచారాలే ఉండేవట!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్