Obama Love Story: 30 ఏళ్ల మా అనుబంధం వెనుక..!

కొన్ని జంటల్ని చూస్తే ముచ్చటేస్తుంది.. చూసీ చూడగానే వారి మధ్య ఏదో గాఢమైన ప్రేమానుబంధం దాగుందనిపిస్తుంది. ఆ రహస్యమేంటో తెలుసుకొని మనమూ ఫాలో అయితే బాగుంటుందనిపిస్తుంది. ఇలాంటి అనురాగానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుంటారు సెలబ్రిటీ కపుల్‌ బరాక్‌....

Updated : 04 Jan 2023 12:45 IST

(Photos: Instagram)

కొన్ని జంటల్ని చూస్తే ముచ్చటేస్తుంది.. చూసీ చూడగానే వారి మధ్య ఏదో గాఢమైన ప్రేమానుబంధం దాగుందనిపిస్తుంది. ఆ రహస్యమేంటో తెలుసుకొని మనమూ ఫాలో అయితే బాగుంటుందనిపిస్తుంది. ఇలాంటి అనురాగానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుంటారు సెలబ్రిటీ కపుల్‌ బరాక్‌ ఒబామా-మిచెల్‌ ఒబామా జంట. వీలు చిక్కినప్పుడల్లా తమ వైవాహిక బంధంలోని మధురమైన జ్ఞాపకాల్ని నెమరువేసుకునే ఈ క్యూట్‌ కపుల్‌.. తమ అనుబంధంలో చెరిగిపోని అనుభూతులతో పాటు కొన్ని ఆటుపోట్లు కూడా ఉన్నాయంటోంది. ఈ క్రమంలోనే ఒకానొక దశలో తన భర్త ఒబామాను పదేళ్ల పాటు భరించలేకపోయానంటూ తమ జీవితాల్లోని మరో కోణాన్ని ఇటీవలే ఓ సందర్భంలో బయటపెట్టారు మిచెల్‌. అయితే ఆ ప్రతికూల సమయంలో ఓపిక వహించి సర్దుకుపోవడం వల్లే సమస్యలు సద్దుమణిగాయంటూ చెప్పుకొచ్చారామె. దాంపత్య బంధం శాశ్వతమవ్వాలంటే ఇలాంటి సవాళ్లను ఓర్పుతో ఎదుర్కోవాలంటోన్న ఈ పాపులర్‌ కపుల్‌.. తమ 30 ఏళ్ల వైవాహిక బంధం వెనకున్న రహస్యాల గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి..

లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్!

కొందరికి కొంతమందిని చూడగానే తొలి చూపులోనే ప్రేమ పుట్టేయచ్చు.. మిచెల్ ఒబామాదీ ఇలాంటి తొలి చూపు ప్రేమ కథే! ఒబామా ‘హార్వర్డ్‌ లా స్కూల్‌’లో సమ్మర్‌ ఇంటర్న్‌గా చేరిన సమయంలో మిచెల్ ను చూసి ‘పెళ్లంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాల’ని నిర్ణయించుకున్నారట. మిచెల్‌కు కూడా ఒబామాపై ఇష్టమున్నా తన మనసులోనే దాచుకుందే తప్ప బయటికి చెప్పలేదు. ఇక తొలి డేట్‌లో భాగంగా సినిమాకు వెళ్లిన ఈ జంట మధ్య అన్యోన్యత రోజురోజుకీ పెరుగుతూ వచ్చింది. అదే సమయంలో.. మిచెల్‌ మనసులో తనపై ఉన్న ఫీలింగ్‌ ఏంటో తెలుసుకోవాలనుకున్న ఒబామా.. ఇద్దరూ తరచూ వెళ్లే రెస్టరంట్‌లో ప్రత్యేక సర్‌ప్రైజ్‌ ఏర్పాటుచేశాడు. డెజర్ట్‌ ట్రేలో ఉంగరాన్ని ఉంచి తన నెచ్చెలికి ప్రేమ ప్రతిపాదన చేశాడు. ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నానన్నట్లుగా మిచెల్‌ కూడా వెంటనే ఓకే చెప్పేసింది. ఇలా 1991లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. 1992లో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. వీరి ప్రేమకు గుర్తుగా సాషా, మలియా అనే ఇద్దరు కూతుళ్లు పుట్టారు. ‘నేను నీకు మణులు, మాణిక్యాలు ఇవ్వలేకపోవచ్చు.. కానీ నిన్ను జీవితాంతం సంతోషంగా చూసుకుంటానని బాస చేస్తున్నా..’ అంటూ పెళ్లి నాడు ఒబామా చేసిన ప్రమాణాన్ని గుర్తుకు తెచ్చుకున్న మిచెల్‌.. ఇప్పటికీ తనను అలాగే చూసుకుంటున్నాడంటూ మురిసిపోతోంది.

