Miss Universe 2022: గౌను వెనుక.. కళ్లు చెమర్చే గాథ..!

అందాల పోటీలంటే చాలామందికి ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా ‘మిస్‌ యూనివర్స్‌’ వంటి పోటీల్లో ఏ దేశానికి చెందిన సుందరి టైటిల్‌ సొంతం చేసుకుంటుందా? అని ఎదురుచూస్తుంటారు. 2021 పోటీల్లో మన దేశానికి చెందిన హర్నాజ్‌ సంధు విశ్వసుందరిగా నిలిచిన....

Published : 14 Jan 2023 14:53 IST

(Photos: Instagram)

అందాల పోటీలంటే చాలామందికి ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా ‘మిస్‌ యూనివర్స్‌’ వంటి పోటీల్లో ఏ దేశానికి చెందిన సుందరి టైటిల్‌ సొంతం చేసుకుంటుందా? అని ఎదురుచూస్తుంటారు. 2021 పోటీల్లో మన దేశానికి చెందిన హర్నాజ్‌ సంధు విశ్వసుందరిగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా 2022కి గాను జనవరి 14న తుది పోటీలు జరగనున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం జరిగిన ప్రాథమిక పోటీల్లో థాయిలాండ్ సుందరి అన్నా (Anna Sueangam-iam) తన గౌనుతో వైరల్‌గా మారింది. వాడి పడేసిన కూల్‌డ్రింక్‌ మూతలతో రూపొందించిన గౌనులో దర్శనమిచ్చి పలువురిని ఆకట్టుకుంది. దాంతో టైటిల్ గెలవకముందే ఆమె పేరు సెన్సేషన్‌గా మారింది. అయితే పాపులర్‌ కావడం కోసం తనిలా చేసిందనుకుంటే పొరపాటే. దీని వెనుక బాధాకరమైన గతం ఉందంటోంది అన్నా.

గోల్డ్‌మెడల్‌ సాధించి...

థాయిలాండ్‌కు చెందిన అన్నా ఓ పేద కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు బ్యాంకాక్‌ మెట్రోపాలిటన్‌ అడ్మినిస్ట్రేషన్‌లో చెత్త సేకరిస్తుంటారు. దాంతో ఆమె బాల్యమంతా చెత్తకుప్పలు, వాడి పడేసిన వస్తువులతోనే సాగింది. అలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో మోడల్‌ కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తల్లిదండ్రులు ఉదయం మూడు గంటలకు బయటకు వెళ్తే రాత్రి ఏడు గంటలకు ఇంటికి చేరుకునేవారు. దాంతో ఆమె ఎక్కువ సమయం నాయనమ్మ దగ్గరే గడిపేది. తల్లిదండ్రుల సంపాదన కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. దాతలు ఇచ్చే సహాయం మీద ఆధారపడేవారు. అయితే అన్నా తల్లిదండ్రులు వారిలాగా తమ పాప భవిష్యత్తు ఉండకూడదని తనని స్థానిక పాఠశాలలో చేర్పించారు. తన లక్ష్యం మరువని అన్నా చదువులో చక్కటి ప్రతిభ కనబరిచేది. దాంతో ఆమె తల్లిదండ్రులు వారి స్తోమతకు మించిన పాఠశాలలో ఉన్నత తరగతులు చదివించారు. అందుకు తగ్గట్టే అన్నా కష్టపడి చదివి బ్యాచిలర్‌ ఆఫ్ ఆర్ట్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించింది.

లక్ష్యాన్ని మరువలేదు..!

అన్నా ఒకవైపు చదువులో రాణిస్తూనే తన లక్ష్యాన్ని ఏమాత్రం మరువలేదు. ఎక్కడ అందాల పోటీలు జరిగినా వాటిలో పాల్గొనేది. కొన్ని సందర్భాల్లో టైటిల్‌ కూడా సొంతం చేసుకునేది. ఈ క్రమంలో ‘మిస్‌ థాయిలాండ్‌ 2020’ పోటీల్లో పాల్గొని ‘టాప్‌ 16’లో చోటు సంపాదించుకుంది. ఆ తర్వాత జరిగిన ‘మిస్‌ యూనివర్స్‌ థాయిలాండ్‌ 2022’ పోటీల్లో టైటిల్‌ సంపాదించి తన కలను సాకారం చేసుకుంది. అంతేకాదు.. గతం ఏవిధంగా ఉన్నా.. అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చని నిరూపించింది.

గతం.. గౌను ద్వారా..!

‘మిస్‌ యూనివర్స్‌ థాయిలాండ్‌ 2022’ టైటిల్‌ గెలుచుకోవడంతో అన్నా ‘విశ్వ సుందరి’ పోటీలకు అర్హత సాధించింది. అందాల పోటీల్లో పాల్గొనే అమ్మాయిలకు అందం, ప్రతిభ ఎంత ముఖ్యమో వస్త్రధారణ కూడా అంతే ముఖ్యం. అందుకే ఈ పోటీల్లో పాల్గొనే సుందరీమణులు కళ్లు చెదిరే డ్రస్సులతో అలరిస్తుంటారు. కానీ అన్నా మాత్రం తన బాల్యాన్ని తన డ్రస్సు ద్వారా ప్రపంచానికి తెలియజేయాలనుకుంది. ఈ క్రమంలో డిజైనర్‌ చేత చెత్త నుంచి సేకరించిన కూల్‌డ్రింక్‌ మూతలతో గౌన్‌ను తయారు చేయించుకుంది. లుక్‌ కోసం ఆ మూతల మధ్యలో స్వరోవ్‌స్కీ డైమండ్స్ వచ్చేలా జాగ్రత్తపడింది. ఈ గౌనుతోనే అన్నా రెండు రోజుల క్రితం జరిగిన ప్రాథమిక పోటోల్లో పాల్గొంది. తద్వారా తుది పోటీలకు ముందే వైరల్‌గా మారిపోయింది.

ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తన అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘ఈ గౌనులో నా బాల్యం దాగుంది. నా తల్లిదండ్రులు చెత్తను సేకరించేవారు. నా బాల్యమంతా చెత్తకుప్పలు, వాడి పడేసిన వస్తువులతోనే  సాగింది. అందుకే అందరూ వాడి పడేసిన కూల్‌డ్రింగ్‌ మూతలతో ఈ గౌన్‌ను డిజైన్ చేయించాను. పనికిరాని వస్తువులకు కూడా అందం, విలువ ఉంటాయని దీని ద్వారా ప్రపంచానికి చూపించాలనుకున్నాం. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ చెప్పుకొచ్చింది.

కాగా, ఈ పోటీల్లో భారత్‌ తరఫున ‘మిస్‌ దివా యూనివర్స్‌’ దివితా రాయ్‌ ప్రాతినిథ్యం వహిస్తోంది.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్