Japnit Ahuja : మాతృభాషలో కోడింగ్‌ పాఠాలు!

కోడింగ్‌.. ఇప్పటికీ దీన్నో కఠినమైన సబ్జెక్టుగా భావిస్తారు చాలామంది. దీన్ని నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నా ఆర్థిక, వ్యక్తిగత కారణాల వల్ల కోడింగ్‌పై పట్టు సాధించలేకపోతుంటారు మరికొందరు అమ్మాయిలు. అలాంటి పేద అమ్మాయిలకు ఉచితంగా కోడింగ్‌ పాఠాలు నేర్పుతోంది దిల్లీకి చెందిన జప్నిత్‌ అహుజా. 

Published : 20 Apr 2024 12:54 IST

(Photos: Instagram)

కోడింగ్‌.. ఇప్పటికీ దీన్నో కఠినమైన సబ్జెక్టుగా భావిస్తారు చాలామంది. దీన్ని నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నా ఆర్థిక, వ్యక్తిగత కారణాల వల్ల కోడింగ్‌పై పట్టు సాధించలేకపోతుంటారు మరికొందరు అమ్మాయిలు. అలాంటి పేద అమ్మాయిలకు ఉచితంగా కోడింగ్‌ పాఠాలు నేర్పుతోంది దిల్లీకి చెందిన జప్నిత్‌ అహుజా. కోడింగ్‌, మెషీన్‌ లెర్నింగ్‌పై చిన్న వయసు నుంచే ఆసక్తి చూపిన ఆమె.. ఈ కంప్యూటర్‌ భాషలపై పట్టు పెంచుకోవడంతో పాటు టెక్నాలజీ రంగంలోనే తన కెరీర్‌ని ప్రారంభించింది. అప్పుడర్థమైందామెకు.. ఈ రంగంలో అమ్మాయిల సంఖ్య ఎంత తక్కువగా ఉందో! ఈ అసమానతల్ని తొలగించాలన్న సంకల్పంతోనే లాభాపేక్ష లేని సంస్థను స్థాపించి.. ఈ వేదికగా అమ్మాయిలకు కోడింగ్‌ పాఠాలు నేర్పుతోన్న జప్నిత్‌ స్ఫూర్తి ప్రయాణమిది!

23 ఏళ్ల జప్నిత్‌ దిల్లీలో పుట్టి పెరిగింది. ‘ఒంటారియో టెక్‌ యూనివర్సిటీ’లో కంప్యూటర్‌ సైన్స్‌లో ఉన్నత విద్యనభ్యసించింది. చిన్న వయసు నుంచే చదువులో చురుగ్గా రాణించే జప్నిత్‌ బాలమేధావిగానూ గుర్తింపు పొందింది. ఆరో తరగతిలో ఉన్నప్పట్నుంచే కోడింగ్‌పై పట్టు సాధించిన ఆమె.. తనకున్న నైపుణ్యాలతో సొంతంగానే వెబ్‌సైట్లు డిజైన్‌ చేసేది. ఇలా ఇంత చిన్న వయసులోనే ఆమె ప్రతిభను చూసి ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యపోయేవారు.

ఆ క్లబ్‌లో నేనొక్కదాన్నే!

‘చిన్న వయసు నుంచే ప్రపంచంలో ఉన్న బాల మేధావుల గురించి తెలుసుకొని స్ఫూర్తి పొందేదాన్ని. ఈ క్రమంలోనే కోడింగ్‌, మెషీన్‌ లెర్నింగ్‌పై నాకున్న ఇష్టాన్ని గుర్తించా. స్కూల్‌ నుంచి ఇంటికి రాగానే.. నాకున్న సాంకేతిక పరిజ్ఞానంతో వివిధ రకాల వెబ్‌సైట్లు సొంతంగా డిజైన్‌ చేసేదాన్ని. అవి చూసి అమ్మానాన్నలు ఆశ్చర్యపోయేవారు. నన్ను మరింతగా ప్రోత్సహించేవారు. నాన్నైతే నాసాలో పనిచేసే మహిళా శాస్త్రవేత్తల గురించి కథలుగా చెప్పేవారు. వాళ్ల జీవితాలూ నాలో స్ఫూర్తి నింపాయి. ఎనిమిదో తరగతిలో ఉండగానే.. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా. ఈ క్రమంలోనే ఓ కంప్యూటర్‌ క్లబ్‌లో చేరా. ఇక్కడ నాలా ఎంతోమంది అమ్మాయిలు ఉంటారనుకున్నా. కానీ వందలాది మంది అబ్బాయిల మధ్య నేనొక్కదాన్నే అమ్మాయిని. పైగా వాళ్లందరూ నాకంటే నాలుగైదేళ్లు పెద్ద వారు. నా ఐడియాలు వాళ్లతో పంచుకోవడం, వాళ్ల ఆలోచనలేంటో తెలుసుకోవడం.. వంటివి చేసినా ఇంతమంది అబ్బాయిల మధ్య నేనొక్కదాన్నే కావడంతో ఒక్కోసారి అసౌకర్యంగా అనిపించేది. ఈ క్రమంలోనే సాంకేతిక రంగంలో అమ్మాయిల సంఖ్య తక్కువగా ఎందుకుందో తెలుసుకొనే ప్రయత్నం చేశా. చాలామంది తమకు ఆసక్తి ఉన్నా తగిన సపోర్ట్‌ లేక, ఆర్థిక కారణాలతో మరికొందరు ఈ రంగంలోకి రాలేకపోతున్నారన్న విషయం నాకు అర్థమైంది. ఈ అడ్డంకుల్ని తొలగించడానికి నేనే స్వయంగా కోడింగ్‌ వర్క్‌షాప్స్‌ నిర్వహించడం మొదలుపెట్టా..’ అంటోంది జప్నిత్‌.

