Manisha Ropeta : అది నిరూపించడానికే పోలీసునయ్యా!

విదేశాల్లో స్థిరపడిన ఎంతోమంది భారతీయులు అత్యున్నత పదవుల్ని అధిరోహిస్తూ చరిత్ర సృష్టించడం పరిపాటే! అయితే పాకిస్థాన్‌ వంటి పురుషాధిపత్యం ఉన్న దేశంలో మహిళలు అరుదైన రంగాల్లో రాణించడమే గొప్పనుకుంటే.. ఓ హిందూ మహిళ పోలీసు అధికారిగా బాధ్యతలు చేపట్టడమంటే చరిత్రనే చెప్పాలి. అలాంటి అరుదైన ఖ్యాతిని తన పేరిట లిఖించుకుంది...

Updated : 29 Jul 2022 19:29 IST

(Photo: Twitter)

విదేశాల్లో స్థిరపడిన ఎంతోమంది భారతీయులు అత్యున్నత పదవుల్ని అధిరోహిస్తూ చరిత్ర సృష్టించడం పరిపాటే! అయితే పాకిస్థాన్‌ వంటి పురుషాధిపత్యం ఉన్న దేశంలో మహిళలు అరుదైన రంగాల్లో రాణించడమే గొప్పనుకుంటే.. ఓ హిందూ మహిళ పోలీసు అధికారిగా బాధ్యతలు చేపట్టడమంటే చరిత్రనే చెప్పాలి. అలాంటి అరుదైన ఖ్యాతిని తన పేరిట లిఖించుకుంది 26 ఏళ్ల మనీషా రొపేటా. ‘సింధ్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ కమిషన్‌ పరీక్ష’లో 16వ స్థానంలో నిలిచిన ఆమె.. పాక్‌ పోలీస్‌ శాఖలో డీఎస్పీగా ఎంపికైన తొలి హిందూ మైనార్టీ మహిళగా ఘనత సాధించింది. విద్యావంతుల కుటుంబంలోనే పుట్టిపెరిగినా.. ఆడపిల్లగా సమాజం నుంచి పలు రకాలుగా వివక్ష ఎదుర్కొని ఈ స్థాయికి చేరిందామె. ఈ నేపథ్యంలో ఈ సూపర్‌ కాప్‌ కథేంటో తెలుసుకుందాం రండి..

‘పోలీసు ఉద్యోగమంటే ఓ సవాలు.. అన్యాయాల్ని మట్టుబెట్టాలన్న కసి.. ఇలాంటి ఉద్యోగానికి మహిళలు పనికి రారు.. అయినా ఇలాంటి కఠినమైన వృత్తిలో నువ్వు ఎక్కువ కాలం కొనసాగలేవు..’ పోలీసు వృత్తిని ఎంచుకున్నప్పుడు బంధువులు, సమాజం నుంచి మనీషా ఎదుర్కొన్న మాటలివి. ఆమె తండ్రి సింధ్‌ ప్రావిన్స్‌లోని జకోబాబాద్‌లో వ్యాపారం చేసేవారు. అయితే మనీషకు 13 ఏళ్లున్నప్పుడే తండ్రి చనిపోవడంతో.. కుటుంబ భారమంతా తల్లిపైనే పడింది. ఆమెతో పాటు తన ముగ్గురు అక్కలు, తమ్ముడిని తన తల్లే కష్టపడి చదివించిందని చెబుతున్నారు మనీష.

డాక్టర్ కావాలనుకొని..!

మనీషది మధ్యతరగతి కుటుంబమే అయినా.. సంప్రదాయ విలువలకు, చదువుకు ప్రాధాన్యమిచ్చే ఫ్యామిలీ. ఈ క్రమంలోనే ఆమె ముగ్గురు అక్కలు వైద్య వృత్తిలో స్థిరపడ్డారు.. తమ్ముడు కూడా ప్రస్తుతం మెడిసిన్‌ చదువుతున్నాడు. ఇలా వాళ్ల స్ఫూర్తితో తానూ వైద్యురాలు కావాలనుకుంది మనీష. కానీ మనమొకటి తలిస్తే.. విధి మరొకటి తలచినట్లు.. ఒకే ఒక్క సంఘటనతో తన నిర్ణయాన్ని మార్చుకున్నానంటోందామె.

