Kajal: వాడి పెంపకం విషయంలో అస్సలు రాజీ పడను!

పాపాయి బోసి నవ్వులతో ఇల్లంతా కళకళలాడిపోతుంటుంది. వాళ్ల ఆలనా పాలనలో పడిపోతే మనకు సమయమే తెలియదు.. గంటలు, రోజులు, నెలలు.. కొవ్వొత్తిలా ఇట్టే కరిగిపోతాయి. ప్రస్తుతం తన జీవితంలోనూ కాలం ఇలా వేగంగా పరిగెడుతుందంటోంది టాలీవుడ్‌ బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌. ఈ ఏడాది ఏప్రిల్‌లో నీల్‌ అనే కొడుక్కి జన్మనిచ్చిన....

Published : 22 Oct 2022 16:18 IST

(Photos: Instagram)

పాపాయి బోసి నవ్వులతో ఇల్లంతా కళకళలాడిపోతుంటుంది. వాళ్ల ఆలనా పాలనలో పడిపోతే మనకు సమయమే తెలియదు.. గంటలు, రోజులు, నెలలు.. కొవ్వొత్తిలా ఇట్టే కరిగిపోతాయి. ప్రస్తుతం తన జీవితంలోనూ కాలం ఇలా వేగంగా పరిగెడుతుందంటోంది టాలీవుడ్‌ బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌. ఈ ఏడాది ఏప్రిల్‌లో నీల్‌ అనే కొడుక్కి జన్మనిచ్చిన ఈ అందాల తార.. ప్రస్తుతం అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోంది. మరోవైపు తన వృత్తికీ సమ ప్రాధాన్యమిస్తోంది. అయితే సందర్భం వచ్చినప్పుడల్లా అమ్మతనంలోని మాధుర్యం గురించి పంచుకునే ఈ చందమామ.. తాజాగా తన కొడుక్కి ఆరు నెలలు నిండడంతో మరో పోస్ట్‌ పెట్టింది. ‘అమ్మతనం ఎంత మధురమైందో.. అంత సవాలుతో కూడుకున్నది’ అంటూ కాజల్‌ పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం వైరలవుతోంది.

ఈ ఏడాది ఏప్రిల్‌ 19న నీల్ అనే కొడుక్కి జన్మనిచ్చిన క్షణం నుంచి తనకెదురైన అనుభవాలు, అనుభూతుల్ని సోషల్‌ మీడియా పోస్ట్‌ల రూపంలో ఎప్పటికప్పుడు పంచుకుంటోంది కాజల్‌. ఈ క్రమంలో ఇటీవలే తన కొడుక్కి ఆరు నెలలు నిండడంతో మరో పోస్ట్‌ పెట్టిందీ అందాల అమ్మ. కాలం వేగంగా పరిగెడుతోందంటూ.. అప్పుడే తన కొడుక్కి ఆరు నెలలు నిండాయంటే నమ్మలేకపోతున్నానంటూ మురిసిపోయింది కాజల్.

కన్నా.. నువ్వేం చేసినా నాకు ప్రత్యేకమే!

తన కొడుకు తాజా ఫొటోను పంచుకుంటూ.. ‘నా బిడ్డ నీల్‌ పుట్టి అప్పుడే ఆరు నెలలు గడిచిపోయాయంటే అస్సలు నమ్మలేకపోతున్నా. అమ్మతనం నాలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. నా బాధ్యతని మరింత పెంచింది. అమ్మతనంలోని బాధ్యతల్ని మహిళలు ఎలా నిర్వర్తిస్తారోనని ఒకప్పుడు ఆశ్చర్యపోయిన నేను.. ఇప్పుడు ఓ తల్లిగా బిడ్డ ఆలనా పాలనను సంతృప్తిగా నిర్వర్తించగలుగుతున్నానంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అయితే మరోవైపు వృత్తిపరమైన బాధ్యతల్ని బ్యాలన్స్‌ చేయడం సవాలుగానే అనిపిస్తున్నా.. నా కొడుకు కోసం తగిన సమయం కేటాయించడం, వాడి పెంపకం విషయంలో మాత్రం ఎప్పుడూ రాజీ పడను. కాస్త కష్టంగానే ఉన్నా అమ్మతనం నాకు ఎన్నో అనుభూతుల్ని పంచుతోంది.