స్కాలర్‌షిప్స్‌ వెల్లువ!

పదో తరగతి పూర్తికాగానే సింగపూర్‌ ప్రభుత్వం అందించిన స్కాలర్‌షిప్‌తో అక్కడే ఉన్నత విద్యనభ్యసించిన జప్నిత్‌.. అటు చదువుకుంటూనే ఇటు మెషీన్‌ లెర్నింగ్‌పై అధ్యయనం కూడా చేసింది. ఈ క్రమంలోనే తన పరిశోధన పత్రం ప్రచురితమైంది. అలాగే అక్కడి విద్యాశాఖ అందించిన పలు అవార్డులు-రివార్డులు కూడా ఆమె సొంతమయ్యాయి. ఇవే కాదు.. టెక్నాలజీపై ఆమెకున్న నైపుణ్యాలకు గుర్తింపుగా పలు ప్రముఖ టెక్నాలజీ సంస్థల నుంచి టెక్నాలజీ స్కాలర్‌షిప్స్‌ని కూడా అందుకుంది జప్నిత్‌. ఇలా ఓవైపు చదువుకుంటూనే.. మరోవైపు కోడింగ్‌, మెషీన్‌ లెర్నింగ్‌పై పూర్తిస్థాయిలో పట్టు సాధించిన ఆమె.. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతులకు చేరువ చేయాలని 2017లో ‘గో గర్ల్‌’ పేరుతో లాభాపేక్ష లేని ఓ సంస్థను స్థాపించింది. పేద, ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిలకు ఉచితంగా కోడింగ్‌, మెషీన్‌ లెర్నింగ్‌ పాఠాలు చెప్పే వేదిక ఇది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఈ సంస్థ సేవలందిస్తోంది.

ప్రత్యేకత అదే!

సాధారణంగా కోడింగ్‌ పాఠాలు ఇంగ్లిష్‌లోనే బోధిస్తారు. కానీ అందరికీ ఈ భాష రావచ్చు.. రాకపోవచ్చు. అందుకే తమ వద్దకొచ్చే అమ్మాయిలకు వారి మాతృభాషలోనే పాఠాలు బోధిస్తోంది జప్నిత్‌. ఆయా రాష్ట్రాల నుంచి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌, సాంకేతికతపై పట్టున్న వారిని వలంటీర్లుగా రిక్రూట్‌ చేసుకుంటూ.. వారితోనే ఆ రాష్ట్ర మాతృభాషలో పాఠాలు చెప్పిస్తోందామె. స్థానిక స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ పాఠశాలలతో మమేకమవుతూ.. కోడింగ్‌ వర్క్‌షాప్స్‌, టీచింగ్‌ ప్రోగ్రామ్స్‌.. వంటివి నిర్వహిస్తోంది జప్నిత్‌. ప్రస్తుతం వంద మంది వలంటీర్లతో నడుస్తోన్న ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 500లకు పైగా వర్క్‌షాప్స్‌ నిర్వహించారు.. 2 వేల మందికిపైగా అమ్మాయిలు కోడింగ్‌పై పట్టు పెంచుకున్నారు. వీరిలో చాలామంది ప్రముఖ టెక్‌ కంపెనీల్లో ఉద్యోగాలూ సాధించారు.

‘ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి సాంకేతికతకు ఉంది. అందుకే ఈ రంగంలో పురుషులతో సమానంగా స్త్రీలూ రాణించాలి. దేశంలో ఈ సమానత్వం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా..’ అంటోన్న ఈ యువ టెకీ ప్రస్తుతం కెనడాలో స్థిరపడింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్