Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!

అందాల పోటీలంటే అందరికీ ఆసక్తే! ఏటికేడు జరిగే ఈ పోటీల్లో ఏయే దేశాల నుంచి ఎవరెవరు ముద్దుగుమ్మలు పాల్గొంటున్నారు? వాళ్ల ప్రత్యేకతలేంటో? తెలుసుకోవాలని చాలామంది ఆరాటపడడం చూస్తుంటాం. అలా ఈసారి జరగబోయే ‘విశ్వ సుందరి’ పోటీల్లో రుమీ అల్‌ ఖతానీ పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది.

Published : 27 Mar 2024 21:09 IST

(Photos: Instagram)

అందాల పోటీలంటే అందరికీ ఆసక్తే! ఏటికేడు జరిగే ఈ పోటీల్లో ఏయే దేశాల నుంచి ఎవరెవరు ముద్దుగుమ్మలు పాల్గొంటున్నారు? వాళ్ల ప్రత్యేకతలేంటో? తెలుసుకోవాలని చాలామంది ఆరాటపడడం చూస్తుంటాం. అలా ఈసారి జరగబోయే ‘విశ్వ సుందరి’ పోటీల్లో రుమీ అల్‌ ఖతానీ పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది. ఇందుకు కారణం.. ఆమె సౌదీ మహిళ కావడమే! నిజానికి సౌదీ మహిళలు ఇలాంటి అంతర్జాతీయ అందాల పోటీల్లో పాల్గొంటుండడం ఇదే తొలిసారి కావడం విశేషం! ఇలా ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగబోయే ‘మిస్‌ యూనివర్స్‌’ పోటీల్లో పాల్గొనబోతున్న తొలి సౌదీ అరేబియన్‌ అమ్మాయిగా చరిత్రలో నిలిచిపోనుంది రుమీ. ఈ నేపథ్యంలో ఈ అందాల రాశి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

‘తొలి’ మహిళగా!

సౌదీ అరేబియాలో మహిళలపై ఎలాంటి ఆంక్షలుంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కానీ ఇటీవలి కాలంలో పలు ఆంక్షల్ని సడలిస్తున్నారు. ఈ క్రమంలోనే మహిళా డ్రైవర్లపై నిషేధం ఎత్తివేయడం, ఆహార్యం విషయంలో పెట్టిన నిబంధనల్ని సడలించడం, పురుషుల తోడు లేకుండా బయటికి వెళ్లే స్వేచ్ఛను అక్కడి మహిళలకు కల్పించడం.. వంటి మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే అందాల పోటీల్లో పాల్గొనే విషయంలోనూ నియమాల్ని సడలించిందీ దేశం. ఇప్పటిదాకా అంతర్గతంగా జరిగే అందాల పోటీల్లో పాల్గొనేందుకు అక్కడి మహిళలకు అనుమతిచ్చిన ఈ దేశం.. తొలిసారి అంతర్జాతీయంగా జరిగే అందాల పోటీల్లో పాల్గొనేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగబోయే ‘మిస్‌ యూనివర్స్‌’ పోటీల్లో ఈ దేశం కూడా పాల్గొననుంది. విశ్వ సుందరి పోటీల్లో సౌదీ తరఫున 27 ఏళ్ల రుమీ అల్‌ ఖతానీ పోటీ పడనుంది. తద్వారా ‘మిస్‌ యూనివర్స్‌’ పోటీల్లో పాల్గొననున్న తొలి సౌదీ అరేబియన్‌ మహిళగా చరిత్ర సృష్టించనుంది రుమీ.


ఈ డాక్టరమ్మ ప్రత్యేకతలివే!

⚛ రుమీ రియాద్‌లో పుట్టి పెరిగింది. చిన్నతనం నుంచి ఎంతో ముద్దుగా, క్యూట్‌గా ఉండే ఆమెకు అందాల పోటీల్లో పాల్గొనాలన్నది కోరిక. టీనేజ్‌ దశ నుంచే ఇటువైపుగా అడుగులు వేసిన ఆమె.. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది.

⚛ అందాల పోటీలపై ఎంత మక్కువ ఉన్నా చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు రుమీ. దంత వైద్యంలో డిగ్రీ పట్టా పుచ్చుకుంది.

⚛ కొత్త విషయాలు తెలుసుకోవడమన్నా, కొత్త భాషలు నేర్చుకోవడమన్నా ఈ ముద్దుగుమ్మకు చాలా ఇష్టమట! ఈ మక్కువతోనే అరబ్‌, ఫ్రెంచ్‌, ఇంగ్లిష్‌ భాషల్ని అనర్గళంగా మాట్లాడడం నేర్చుకున్న రుమీ.. మరిన్ని భాషలు నేర్చుకునే పనిలో ఉన్నానంటోంది.

