స్నేహితులం అంటూనే.. పెళ్లి పీటలెక్కేశారు!

ఏ బంధమైనా స్నేహంతోనే మొదలవుతుంది.. తమ అనుబంధం కూడా అంతే అంటున్నారు లెస్బియన్‌ కపుల్‌ మరియానా వరేలా, ఫ్యాబియోలా వాలెంటిన్‌. ఓ అందాల పోటీలో కలుసుకొని స్నేహితులైన ఈ ఇద్దరు సుందరీమణులు.. రెండేళ్ల పాటు గాఢమైన ప్రేమ బంధంలో మునిగితేలారు. ఇటీవలే తమ ప్రేమకు పెళ్లితో.....

Published : 04 Nov 2022 20:10 IST

(Photo: Instagram)

ఏ బంధమైనా స్నేహంతోనే మొదలవుతుంది.. తమ అనుబంధం కూడా అంతే అంటున్నారు లెస్బియన్‌ కపుల్‌ మరియానా వరేలా, ఫ్యాబియోలా వాలెంటిన్‌. ఓ అందాల పోటీలో కలుసుకొని స్నేహితులైన ఈ ఇద్దరు సుందరీమణులు.. రెండేళ్ల పాటు గాఢమైన ప్రేమ బంధంలో మునిగితేలారు. ఇటీవలే తమ ప్రేమకు పెళ్లితో పీటముడి వేశారు. ఈ విషయాన్ని ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో పంచుకునేసరికి.. ఆశ్చర్యపోవడం అభిమానుల వంతైంది. ఎందుకంటే చెట్టపట్టాలేసుకొని కలియతిరుగుతూ ప్రాణ స్నేహితుల్లా ఉన్న వీరు.. పెళ్లి చేసుకోవడమేంటని చాలామంది ఈ విషయాన్ని నమ్మలేకపోయారు. మరి, తామిద్దరం ప్రేమలో ఉన్నామని ఎప్పటికప్పుడూ హింట్‌ ఇస్తూనే ఒక్కటైన ఈ స్వలింగ జంట ప్రేమ ముచ్చట్లేంటో మనమూ తెలుసుకుందాం రండి..

మరియానా వరేలా 2020లో ‘మిస్‌ అర్జెంటీనా’ కిరీటం గెలుచుకుంది. అదే ఏడాది ‘మిస్‌ ప్యూర్టోరికో’గా నిలిచింది ఫ్యాబియోలా వాలెంటిన్‌. వీరిద్దరూ 2020లో నిర్వహించిన ‘మిస్ గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌’ పోటీల్లో పాల్గొన్నారు. టాప్‌-10లోనూ చోటు దక్కించుకున్నారు.

అదే ప్రేమని మాకర్థమైంది!

వీరిద్దరూ ఈ అందాల పోటీ గెలవకపోయినా.. ఒకరి మనసు మరొకరు గెలుచుకున్నారు. ‘మిస్‌ గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌ పోటీల్లో భాగంగా ఎన్నో దశల్ని దాటాం.. టాప్‌-10లో నిలిచాం. అయితే ఈ క్రమంలో మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. పోటీ ముగిసి ఎవరి దేశం వారు చేరినా.. ఇద్దరి మధ్య ఏదో ఆత్మీయ అనుబంధం పెనవేసుకుంది. అదే ప్రేమని త్వరలోనే మాకు అర్థమైంది. కానీ ఈ విషయం అప్పుడే బయటి ప్రపంచానికి తెలియనివ్వకూడదని నిర్ణయించుకున్నాం. అందుకే రెండేళ్ల పాటు ప్రేమించుకొని, ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్న తర్వాత అక్టోబర్‌ 28న పెళ్లితో ఒక్కటయ్యాం. ప్యూర్టోరికోలో మా వివాహం జరిగింది. ఇన్నాళ్లూ రహస్యంగా దాచిన మా ప్రేమ, పెళ్లి గురించి అందరితో పంచుకోవడానికి ఈ శుభ సందర్భాన్ని మించిన మంచి తరుణం లేదనిపించింది..’ అంటూ ఓ లఘు వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారీ లెస్బియన్‌ కపుల్‌. ప్రేమలో తాము పొందిన మధురానుభూతులు, ఇద్దరి మధ్య జరిగిన ప్రేమ ప్రతిపాదన, నిశ్చితార్థం, పెళ్లి.. వంటివన్నీ ఈ వీడియోలో పొందుపరిచారీ లవర్స్.

ఎక్కడికెళ్లినా.. చెట్టపట్టాలేసుకొనే..!

తామిద్దరం ప్రేమలో ఉన్నామని గ్రహించిన ఈ జంట.. అప్పట్నుంచి ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా తమ అనుబంధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇద్దరూ కలిసి వివిధ దేశాలు, పర్యటక ప్రాంతాల్ని సందర్శించారు. సందర్భమేదైనా చెట్టపట్టాలేసుకొని అక్కడ వాలిపోయేవారు. కొన్నిసార్లు తమ అవుట్‌ఫిట్స్‌ని మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ చేస్తూ ఆకట్టుకునేవారు. ఈ అనుభూతులన్నీ ఫొటోలు, వీడియోల్లో బంధిస్తూ.. వాటిని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోయిందీ అందాల జంట.

హింట్‌ ఇచ్చినా.. పసిగట్టలేకపోయారు!

ఇక ఈ ఫొటోలతో పాటు.. పుట్టినరోజులు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోల్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ.. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొనేవారు. ఈ క్రమంలో ఓసారి ఓ ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్న ఫ్యాబియోలా.. ‘నీతో స్నేహం ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. ఇది నాకెంతో ప్రత్యేకం!’ అంటూ క్యాప్షన్‌ పెట్టింది. ఇక మరియానా పుట్టినరోజు సందర్భంగా.. ‘నీ జీవితంలో నన్ను భాగం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. నువ్వు నాకెంతో అపురూపం.. మన స్నేహం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి..’ అంటూ మరో పోస్ట్‌ పెట్టింది ఫ్యాబియోలా. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరికొరు ‘ఐ లవ్యూ’ చెప్పుకుంటూ రీపోస్టులు కూడా చేసుకున్నారు. ఇలా తమ అనుబంధాన్ని అటు రహస్యంగా ఉంచుతూనే.. మరోవైపు పలుమార్లు హింట్స్‌ ఇచ్చినా అభిమానులు తెలుసుకోలేకపోయారు. వీరి అన్యోన్యతను చూసి ఇద్దరిదీ గాఢమైన స్నేహబంధం అనుకున్నారే తప్ప.. అంతకుమించిన ప్రేమబంధమని ఊహించుకోలేకపోయారు. అందుకే తాము వివాహం చేసుకున్నామని ప్రకటించగానే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

ఏదేమైనా.. తమ ప్రేమతో, పెళ్లితో అభిమానుల్ని ఆశ్చర్యపరిచిన ఈ జంటకు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్