Second Marriage: 63 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకుంటానంటున్నారు..!

మా నాన్నగారు ఇంటి దగ్గర ఉండే ఓ పెద్దావిడను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పారు. ఈ విషయంలో నాన్నగారికి, నాకు గొడవ కూడా జరిగింది. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు

Updated : 30 Jul 2023 14:50 IST

(Representational Image)

నేను ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాను. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. అప్పటి నుంచి నాన్నే నా బాధ్యతలు చూసుకున్నారు. ఈ క్రమంలో అమ్మ లేని లోటును ఎప్పుడూ తెలియనివ్వలేదు. గతేడాది నా పెళ్లి కావడంతో అత్తగారింటికి వెళ్లాను. దాంతో నాన్నగారు ఒంటరితనం భరించలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. నేను లేకపోవడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో ఫోన్ చేసినప్పుడల్లా చెప్పేవారు. దాంతో డిప్రెషన్‌ నుంచి బయటపడడానికి కొన్ని రకాల జాగ్రత్తలు చెప్పా. ఆయన వాటిని పాటిస్తున్నారు. అయితే ఈ మధ్యనే ఒక విషయం చెప్పి అందరినీ షాక్‌కు గురి చేశారు. మా ఇంటి దగ్గర ఉండే ఓ పెద్దావిడను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పారు. ఆవిడకు 60 ఏళ్ల వయసుంటుంది. భర్త లేడు. ఆవిడ ఈ మధ్యనే కాలనీకి వచ్చింది. అందువల్ల నాకు పెద్దగా పరిచయం లేదు. కానీ నాన్నగారు, ఆవిడ తరచుగా వాకింగ్‌, హాబీ క్లాసుల్లో కలుసుకుంటారని చెప్పారు. ఆమె కూడా కొత్త జీవితం మొదలుపెట్టడానికి ఆసక్తిగా ఉందని నాన్నగారు అంటున్నారు. అయితే ఈ పరిస్థితిని జీర్ణించుకోవడం నాకు కష్టంగా ఉంది. ఈ విషయంలో నాన్నగారికి, నాకు గొడవ కూడా జరిగింది. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. చిన్నప్పుడే మీ అమ్మగారు చనిపోయారని అంటున్నారు. మీ నాన్నగారు అమ్మలేని లోటు తెలియకుండా పెంచారని చెబుతున్నారు. అంటే మీకోసం ఆయన రెండో పెళ్లి చేసుకోలేదని అర్థమవుతోంది. ఇప్పుడు ఒక్కసారిగా మీరు దూరమవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. దాన్నుంచి బయటపడడానికి మీరు సూచించిన జాగ్రత్తలు పాటిస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే తనకు పరిచయమైన మహిళను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఇలాంటి పరిస్థితిలో ఏది సరైన మార్గమో కచ్చితంగా చెప్పలేం. సమాజంలో కొన్ని విషయాలకు సంబంధించిన కొన్ని రకాల అభిప్రాయాలు, ఆలోచనలు చెప్పడానికి, వినడానికి బాగుంటాయి. కానీ వ్యక్తిగతంగా వాటిని అమలుపరిచేందుకు కష్టంగా అనిపిస్తుంటాయి. అయితే అవి వ్యక్తిగత ప్రాధాన్యాలను బట్టి మారుతుంటాయి. ఈ పరిస్థితిలో మీ ప్రాధాన్యాలు ఏంటో ఒకసారి ఆలోచించుకోండి.

మీ నాన్నగారి నిర్ణయాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉందని అంటున్నారు. అయితే అందుకు గల కారణాలేంటో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సాధారణంగానే ఇలాంటి పరిస్థితుల్లో భిన్నాభిప్రాయాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి, మీరు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి నిర్దిష్ట కారణాలేవైనా ఉన్నట్లయితే వాటిని మీ నాన్నగారితో పంచుకోవడానికి ప్రయత్నించండి. దానివల్ల ఆయనకు మీ ఆలోచన ఏంటో స్పష్టమవుతుంది. ఏదిఏమైనా ఇది మీ నాన్నగారి వ్యక్తిగత విషయం. కాబట్టి, సాధ్యమైనంత వరకు ఆయన దృక్కోణం నుంచే చూడడానికి ప్రయత్నించండి. దానివల్ల ఆయన ఆలోచనేంటో తెలిసే అవకాశం ఉంటుంది. అప్పుడు మీ మధ్య బంధానికి ఎలాంటి హానీ లేకుండా తగిన నిర్ణయం తీసుకునే అవకాశం కలుగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్