కశ్మీర్‌ లోయలో ‘నెలసరి’ పాఠాలు!

నెలసరి అంటేనే కళంకం.. బయటికి మాట్లాడకుండా రహస్యంగా ఉంచాల్సిన అంశం! రుతుక్రమంపై ఇప్పటికీ చాలా చోట్ల, చాలామందిలో ఇలాంటి భావన ఉంది. కశ్మీర్‌ లోయ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ముస్లింలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో దీని గురించి బహిరంగంగా మాట్లాడడానికి మహిళలెవరూ....

Published : 31 Oct 2022 17:13 IST

(Photos: Instagram, LinkedIn)

నెలసరి అంటేనే కళంకం.. బయటికి మాట్లాడకుండా రహస్యంగా ఉంచాల్సిన అంశం! రుతుక్రమంపై ఇప్పటికీ చాలా చోట్ల, చాలామందిలో ఇలాంటి భావన ఉంది. కశ్మీర్‌ లోయ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ముస్లింలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో దీని గురించి బహిరంగంగా మాట్లాడడానికి మహిళలెవరూ ధైర్యం చేయరు. కానీ 17 ఏళ్ల సెహెర్‌ మిర్‌ అందరిలా మౌనంగా ఉండాలనుకోలేదు. సహజసిద్ధంగా జరిగే ఈ ప్రక్రియ గురించి బహిరంగంగా మాట్లాడితే తప్పేముంది? అనుకుంది. ఈ ధైర్యంతోనే నలుగురిలో మాట్లాడడమే కాదు.. మరో నలుగురిని నిర్భయంగా, నిర్మొహమాటంగా మాట్లాడేలా స్ఫూర్తి నింపుతోంది. పిరియడ్స్‌ కళంకం కాదని, ఈ సమయంలో శుచి-శుభ్రత పాటించడం ఎంతో ముఖ్యమంటూ.. అక్కడి విద్యార్థులకు, గ్రామీణ ప్రాంత మహిళలకు నెలసరి పాఠాలు బోధిస్తూ స్ఫూర్తిగా నిలుస్తోంది.

పుల్వామాలోని పాంపోర్‌ అనే ప్రాంతానికి చెందిన సెహెర్‌ మిర్‌.. ప్రస్తుతం అక్కడి ఓ కాలేజీలో 12వ తరగతి చదువుతోంది. చిన్నతనం నుంచి చదువులో, ఇతర వ్యాపకాల్లో ఎంతో చురుగ్గా ఉండే ఆమెకు.. అనుకున్నది సాధించాలన్న మొండి పట్టుదల ఎక్కువ! పైగా సామాజిక అంశాలపై ఎక్కువగా దృష్టి పెడుతుంటుంది. పెరిగి పెద్దయ్యే క్రమంలో నెలసరిపై అక్కడి మహిళల్లో నెలకొన్న అపోహల గురించి తెలుసుకున్న ఆమె.. ఎలాగైనా వాళ్ల మనసులో నుంచి వీటిని తొలగించాలని నిర్ణయించుకుంది.

ఆ మూఢ నమ్మకాలను దూరం చేయాలని..!

ఇదే ఆలోచనతో గతేడాది ఏప్రిల్‌లో ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పింది సెహెర్. ‘ఓ సర్వే ప్రకారం.. ప్రస్తుతం మన దేశంలో 88 శాతం మంది మహిళలు నెలసరి సమయంలో క్లాత్‌ వంటివి వాడుతున్నారు. 63 మిలియన్ల మంది అమ్మాయిలకు సరైన టాయిలెట్‌ సదుపాయాలు కూడా లేవు.. ఇందుకు పేదరికం, నిర్లక్ష్యం.. వంటివి కారణమవుతున్నాయి.. తద్వారా చాలామందిలో ప్రత్యుత్పత్తికి సంబంధించిన సమస్యలు, ఇన్ఫెక్షన్లు తలెత్తుతున్నాయి. ఈ విషయాలన్నీ తెలుసుకున్నాక ఊరుకోలేకపోయా. అందుకే సమాజంలో నెలకొన్న ఇలాంటి సున్నితమైన అంశంపై అవగాహన పెంచే ముఖ్యోద్దేశంతో ‘జూన్’ అనే ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించా. నెలసరి సమయంలో శుచి-శుభ్రత పాటించడం, ఆరోగ్యకరమైన నెలసరి ఉత్పత్తుల్ని ఉపయోగించడం.. వంటి అంశాలపై ఇక్కడి బాలికలు, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో అవగాహన కల్పిస్తున్నాం.. ఈ కార్యక్రమాన్ని ‘నైటింగేల్‌ ఆఫ్‌ కశ్మీర్’గా పేరుపొందిన రాణి హబ్బా ఖాతూన్‌ జన్మస్థలం చంధారా అనే ప్రాంతం నుంచి మొదలుపెట్టాం..’ అంటూ చెప్పుకొచ్చింది సెహెర్.

పాకెట్‌ మనీతో మొదలుపెట్టి..!

తన పాకెట్‌ మనీతోనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించిన సెహెర్‌.. ప్రస్తుతం నిధులు సమీకరిస్తూ.. నెలసరి పాఠాల్ని మరింతమందికి చేరువ చేస్తోంది. ‘ఇప్పటికీ ఇక్కడ చాలామంది మహిళలు, బాలికలు శ్యానిటరీ న్యాప్‌కిన్లను కొనడాన్ని కూడని పనిగా భావిస్తూ పాత క్లాత్స్‌నే ఉపయోగిస్తున్నారు. దానివల్ల ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో వివరిస్తున్నాం. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి అక్కడి బాలికల్లో రుతుచక్రం, దానివల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిళ్ల గురించి అవగాహన కల్పిస్తున్నాం. నెలసరి అనేది అమ్మాయిలకు సంబంధించిన అంశమే అయినా.. సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలు, దీనిపై నెలకొన్న వివక్ష తొలగిపోవాలంటే.. అబ్బాయిలకూ దీనిపై కొంత అవగాహన అవసరం. అందుకే స్కూళ్లలో నిర్వహించే ప్రత్యేక సెషన్స్‌లో బాలికలతో పాటు బాలురనూ భాగం చేస్తుంటాం. సెషన్‌ ముగిశాక శ్యానిటరీ న్యాప్‌కిన్లనూ అందిస్తున్నాం. నా పాకెట్‌ మనీతోనే ఈ సంస్థను ప్రారంభించినా.. ఇప్పుడు నిధులు సమీకరిస్తూ సేవల్ని మరింతగా విస్తరించే ప్రయత్నం చేస్తున్నాం..’ అంటోంది సెహెర్.

ప్రస్తుతం నెలసరితో పాటు మానసిక ఆరోగ్యం, వాతావరణ మార్పులు-పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక స్వాతంత్ర్యం.. వంటి అంశాల పైనా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ సామాజిక చైతన్యం కలిగిస్తోంది సెహెర్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్