దారులు వేరైనా.. ప్రేమ తగ్గదు!

అభిరుచులు, ఇష్టాయిష్టాలు కలిస్తేనే ఆ దాంపత్య బంధం దృఢంగా ఉంటుందనుకుంటారు కొందరు. తాను మాత్రం ఇది అస్సలు నమ్మనంటున్నారు మిచెల్‌. ఎందుకంటే చాలా విషయాల్లో తనకు, తన భర్తకు పొంతన కుదరదని, అయినా ఒకరి ఇష్టాయిష్టాల్ని మరొకరు గౌరవిస్తూ ముందుకు సాగడం తమకు అలవాటని చెబుతున్నారామె.

‘దాంపత్య బంధం దృఢంగా ఉండాలంటే ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలే కానీ.. తమకు నచ్చినట్లుగానే ఉండాలన్న అజమాయిషీ ఉండకూడదు. మా ఇద్దరి విషయానికొస్తే.. మా దారులు పూర్తిగా విభిన్నం. అభిరుచులు, ఇష్టాయిష్టాలు చాలావరకు భిన్నంగా ఉంటాయి. ఒబామాకు ఒంటరిగా ఉండడమంటే ఇష్టం. అదే నేనైతే.. ఎక్కువ మందితో కలిసిపోవడానికి ఇష్టపడతా. ఇక నా దృష్టిలో ఒబామా ఎప్పుడూ గోల్ఫ్‌ ఆడడానికే సమయం కేటాయిస్తాడనిపిస్తుంటుంది. వీలు చిక్కినప్పుడల్లా నేను టీవీలోనే లీనమైపోతానని తను అనుకుంటాడు. ఇలా ఎవరి అభిరుచులు వారివైనప్పటికీ.. ఒకరినొకరు గౌరవించుకోవాలన్న ఒక ప్రేమపూర్వకమైన ఒప్పందం మా మధ్య ఉంది. అదే మా వైవాహిక జీవితాన్ని నిత్యనూతనం చేస్తోంది. దాంపత్య బంధాన్ని శాశ్వతం చేసుకోవాలంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న త్యాగాలు, సర్దుబాట్లు, రాజీలు.. తప్పనిసరిగా ఉండాల్సిందే..!’ అంటూ తమ సుదీర్ఘ వివాహ బంధంలోని సీక్రెట్స్‌ని బయటపెట్టిందీ మిసెస్‌ ఒబామా.

తను లేని నేను లేను!

భార్యాభర్తలంటే ప్రతి విషయంలోనూ పారదర్శకంగా ఉండాలి.. ఏ నిర్ణయమైనా ఇద్దరూ కలిసి తీసుకుంటేనే అది ఫలవంతమవుతుంది. ఈ సిద్ధాంతాన్ని తానూ నమ్ముతానంటున్నాడు ఒబామా. ప్రతి విషయంలోనూ తన ఇష్టసఖి మనసు తెలుసుకున్నాకే.. అడుగు ముందుకు వేస్తానంటున్నాడీ స్వీట్‌ హబ్బీ.

