కాదు.. లేదంటూనే ఒక్కటైపోయారు!

మౌనం అర్ధాంగీకారం అంటుంటారు. తమ ప్రేమ గురించి ఎప్పుడు అడిగినా బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ కేఎల్‌ రాహుల్‌, అతియా శెట్టి.. ఇలాగే దాటేసే వారు. వేడుకైనా, వెకేషన్‌ అయినా చెట్టపట్టాలేసుకొని అక్కడ వాలిపోయే ఈ జంట.. కలిసి దిగిన ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ తామిద్దరం ప్రేమలో ఉన్నామని....

Published : 24 Jan 2023 17:50 IST

(Photos: Instagram)

మౌనం అర్ధాంగీకారం అంటుంటారు. తమ ప్రేమ గురించి ఎప్పుడు అడిగినా బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ కేఎల్‌ రాహుల్‌, అతియా శెట్టి.. ఇలాగే దాటేసే వారు. వేడుకైనా, వెకేషన్‌ అయినా చెట్టపట్టాలేసుకొని అక్కడ వాలిపోయే ఈ జంట.. కలిసి దిగిన ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ తామిద్దరం ప్రేమలో ఉన్నామని చెప్పకనే చెప్పేవారు. అంతేకానీ.. తమ ప్రేమబంధం గురించి ఏనాడూ అధికారికంగా ప్రకటించలేదు. ఇలా తమ ప్రేమను అత్యంత గోప్యంగా ఉంచిన ఈ జంట.. ఇప్పుడు పెళ్లినీ అంతే రహస్యంగా జరుపుకొని అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేసింది. తమ మూడేళ్ల ప్రేమబంధాన్ని తాజాగా శాశ్వతమైన వైవాహిక బంధంగా మార్చుకున్న ఈ లవ్లీ కపుల్‌ ప్రేమకథ ఓ ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీకి ఏమాత్రం తీసిపోదు.

బాలీవుడ్‌కు, క్రికెట్‌కు ఏదో తెలియని అవినాభావ సంబంధం ఉన్నట్లుంది. ఇప్పటికే చాలామంది బాలీవుడ్‌ భామలు క్రికెటర్లను వివాహం చేసుకోవడం మనం చూశాం. ఇప్పుడు అతియా-రాహుల్‌లు మరోసారి ఈ విషయం నిరూపించారు. మూడేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట.. తాజాగా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టి అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేసింది.

తొలిచూపులోనే..!

‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌..’ అంటారు. అతియా-రాహుల్‌ ప్రేమ కూడా ఇలా తొలిచూపులోనే పుట్టిందట! 2019లో ఓ వేడుకలో భాగంగా ఇద్దరి కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా కలుసుకున్న ఈ జంట.. చూడగానే మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. అయితే ఇరువురి మనసుల్లో ఉన్న ఇష్టాన్ని ఒకరికొకరు వ్యక్తం చేసుకోవడానికి మాత్రం కొన్ని నెలలు పట్టిందట! అలా తొలిచూపులోనే ప్రేమలో పడిన ఈ జంట.. ఎక్కడికెళ్లినా కలిసే మీడియా కంట పడేవారు. అయినా తమ అనుబంధం గురించి మాత్రం పెదవి విప్పలేదు. అయితే ఓసారి అతియా తన గ్లామరస్‌ ఫొటో ఒకటి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడంతో.. విక్రమ్‌ ఫడ్నిస్‌ అనే డిజైనర్‌ అతియాను టీజ్‌ చేస్తూ.. ‘ఏంటీ.. ఈ మధ్య నువ్వు చాలా హ్యాపీగా కనిపిస్తున్నావ్‌? పద కేఎల్‌ (కౌలాలంపూర్‌)కి వెళ్దాం..’ అంటూ కామెంట్‌ చేశారు. దీంతో అతియా కేఎల్‌ రాహుల్‌తో ప్రేమలో ఉందని ఫ్యాన్స్‌కి హింట్‌ ఇచ్చినట్లయింది. ఇక అప్పట్నుంచి ఇద్దరూ కలిసి దిగిన ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం, ఎక్కడికెళ్లినా కలిసే కెమెరా కంట పడడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఇదే విషయం గురించి ఇద్దరినీ అడిగితే.. కాదని, లేదని అసలు విషయాన్ని దాటేస్తూ.. మరికొన్నిసార్లు మౌనంగా ఉంటూ.. తమ ప్రేమ విషయాన్ని గోప్యంగా ఉంచుతూ జాగ్రత్తపడిందీ జంట.

ఫొటోలే సాక్ష్యాలు!

