Mrs & Mrs: ‘తనెప్పటికీ నాదే’.. అంటూ ఒక్కటైపోతున్నారు!

ప్రేమ.. ఇది ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటుంటారు ప్రేమ కవులు. అయితే ప్రేమంటే ఒక అబ్బాయికి-అమ్మాయికి మధ్య పుట్టే తియ్యటి భావనేనా? ఒక అమ్మాయికి మరో అమ్మాయిపై, లేదంటే ఒక అబ్బాయికి మరో అబ్బాయిపై....

Published : 04 Mar 2023 20:34 IST

(Photos: Instagram)

ప్రేమ.. ఇది ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటుంటారు ప్రేమ కవులు. అయితే ప్రేమంటే ఒక అబ్బాయికి-అమ్మాయికి మధ్య పుట్టే తియ్యటి భావనేనా? ఒక అమ్మాయికి మరో అమ్మాయిపై, లేదంటే ఒక అబ్బాయికి మరో అబ్బాయిపై ప్రేమ పుట్టకూడదా? అంటే ఎందుకు పుట్టకూడదు.. అంటూ ఇటీవల ఎంతోమంది వివాహ బంధంలోకి కూడా అడుగుపెడుతున్నారు. ఇదే బాటలో పయనిస్తూ తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారు ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్‌ డేనియల్‌ వ్యాట్‌, ఓ మహిళా ఫుట్‌బాల్‌ జట్టు హెడ్‌, ఏజెంట్‌ జార్జ్‌ హాడ్జ్‌. ఈ నేపథ్యంలోనే ‘తనెప్పటికీ నాదే’ అంటూ తన స్వీట్‌హార్ట్‌తో దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ తమ అనుబంధాన్ని బయటపెట్టింది వ్యాట్‌. వీళ్లే కాదు.. ఇలా స్వలింగ వివాహాలు చేసుకున్న సెలబ్రిటీలు ప్రపంచవ్యాప్తంగా మరికొందరున్నారు. వారి గురించి తెలుసుకుందాం రండి..

తనెప్పటికీ నాదే!

స్వలింగ వివాహాల్ని చట్టబద్ధం చేసిన దేశాల్లో ఇంగ్లండ్ కూడా ఒకటి. ఈ క్రమంలోనే తమ ప్రేమను పెళ్లి పీటలెక్కించేందుకు రడీ అయిపోయారు డేనియల్‌ వ్యాట్‌, జార్జ్‌ హాడ్జ్‌. ప్రస్తుతం డేనియల్‌ ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్‌ జట్టులో ఆడుతోంది. సచిన్‌ కొడుకు అర్జున్‌కు ఆమె ప్రాణ స్నేహితురాలు. ఇక జార్జ్‌ సీఏఏ బేస్‌కు చెందిన మహిళల ఫుట్‌బాల్‌ జట్టుకు హెడ్‌గా, ఏజెంట్‌గా కొనసాగుతోంది. గిటార్‌ వాయించడమంటే జార్జ్‌కు చాలా ఇష్టమట! గత నాలుగేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరిద్దరూ.. ఎక్కడికెళ్లినా జంటగానే మీడియా కంటపడేవారు. తమ ఫొటోలు, వీడియోలూ తరచూ సోషల్‌ మీడియాలో పంచుకునేవారు. అయితే తామిద్దరి మధ్య స్నేహానికి మించిన ప్రేమబంధం ఉందని తాజాగా బయటపెట్టిందీ జంట. తామిద్దరం నిశ్చితార్థం చేసుకున్నామంటూ, త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నట్లు తమ ఎంగేజ్‌మెంట్‌ ఫొటోను పంచుకున్నారీ లవ్లీ కపుల్. ‘తనెప్పటికీ నాదే’ అంటూ వ్యాట్‌ సోషల్‌ మీడియాలో తామిద్దరూ ముద్దాడుతోన్న ఫొటోను పంచుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం వీళ్ల ఫొటో నెట్టింట్లో వైరలవుతోంది.

వీళ్లు కూడా..

వీరే కాదు.. గతంలోనే ఇలా స్వలింగ వివాహాలు చేసుకున్న సెలబ్రిటీలు ప్రపంచవ్యాప్తంగా మరికొందరున్నారు.

ఐదేళ్లుగా రిలేషన్‌షిప్‌లో..!

