Lesbian Couple : ప్రేమించుకున్నారు.. ప్రేమను గెలిపించుకున్నారు!

ప్రేమించడం ఒకెత్తయితే.. తమ ప్రేమకు పెద్దల్ని ఒప్పించడం మరో ఎత్తు! సాధారణంగానే ఓ అమ్మాయి-అబ్బాయి ప్రేమకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడానికి పెద్దలు అంత సులభంగా ఒప్పుకోరు. అలాంటిది సంస్కృతీ సంప్రదాయాలకు వ్యతిరేకమని కొందరు భావించే స్వలింగ జంట ప్రేమను, ఈ తరహా వివాహాల్ని....

Published : 02 Dec 2022 14:17 IST

(Photos: Instagram)

ప్రేమించడం ఒకెత్తయితే.. తమ ప్రేమకు పెద్దల్ని ఒప్పించడం మరో ఎత్తు! సాధారణంగానే ఓ అమ్మాయి-అబ్బాయి ప్రేమకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడానికి పెద్దలు అంత సులభంగా ఒప్పుకోరు. అలాంటిది సంస్కృతీ సంప్రదాయాలకు వ్యతిరేకమని కొందరు భావించే స్వలింగ జంట ప్రేమను, ఈ తరహా వివాహాల్ని అసలే అంగీకరించరు. కేరళకు చెందిన ఓ లెస్బియన్‌ కపుల్‌కూ వారి ఇరు కుటుంబాల నుంచి ఇలాంటి వ్యతిరేకతే ఎదురైంది. అయినా వారు వెనక్కి తగ్గలేదు. తమ ప్రేమను గెలిపించుకోవడానికి కోర్టు మెట్లెక్కారు. ఐదు నెలల ఎదురుచూపులకు తెరదించుతూ.. ఇటీవలే న్యాయస్థానం వీరిద్దరూ కలిసుండేందుకు అంగీకరించింది. ఇలా చట్టం సాక్షిగా తమ ప్రేమను గెలిపించుకున్న ఈ స్వలింగ జంట ప్రేమకథ, ఫొటోషూట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

ప్రేమలో పడ్డ ప్రతి ఒక్కరూ.. తమ ప్రేమను గెలిపించుకోవడంతో పాటు పెద్దల అంగీకారంతో ఒక్కటవ్వాలనుకుంటారు. చాలా జంటల విషయంలో ఇది అంత సులభంగా పూర్తయ్యే వ్యవహారం కాదు. కేరళకు చెందిన అధిలా నసరిన్‌, ఫాతిమా నూరా.. అనే స్వలింగ జంట తమ ప్రేమ విషయంలోనూ ఇలాంటి అనుభవాలే ఎదుర్కొంది.

స్కూల్లో కలుసుకొని..!

‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌’ అంటారు కదా! అధిలా, ఫాతిమా ప్రేమ కూడా ఇలా తొలి చూపులోనే పుట్టింది. హైస్కూల్లో చదువుకునే క్రమంలో వీరిద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడింది. ఇక చదువు పూర్తయ్యాక పెరిగిన దూరం కాస్తా ఇద్దరినీ మరింత దగ్గర చేసింది. ఒకరి మనసులో మరొకరున్నారని తెలుసుకునేలా చేసింది. అయితే వీరిద్దరూ కలిసి బతకడానికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోలేదు. సరికదా ఇద్దరినీ విడదీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కూడా! ఇక ఈ క్రమంలో ఎంతో మానసిక ఒత్తిడిని అనుభవించిన ఈ జంట.. చివరికి ఈ ఏడాది జూన్‌లో కేరళ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. తామిద్దరూ కలిసుండేందుకు అనుమతించమని అందులో కోరింది. దీనిపై ఐదు నెలల పాటు విచారణ సాగించిన కోర్టు.. ఇటీవలే ఈ స్వలింగ జంట ప్రేమకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే భారత్‌లో స్వలింగ వివాహాల్ని ఇంకా చట్టబద్ధం చేయకపోవడంతో ఇద్దరూ కలిసుండేందుకు మాత్రమే కోర్టు అనుమతిచ్చింది. ఇలా కోర్టు తీర్పుతో ఉబ్బితబ్బిబ్బయిన ఈ జంట.. తాజాగా ఓ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌తో తమ సంతోషాన్ని అందరితో పంచుకుంది.

ఈ ఐడియా నచ్చింది.. అందుకే!

ఇక ఫొటోషూట్‌లో భాగంగా.. ఈ ఇద్దరు అమ్మాయిలు సంప్రదాయబద్ధమైన లెహెంగాల్లో మెరిసిపోయారు. ఓ బీచ్‌ ఒడ్డున ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికపై దండలు మార్చుకుంటూ, ఉంగరాలు మార్చుకుంటూ, ముద్దులాడుతూ.. తమ ప్రేమ గెలుపును సెలబ్రేట్‌ చేసుకుందీ జంట. ‘ఈ ఫొటోషూట్‌ ఐడియా మాకు నచ్చింది. అందుకే ఇలా మా ప్రేమను సెలబ్రేట్‌ చేసుకున్నాం. ప్రస్తుతానికి మా ప్రేమకు ఇంకా పెళ్లితో పీటముడి పడలేదు.. కానీ త్వరలోనే అదీ నెరవేర్చుకోవాలనుకుంటున్నాం..’ అంటూ తమ సంతోషానికి అక్షర రూపమిచ్చిందీ అందాల జంట. ప్రస్తుతం ఈ జంట ప్రేమకథ, ఫొటోషూట్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్