తమ ప్రేమ విషయం దాటేస్తూ వచ్చినా.. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలు పోస్ట్‌ చేయడం మాత్రం ఆపలేదీ క్యూట్‌ కపుల్‌. ఇక పుట్టినరోజు, ఇతర ప్రత్యేక సందర్భాల్ని కలిసి జరుపుకోవడం.. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం, కొత్త ఏడాదిని జరుపుకోవడానికి కలిసి విదేశాలకు వెళ్లడం, 2021 జూన్‌లో.. భారత్‌ ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న సమయంలో.. మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు అతియా స్టాండ్స్‌లో కెమెరా కంట చిక్కడం, చెట్టపట్టాలేసుకొని అక్కడి వీధుల్లో షికారు చేయడం.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈ మూడేళ్లలో ఇద్దరూ కలిసి గడిపిన క్షణాలు లెక్కకు మిక్కిలే! ఇలా ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలే వారి ప్రేమకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచాయని చెప్పచ్చు.

కష్టాల్లోనూ.. తోడుగా!

ప్రేమంటే సుఖాల్నే కాదు.. కష్టాల్నీ పంచుకోగలగాలి. ఓ సందర్భంలో ఇదే విషయం నిరూపించి చూపించింది అతియా. గతేడాది తొడ గాయం కారణంగా.. చికిత్స కోసం జర్మనీ వెళ్లిన రాహుల్‌ వెంట తాను కూడా వెళ్లింది అతియా. ఆపరేషన్‌, ఆపై కోలుకోవడంలోనూ తన ఇష్టసఖుడికి అండగా నిలిచింది. ఇలా వీళ్ల మధ్య అనుబంధం మరింతగా పెనవేసుకుందని చెప్పచ్చు. అతియా సోదరుడు అహాన్‌ నటించిన ‘తడప్‌’ చిత్ర స్క్రీనింగ్‌లో భాగంగా తొలిసారి ఇద్దరూ కలిసి మీడియాకు పోజిచ్చారు అతియా-రాహుల్‌. పలు ప్రకటనల్లోనూ ఇద్దరూ కలిసి నటించారు. ఇక ఈసారి న్యూ ఇయర్‌ కోసం దుబాయ్‌ వెళ్లిన ఈ జంట పెళ్లికి సంబంధించిన వార్తలు గత కొంత కాలంగా చక్కర్లు కొడుతూ వస్తున్నాయి. అతియా తండ్రి సునీల్‌ శెట్టి కూడా మొన్నామధ్య ఓ షోలో భాగంగా వీళ్ల పెళ్లి గురించి సానుకూల ప్రకటన చేయడంతో.. ఇక ఈ ఏడాది తొలి వివాహం ఈ జంటదే అనుకున్నారు ఫ్యాన్స్‌. తాజాగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి అభిమానుల అంచనాల్ని నిజం చేసిందీ అందాల జంట.

మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌!

ఈ మూడేళ్లలో ఏనాడూ తమ ప్రేమను అధికారికంగా ప్రకటించలేదు అతియా-రాహుల్‌. ఇక ఇప్పుడు వివాహాన్నీ గోప్యంగానే చేసుకొని.. ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేశారీ లవ్‌బర్డ్స్‌. ముంబయిలో అతి తక్కువమంది బంధువులు, స్నేహితుల మధ్య ఒక్కటైందీ జంట. పెళ్లి దుస్తుల్లో ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’లా మెరిసిపోయారు రాహుల్‌-అతియా. రాహుల్‌ ఐవరీ షేర్వాణీలో ముస్తాబవగా.. అతియా భారీ వెడ్డింగ్‌ లెహెంగాలో మెరుపులు మెరిపించింది. రోజ్‌ పింక్‌ చికంకారీ లెహెంగాను ఎంచుకున్న ఈ ముద్దుగుమ్మ.. సింపుల్‌ జ్యుయలరీ, తక్కువ మేకప్‌తో ఆకట్టుకుంది. అడుగడుగునా ఫ్లోరల్‌ మోటివ్స్‌తో రూపొందించిన ఈ లెహెంగాను డిజైన్‌ చేయడానికి సుమారు పది వేల గంటల సమయం పట్టిందట! అయితే ఇన్నాళ్లూ తమ ప్రేమ విషయం చెప్పకపోయినా.. తమ పెళ్లి ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోయిందీ అందాల జంట. ‘డియర్‌.. ప్రేమించడం ఎలాగో నీ నుంచే నేర్చుకున్నా..’ అంటూ అతియా పెట్టిన ఎమోషనల్‌ పోస్ట్‌ ప్రస్తుతం వైరలవుతోంది.

హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌ స్వీట్‌ కపుల్‌!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్