ప్రతి ప్రేమకూ ఓ స్టార్టింగ్‌ పాయింట్‌ ఉంటుంది. అలా మైదానంలోనే తమ ప్రేమ మొదలైందంటున్నారు ఇంగ్లండ్‌కు చెందిన మహిళా క్రికెటర్లు కేథరిన్‌ బ్రంట్‌, నటాలియా స్కివర్. ‘ఆటలో భాగంగానే మేమిద్దరం తొలిసారి కలుసుకున్నాం. తక్కువ కాలంలోనే మా మధ్య ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత సాన్నిహిత్యం పెరిగింది. దాంతో గత ఐదేళ్లుగా ఒకే ఫ్లాట్‌లో కలిసి ఉంటున్నాం. మ్యాచ్‌లకే కాదు.. ఎక్కడికెళ్లినా కలిసే వెళ్తుంటాం.. ఇంట్లో ఉన్నా ఒకరికి నచ్చిన వంటకాలు మరొకరం తయారుచేసి సర్‌ప్రైజ్‌ చేసుకుంటాం. అయితే మా బంధాన్ని మా ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి. అయినా వాళ్లను ఒప్పించే పెళ్లి చేసుకుందామనుకున్నాం.. కానీ అది కుదరక ఇంటి నుంచి బయటికొచ్చేశాం.. ఈ క్రమంలో జట్టు మాకు ఎంతో అండగా నిలిచింది..’ అంటూ తమ ప్రేమ జ్ఞాపకాల్ని పంచుకుంటుంది గత ఏడాదే పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంట. 2017 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన కొన్నాళ్లకు ప్రారంభమైన వీరి స్నేహం, ప్రేమ.. దాదాపు ఐదేళ్ల తర్వాత పెళ్లితో శాశ్వతమైంది.


అండగా ఉండి.. అర్థాంగి అయింది..!

ఇదేమాదిరిగా- న్యూజిలాండ్ క్రికెటర్ హేలే జెన్సన్, ఆస్ట్రేలియాకు చెందిన నికోలా హాన్‌కాక్‌లూ 2019లో లెస్బియన్‌ వివాహం చేసుకున్నారు. ఆస్ట్రేలియాలో ఏటా జరిగే మహిళల బిగ్‌బాష్ లీగ్ తొలి రెండు విడతల్లో ‘మెల్‌బోర్న్ స్టార్స్’ జట్టు తరఫున ఆడిన వీరి మధ్య క్రమంగా ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2013లో న్యూజిలాండ్‌లో, 2018లో ఆస్ట్రేలియాలో లెస్బియన్ వెడ్డింగ్స్‌కి లైన్ క్లియర్ కావడంతో వీరు తమ ప్రేమను పెళ్లి పట్టాలెక్కించారు. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నప్పటికీ పెళ్లికి ముందు తమ ప్రేమను ఎక్కడా బహిర్గతం చేయలేదు. అయితే ఓ ఇంటర్వ్యూలో భాగంగా జెన్సన్ మాట్లాడుతూ.. ‘నేను గాయంతో బాధపడుతూ, జట్టులో చోటు కోల్పోయినప్పుడు హాన్‌కాక్ నాకు ఎంతగానో సహాయపడింది.. అలాంటి ప్రతికూల పరిస్థితిలో తనే నాకు అండగా నిలిచింది..’ అంటూ అర్ధాంగిని ఆకాశానికెత్తేసింది జెన్సన్.


అలా కళ్లూ కళ్లూ కలిశాయి...

మేగన్ స్కట్, జెస్ హోలియోకే.. వీరిద్దరూ ఆస్ట్రేలియాకు చెందిన మేటి క్రికెటర్లు. చాలాకాలం నుంచి ఒకే జట్టులో ఆడుతోన్న వీరి కళ్లూ-కళ్లూ కలిశాయి. సుదీర్ఘకాలంగా తమ ప్రేమాయణాన్ని కొనసాగించిన ఈ జంట.. 2018లో ఆస్ట్రేలియా ప్రభుత్వం స్వలింగ వివాహాల్ని చట్టబద్ధం చేయడంతో 2019లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. అంతేకాదు.. తమ పెళ్లి ఫొటోల్ని సైతం నిర్మొహమాటంగా, ధైర్యంగా సోషల్‌ మీడియాలో పంచుకుందీ జంట. ఇలా బయటే కాదు.. డ్రస్సింగ్ రూమ్‌లో, జట్టులో వీరిద్దరినీ ఒక్కరిగానే భావిస్తారట సహచరులు. ప్రస్తుతం ఈ జంటకు రైలీ లూయీస్‌ స్కట్‌ అనే పాప ఉంది.