⚛ తన వ్యక్తిగత, కెరీర్‌ అనుభవాల్ని నలుగురితో పంచుకోవడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది రుమీ. ఈ క్రమంలోనే మోడల్‌గా తాను సాధించిన ఘనతల్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ నెటిజన్ల ప్రశంసలందుకుంటుంటుందీ సౌదీ భామ.

⚛ ఫ్యాషన్‌, అందం, లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై అందరిలో అవగాహన కల్పిస్తూ పోస్టులు పెట్టే రుమీ.. కంటెంట్‌ క్రియేటర్‌గానూ పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఇన్‌స్టాలో ఆమెను 10 లక్షల మంది ఫాలో అవుతున్నారు.

⚛ ప్రయాణాలంటే ఈ అందాల బొమ్మకు మక్కువ ఎక్కువట! తాను సందర్శించే దేశాలు, అక్కడి ప్రత్యేకతల్ని ఫొటోలు, రీల్స్‌ రూపంలో సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటుంటుందీ సౌదీ అందం.

⚛ విభిన్న ఫ్యాషన్స్‌ని ఫాలో అవడం, కొత్త ఫ్యాషన్లను ప్రయత్నించడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది రుమీ. ఫ్యాషనబుల్‌ దుస్తుల్లో మెరిసిపోతూ రుమీ తీయించుకున్న ఫొటోషూట్స్‌ని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయగా.. అవి వైరలవుతుంటాయి. ఇలా ‘ఫ్యాషన్‌ క్వీన్‌’గానూ పేరు తెచ్చుకుందీ క్యూటీ.

⚛ తన వద్ద ఉన్న ఖరీదైన వస్తువులు, యాక్సెసరీస్‌, వాటికి సంబంధించిన ఫొటోల్నీ అందరితో పంచుకోవడానికి ఇష్టపడతానంటోంది రుమీ. ఇలా ఆమె వద్ద ఉన్న లగ్జరీ జ్యుయలరీ కలెక్షన్‌కు నెటిజన్లు ఫిదా అవుతుంటారు.

⚛ ‘తన కుటుంబమే తన బలం’ అనే రుమీ.. తన కుటుంబ సభ్యులు, సోదరీమణులతో దిగిన ఫొటోల్ని ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో షేర్‌ చేస్తుంటుంది.

⚛ ఒకటి కాదు, రెండు కాదు.. ఇప్పటికే పలు అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది రుమీ. ఈ క్రమంలో ‘మిస్‌ సౌదీ అరేబియా’, ‘మిస్‌ అరబ్‌ పీస్‌’, ‘మిస్‌ ఉమన్‌ సౌదీ అరేబియా’, ‘మిస్‌ యూరప్‌ సౌదీ అరేబియా’, ‘మిస్‌ ప్లానెట్‌ సౌదీ అరేబియా’, ‘మిస్‌ మిడిల్‌ ఈస్ట్‌ సౌదీ అరేబియా’, ‘మిస్‌ అరబ్‌ యునిటీ సౌదీ అరేబియా’, ‘మిస్‌ ఆసియా సౌదీ అరేబియా’.. వంటి టైటిళ్లు గెలిచిందీ అందాల భామ.

⚛ ‘ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సమానత్వంతో జీవించే హక్కు ఉంది. వయసు, స్త్రీ-పురుష భేదాలు, శక్తి సామర్థ్యాలు, ఆహార్యం/శరీరాకృతి పరంగా ఎవరూ వివక్షకు గురికాకూడదు. అప్పుడు వాళ్లు తమ ప్రత్యేకతల్ని చాటుకోగలుగుతారు..’ అంటూ తన మాటలతోనూ అందరితో స్ఫూర్తి నింపే రుమీ.. సోషల్‌ మీడియా వేదికగా ఇలాంటి ప్రేరణాత్మక పోస్టులు పెడుతుంటుంది.

⚛ ఇక ఈ ఏడాది జరగబోయే ‘మిస్‌ యూనివర్స్‌’ పోటీల్లో తన దేశం తరఫున పాల్గొంటున్నందుకు ఉబ్బితబ్బిబ్బవుతోన్న ఈ ముద్దుగుమ్మ.. ‘మిస్‌ యూనివర్స్‌-2024 పోటీల్లో నా దేశానికి ప్రాతినిథ్యం వహించడం గర్వంగా ఉంది. ఈ ఏడాది తొలిసారిగా నా దేశం ఈ పోటీల్లో పోటీ పడుతుండడం, అదీ నేనే తొలి పార్టిసిపెంట్‌ని కావడం చాలా సంతోషంగా ఉంది..’ అంటూ తాజాగా సోషల్‌ మీడియా పోస్ట్‌ రూపంలో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్