(కొడుకు నీల్‌ని ఉద్దేశిస్తూ..) నువ్వు నేలపై పాకడం, దొర్లడం, మొదటిసారి నీకు జలుబు చేసిన క్షణం, పూల్‌లో ఆడుకున్న క్షణాలు.. ఇలా నీకు సంబంధించిన ప్రతి విషయం నాకు ప్రత్యేకమే కన్నా! ఇక నువ్వు కొత్త కొత్త రుచుల్ని టేస్ట్‌ చేయడం కూడా ప్రారంభించేశావ్‌! ఇలా నీ ఆలనలో పడిపోయి నాకు, మీ నాన్నకు సమయమే తెలియట్లేదు. నీకు అమ్మనైనందుకు, నీ ద్వారా జీవితంలో ఇన్ని సంతోషకరమైన క్షణాల్ని ఆస్వాదిస్తున్నందుకు ఆ దేవుడికి థ్యాంక్స్‌ చెప్పుకుంటా. అమ్మతనం ఎంత సవాలుతో కూడుకున్నదో.. అంత అందమైన దశ..’ అంటూ తన మనసులోని భావాల్ని అక్షరీకరించిందీ అందాల అమ్మ.

‘మామ్‌ గిల్ట్‌’ వేధించేది!

తల్లైన కొత్తలో ఒత్తిడి, ఆందోళనలు ప్రతి ఒక్కరిలోనూ సహజం. అలాగే తానూ ఈ విషయంలో కొంత అసౌకర్యానికి గురయ్యానంటోంది కాజల్‌. ఒకానొక దశలో బాబును ఇంట్లో వదిలి షూటింగ్స్‌కి వెళ్లినప్పుడు ఒక రకమైన అపరాధ భావన (మామ్‌ గిల్ట్‌) తనను వేధించేదంటూ మరో సందర్భంలో చెప్పుకొచ్చిందీ అందాల అమ్మ.

‘వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ ఎంత సవాలుతో కూడుకున్నదో నీల్‌ పుట్టాకే నాకు అర్థమైంది. కెరీర్‌ పరంగా నేను పూర్తి చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. వాటి కోసం ప్లాన్‌ చేసుకునే క్రమంలోనే అమ్మనయ్యా. ఇక తొలి 40 రోజులు మా అమ్మ ఒత్తిడితో బయటికి వెళ్లలేని పరిస్థితి! కానీ ఆ తర్వాత కొన్నిసార్లు ఇంటి నుంచే పనిచేయాల్సి వచ్చింది. ఓ గదిలో నా బాబును అమ్మ చూసుకుంటే.. నేను మరో గదిలో షూటింగ్‌లో పాల్గొనేదాన్ని. ఇది కాస్త కష్టంగానే అనిపించినా ఇష్టంతో చేశా. ఆ తర్వాత చిన్న చిన్న షూటింగ్స్‌ కోసం బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు.. నీల్‌ని ఇంటి వద్ద వదిలి వెళ్లడానికి మనసొప్పేది కాదు. మొదట్లో బయటికి వెళ్లిన ప్రతిసారీ అమ్మగా నేను నా బుజ్జాయికి తగిన సమయం కేటాయించలేకపోతున్నానన్న అపరాధ భావన (మామ్‌ గిల్ట్‌) నన్ను వేధించేది. ఈ సమస్యతో నాకు జిమ్‌కి వెళ్లడమూ కష్టంగానే మారింది..’ అంది కాజల్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్