‘నాకు తెలిసిన తెలివైన వ్యక్తుల్లో నా భార్య మిచెల్‌ ఒకరు. వృత్తిలోనే కాదు.. వ్యక్తిగతంగానూ తన సలహాల్ని స్వీకరిస్తా. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు తన అభిప్రాయం కూడా తెలుసుకుంటా. ఆ తర్వాతే అడుగు ముందుకేస్తా. తన బలం, పట్టుదల, అంకితభావం.. నన్నెప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తను నాకు భార్యగా, నా ఇద్దరు పిల్లలకు తల్లిగానే కాదు.. అంతకుమించి నా బెస్ట్‌ ఫ్రెండ్‌గానూ నా జీవితంలో భాగమైంది. మిచెల్.. నువ్వు లేని నా జీవితం అసంపూర్ణమే!’ అంటూ తన అర్ధాంగిపై తనకున్న ప్రేమను ఓ సందర్భంలో గుదిగుచ్చారు ఒబామా.

ఆ పదేళ్లు బాధపడ్డా!

పెళ్లి, పిల్లలు.. ప్రతి ఒక్కరి జీవితాన్ని పరిపూర్ణం చేస్తాయి. అయితే ఇలా ఇంటి బాధ్యతల్ని నిర్వర్తించే క్రమంలో కెరీర్‌పై దృష్టి పెట్టడమంటే సవాలే! ఈ క్రమంలో ఓపిక నశించి ఒక్కోసారి ‘ఈ పెళ్లెందుకు చేసుకున్నానో..’ అనిపించకమానదు. ఒకానొక దశలో తన మనసులోనూ ఇలాంటి ప్రతికూల ఆలోచనలే నిండిపోయాయంటున్నారు మిచెల్.

‘మా 30 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక ప్రయాణంలో మధురానుభూతులు లెక్కకు మిక్కిలే ఉన్నాయి. అయితే వాటితో పాటు కొన్ని ఒడిదొడుకుల్నీ ఎదుర్కొన్నాం. ముఖ్యంగా మా ఇద్దరు పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు.. మేం మా కెరీర్స్‌పై దృష్టి పెట్టాం. దీంతో అటు వాళ్ల ఆలనాపాలన చూసుకోవడం, ఇటు మా వృత్తి జీవితాన్ని బ్యాలన్స్‌ చేసుకోవడం చాలా కష్టమనిపించేది. ఆ సమయంలో నా భర్తను కూడా భరించలేకపోయా. ఈ ఒత్తిడిలోనే పదేళ్లు గడిచిపోయాయి. నిజానికి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనే సంయమనం పాటించాలి. దాంపత్య బంధంలో కలతలున్నా సర్దుకుపోయే నేర్పు కావాలి. ఆ సమయంలో నేనూ ఇంత ఓపికతో ఉన్నాను కాబట్టే మా బంధం నిలబడింది. ఒబామాపై నాకున్న ప్రేమ, గౌరవమర్యాదలు ఇప్పటికీ ఇసుమంతైనా తగ్గలేదు. కొన్నిసార్లు భర్తది పైచేయి కావచ్చు.. మరికొన్నిసార్లు భార్య పరిణతితో ఆలోచించచ్చు. ఆలుమగలిద్దరూ ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడే.. ఎలాంటి గొడవల్లేకుండా సంసారం సాఫీగా సాగిపోతుంది..’ అంటూ చెప్పుకొచ్చారు మిచెల్.
ఇవే కాదు.. తమ 30 ఏళ్ల అన్యోన్య దాంపత్య బంధంలో తమకెదురైన అనుభవాలు, అనుభూతులు, సవాళ్లు.. వంటివెన్నో రంగరించి ‘The Light We Carry: Overcoming in Uncertain Times’ పేరుతో ఓ పుస్తకం కూడా రాశారు మిచెల్‌. ఇలా ప్రతి సందర్భంలోనూ తమ సుదీర్ఘ అనుబంధంలోని సీక్రెట్స్‌ని బయటపెడుతూ.. ఎన్నో జంటలకు ఆదర్శంగా నిలుస్తున్నారీ లవ్లీ కపుల్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్