Relationship Tips : నమ్మకమే నడిపిస్తుంది!

దాంపత్య జీవితం శాశ్వతమైనది. మరి, ఈ సుదీర్ఘ అనుబంధంలో ఆలుమగలిద్దరూ అరమరికల్లేకుండా సంతోషంగా కాపురం చేసుకోవాలంటే.. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండడం ముఖ్యం. అయితే ఇలా అనుబంధంలో నమ్మకానికి ప్రాధాన్యమిచ్చే జంటలు.. కొన్ని విషయాల్లో ఇతరులకు....

Published : 25 Jun 2022 17:16 IST

దాంపత్య జీవితం శాశ్వతమైనది. మరి, ఈ సుదీర్ఘ అనుబంధంలో ఆలుమగలిద్దరూ అరమరికల్లేకుండా సంతోషంగా కాపురం చేసుకోవాలంటే.. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండడం ముఖ్యం. అయితే ఇలా అనుబంధంలో నమ్మకానికి ప్రాధాన్యమిచ్చే జంటలు.. కొన్ని విషయాల్లో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

‘సోషల్‌’కు దూరంగా..!

సోషల్‌ మీడియా ఎంత మంచి చేస్తుందో.. అంత చెడూ చేస్తుంది. ముఖ్యంగా దాంపత్య బంధంలో ఇది చాలా వరకు కలతలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సమయం గడపడం, ప్రతిదీ అందులో పంచుకోవడం, సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా ఇతర జంటలపై ఈర్ష్యతో తాము అవాస్తవ ప్రమాణాలు నిర్దేశించుకోవడం.. వంటివెన్నో కారణమవుతాయంటున్నారు. అయితే ఒకరిపై ఒకరు పూర్తి నమ్మకంతో ఉన్న జంటలు మాత్రం ఇందుకు భిన్నమట! సాధ్యమైనంత వరకు వీళ్లు సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటున్నారని ఓ అధ్యయనం రుజువు చేసింది. ఎక్కువ సమయం భాగస్వామితో గడపడం, ఏ విషయమైనా తనతోనే పంచుకోవడం, సోషల్‌ మీడియాకు ఆకర్షితులు కాకపోవడం.. వంటి లక్షణాలు వీరిలో చూడచ్చు. ఇలాంటి వాళ్లు ప్రతి విషయాన్నీ పాజిటివ్‌గా తీసుకుంటూ.. అటు భాగస్వామినీ సంతోషపెడతారని చెబుతున్నారు నిపుణులు.

పంచాయతీ పెట్టరు!

కొన్ని జంటలు తామిద్దరి మధ్య చిన్న గొడవైనా ఓర్చుకోలేరు. దాని పూర్వాపరాలు కుటుంబ సభ్యులు, స్నేహితులకు చెప్తే గానీ వాళ్ల మనసు కుదుటపడదు. అయితే దీనివల్ల గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నట్లే అవుతుంది. అదే నమ్మకమే పరమావధిగా ముందుకు సాగే జంటలు.. ఇలాంటి గొడవలు, కలతల్ని మూడో వ్యక్తికి తెలియనివ్వకుండా తమకు తామే పరిష్కరించుకుంటారని చెబుతున్నారు నిపుణులు. నిజానికి దీనివల్ల ఒకరిపై ఒకరికి విశ్వాసం, ప్రేమ రెట్టింపవుతాయి. మరో విషయం ఏంటంటే.. ఇలాంటి నమ్మకమైన జంటల మధ్యలో మూడో వ్యక్తి కల్పించుకొని ఇద్దరిలో ఒకరి మీద కంప్లైంట్‌ చేయాలని చూసినా.. దాన్నీ వీళ్లు కలిసే ఎదుర్కొంటారని, తద్వారా ఇద్దరి మధ్య అన్యోన్యత మరింతగా రెట్టింపవుతుందని చెబుతున్నారు నిపుణులు.

ఇచ్చిపుచ్చుకుంటారు!

ఏ విషయంలోనైనా భార్యాభర్తల మధ్య సమతుల్యత ఉన్నప్పుడే బంధం బలపడుతుంది. అయితే కొన్ని జంటల్లో.. ఎప్పుడూ భాగస్వామే బహుమతులివ్వాలి, ప్రశంసించాలి, ఫలానా పని తనే చేయాలి.. అనుకుంటుంటారు. దీనివల్ల తీసుకునే వారికి బాగానే ఉంటుంది.. కానీ ఇచ్చే వాళ్లకే తామూ అవతలి వారి ప్రేమను పొందలేకపోతున్నామన్న అసంతృప్తి ఉంటుంది. ఇదీ అనుబంధంలో కలతలకు కారణమవుతుంది. అయితే ఒకరిపై ఒకరు నమ్మకంతో ఉండే జంటలు.. అది ప్రేమైనా, బహుమతైనా, గౌరవమైనా, ప్రశంసలైనా.. ఇలా ప్రతిదీ ఇచ్చిపుచ్చుకుంటారని చెబుతున్నారు నిపుణులు. అలాగే భాగస్వామి అవసరాలు తెలుసుకొని.. దాన్ని బట్టి మసలుకుంటారని అంటున్నారు. ఈ సమ భావనే ఇద్దరినీ కలిపి ఉంచుతుందనడంలో సందేహం లేదు.

అన్నింట్లోనూ అండగా..!

భార్య, భర్త.. ఇద్దరూ కలిస్తేనే కుటుంబం. అది విజయవంతంగా ముందుకెళ్లాలంటే వ్యక్తిగతంగానే కాదు.. వృత్తి/కెరీర్‌ పరంగానూ ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలంటున్నారు నిపుణులు. ఒకరిపై ఒకరు అపారమైన నమ్మకముంచే జంటలు పాటించే రిలేషన్‌షిప్‌ టిప్‌ ఇదేనంటున్నారు. దీనివల్ల ఇద్దరి సంపాదన ఇంటిని ఆర్థికంగా నిలబెడుతుంది. ఆలుమగలిద్దరూ ఏ విషయంలోనైనా ఏకతాటిపైకి వచ్చి, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తద్వారా పిల్లల భవిష్యత్తూ బాగుంటుంది. ఇలాంటి కుటుంబానికి/జంటకు సమాజంలోనూ మంచి గౌరవం దక్కుతుంది.. నలుగురికీ ఆదర్శంగా నిలవగలుగుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్