మనసంతా నువ్వే!

దక్షిణాఫ్రికా మహిళల జట్టు సారథి, ఆల్ రౌండర్ డేన్ వాన్ నీకెర్క్ పేరు అందరికీ సుపరిచితమే. అదే జట్టులో మేటి క్రీడాకారిణిగా, ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకుంది మారిజానే కాప్. 2009 ప్రపంచకప్‌లో జాతీయ జట్టులో అరంగేట్రం చేసిన నాటి నుంచే కేవలం రెండు రోజుల వ్యవధిలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. అభిప్రాయాలు పంచుకోవడం, అర్థం చేసుకోవడంతో ఇద్దరూ మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలో ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా వీరి బంధం అల్లుకుంది. ఇక వారి ప్రణయానికి పెళ్లే పరిష్కారం అని భావించారు. అనుకున్నదే తడవుగా 2018లో పెళ్లితో ఒక్కటైందీ ముద్దుల జంట. ఆ తర్వాత ఇద్దరూ కలిసి టీ20 ప్రపంచకప్‌లో పాల్గొని.. అంతర్జాతీయ టోర్నీలో ఒకేసారి బ్యాటింగ్‌కు దిగిన తొలి జంటగా రికార్డులకెక్కారీ లెస్బియన్ కపుల్. అనుక్షణం ప్రేమను పంచుకునే ఈ జంట సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరినొకరు ప్రశంసించుకుంటూ తమ మనసు లోతుల్లో దాగున్న ప్రేమను వ్యక్తం చేస్తుంటారు.


ఆట-స్నేహం-ప్రేమ-పెళ్లి

న్యూజిలాండ్‌కు చెందిన అమీ ఎల్లా శాటర్‌వెర్త్, లియా మేరీ మౌరీన్ తుహుహు.. వీరిద్దరూ పేరొందిన మహిళా క్రికెటర్లే. 2010లో మైదానంలోనే వీరి మధ్య స్నేహం ఏర్పడింది.. క్రమంగా ఒకరినొకరు అర్థం చేసుకున్నారు.. ప్రేమించుకున్నారు. అలా ఏడేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట.. 2017లో పెళ్లి పీటలెక్కారు. తమలా స్వలింగ వివాహాలు చేసుకోవాలనుకుంటున్న వారికి సహాయపడేందుకు తమ పెళ్లిని అవకాశంగా ఎంచుకున్నామని, తాము ఇలా చేస్తున్నందుకు ఎంతో గర్విస్తున్నామంటూ అప్పట్లో చెప్పుకొచ్చారీ దంపతులు. అంతేకాదు.. తమ బంధం గురించి ప్రపంచానికి చాటేందుకు ఎప్పుడూ ఇబ్బంది పడలేదంటున్నారీ కివీస్‌ కపుల్‌. వీరిలో అమీ కంటే మేరీ నాలుగేళ్లు చిన్నది. ఇక ఈ జంట 2020లో పండంటి పాపకు జన్మనిచ్చింది.


చెరిగిపోని ప్రేమ!

అమెరికన్ కమెడియన్‌గా, టీవీ వ్యాఖ్యాతగా పేరు పొందారు ఎలెన్ డీజెనెరెస్. అమెరికన్ సిట్‌కాం ‘ఎలెన్ డీజెనెరెస్ షో’ ద్వారా ప్రపంచవ్యాప్త గుర్తింపు సంపాదించిన ఎలెన్.. అమెరికన్-ఆస్ట్రేలియన్ మోడల్ అయిన పోర్షియా డే రోసీతో ప్రేమలో పడ్డారు. నాలుగేళ్ల డేటింగ్ అనంతరం 2008లో లాస్ ఏంజెల్స్‌లో వివాహం చేసుకుందీ జంట. అయితే అప్పుడప్పుడూ వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్నా.. అవి అవాస్తవమని వారు కొట్టిపడేస్తూ తమ ప్రేమ ఎప్పటికీ చెరిగిపోదని చాటుకుంటున్నారీ లవ్లీ కపుల్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్