‘చిన్న వయసు నుంచి నేను, నా ముగ్గురు సోదరీమణులు ఒక రకమైన సంప్రదాయ వాతావరణంలో పెరిగాం. ఆడపిల్లలు ఆసక్తి ఉంటే ఉన్నత చదువులు చదువుకోవచ్చు.. కానీ టీచర్‌, డాక్టర్‌.. వంటి రంగాల్లో మాత్రమే స్థిరపడాలని చెప్పేవారు. ఆ మాటలే మాలో బలంగా నాటుకుపోయాయి. అందుకే మేమంతా డాక్టర్‌ వృత్తిలోకి వెళ్లాలనుకున్నాం. నేను తప్ప మిగతా నలుగురు తోబుట్టువులు ఇదే రంగంలో ఉన్నారు. అయితే నేనూ ఎంబీబీఎస్‌ ప్రవేశ పరీక్ష రాశాను. కానీ ఒక్క మార్కుతో అర్హత సాధించలేకపోయా. చాలా బాధనిపించింది.. అదే సమయంలో కసి కూడా పెరిగింది. ఈ క్రమంలోనే వైద్య వృత్తి కాకుండా పురుషాధిపత్యం ఉన్న పోలీస్‌ వ్యవస్థలోకి వెళ్లాలనిపించింది. ఈ ఆలోచనే నా జీవితాన్ని మలుపు తిప్పింది..’ అంటూ చెప్పుకొచ్చిందీ సూపర్ కాప్‌.

వాళ్ల మాటలు తప్పని నిరూపిస్తా!

‘సింధ్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ కమిషన్‌ పరీక్షలు’ రాసి.. 468 మంది అభ్యర్థులతో పోటీ పడి 16వ ర్యాంక్‌ సంపాదించిన మనీషా.. పాకిస్థాన్‌ పోలీస్‌ శాఖలో డీఎస్పీగా ఎంపికైన తొలి హిందూ మైనార్టీ మహిళగా ఘనత సాధించింది. ప్రస్తుతం శిక్షణలో ఉన్న ఆమెకు.. నేరాలు ఎక్కువగా జరిగే ల్యారి అనే ప్రాంతంలో పోస్టింగ్‌ ఇవ్వనున్నారట! అయితే తాను ఉద్యోగంలో చేరాక.. ఈ రంగంలోకి మరింత మంది మహిళలు వచ్చేలా స్ఫూర్తి నింపుతానంటోంది మనీషా.

‘మన సమాజంలో మహిళల్ని లక్ష్యంగా చేసుకొని ఎంతోమంది నేరాలకు పాల్పడుతున్నారు. వారికి రక్షణ కవచంగా ఓ మహిళ ఉంటే బాగుంటుందనేది నా భావన. నేను పోలీస్‌ రంగంలోకి అడుగుపెట్టడానికి ఇదీ ఓ కారణమే! వృత్తిలో చేరాక పోలీస్‌ వ్యవస్థలో లింగ సమానత్వానికి కృషి చేస్తా. మరింత మంది ఈ వృత్తిలోకి వచ్చేలా మహిళల్లో స్ఫూర్తి నింపడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తా. నేను పోలీస్‌ వృత్తిలో చేరతానన్నప్పుడు మా బంధువులు, చుట్టుపక్కల వాళ్లు.. ‘అదో కఠినమైన వృత్తి.. ఒకవేళ చేరినా అందులో నువ్వు ఎక్కువ కాలం కొనసాగలేవు..’ అన్నారు. వాళ్ల మాటలు తప్పు అని నిరూపించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి..’ అంటూ తన పవర్‌ఫుల్‌ మాటలతోనూ మహిళల్లో స్ఫూర్తి నింపుతోందీ పోలీసాఫీసర్‌. అంతేకాదు.. మనీషాకు టీచింగ్‌ నైపుణ్యాలూ ఉన్నాయి. ఈ క్రమంలోనే వీలు చిక్కినప్పుడల్లా అక్కడి విద్యార్థులకు పలు అంశాలపై పాఠాలు కూడా చెబుతుంటారామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్